పాపం..కోదండరామ్...!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఒకందుకు ఒప్పుకోవాలి. ఆయన నోరు తెరిచి తిట్టడం మొదలు పెట్టారంటే...ఇక అంతే...! మన వాళ్లు లేరూ...పరాయి వారూ అన్న సంగతీ చూడరు...అవతలి వారి చింతకు చీరి ఎండగడతారు...! తెలంగాణ రాక ముందు ఆయన ఆంధ్రా వారిపై ఎలా విరుచుకుపడ్డారో..అప్పట్లో అందరూ చూశారు...! అప్పట్లో 'కెసిఆర్' ఆంధ్రా వాళ్లను తిడుతుంటే...తెలంగాణ వాళ్లు తెగ సంబరపడిపోయారు..తమ నాయకుడెంతో గొప్పవాడని...ఒకటే గొప్పలు చెప్పుకున్నారు. తిట్టేనోరు..తిరిగే కాలు ఊరుకోవన్న చందంగా...ఇప్పుడు తనకు ప్రత్యర్థులనుకున్న తెలంగాణ వారిపై ఆయన తన వాగ్బాణాలను ఎక్కుపెడుతున్నారు. దీనిలో మొదట ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడిన ఆయన తరువాత తెలుగుదేశం నాయకుడు రేవంత్‌రెడ్డిపై పడ్డారు. కొన్నాళ్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై విరుచుపడిన కెసిఆర్ తరువాత వామపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు.
వామపక్షాలు, ప్రజాసంఘాలు తన పనితీరును ఎండగడుతున్నాయని, విమర్శిస్తున్నాయని వారిపై తరచూ వ్యక్తిగత విమర్శలు చేసిన ఆయన చాలా కాలం నుంచి తనపై విమర్శలు చేస్తున్న జేఎసీ ఛైర్మన్ 'కోదండరామ్'పై పడ్డారు. శనివారం నాడు విలేకరుల సమావేశంలో ఆయన తన ప్రతాపం చూపించారు. మొన్నటి ఎన్నికల దాకా తనతో కలసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తిని కూడా చూడకుండా ఎడాపెడా వాయించేశారు. తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు గుప్పిస్తూ...వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ...అసలు అతనెంత...అతని బతుకెంత...? అంటూ చెలరేగిపోయారు. ఆయన ఆగ్రహం చూసిన తెలంగాణ జర్నలిస్టులు విస్మయం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి దాకా 'కోదండరామ్'కు అపాయింట్మెంట్ ఇవ్వకుండా...తన అసంతృప్తిని బయటకు వెళ్లడించిన కెసిఆర్ సింగరేణి ఎన్నికల్లో పార్టీ గెలిచిన తరువాత ఆయనపై విశ్వరూపాన్ని చూపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో...కోదండరామ్‌తో కలసి అడుగులు వేసి...మన ఆచార్యులు,మన నాయకుడు అని సంభోదించిన కెసిఆర్...ఈ రోజు వాడూ..వీడూ అంటూ తూలనాడారు. తాను తయారు చేసిన వ్యక్తి 'కోదండరామ్' అంటూ...అటువంటి వ్యక్తులను తాను లక్షల మందిని తయారు చేశానని ప్రకటించుకున్నారు. అసలు ఒక్కసారిగా ఎందుకు 'కోదండరామ్'పై కెసిఆర్‌కు అంత కోపం వచ్చిందనే విషయంపై పలురకాలుగా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
తన వ్యతిరేకులందరినీ ఒకేతాటిపై తేవడంలో 'కోదండరామ్' కీలకంగా పనిచేస్తున్నారని, అదే సమయంలో రాబోయే ఎన్నికల నాటికి ఒక సామాజికవర్గాన్ని పూర్తిగా తనకు దూరం చేస్తున్నారనే కోపం కెసిఆర్లో ఉందట. తెలంగాణలో బలమైన ఈ సామాజికవర్గం ఇప్పుడు కెసిఆర్‌పై ఇంత వ్యతిరేకత వ్యక్తం చేయడానికి'కోదండరామ్' కారణమని కెసిఆర్ బలంగా భావిస్తున్నారట. ఇదే సమయంలో బడుగు,బలహీన, వర్గాలు కూడా దూరం కావడానికి ఆయనే కారమని ఆయన అనుకుంటున్నారట. అంతే కాకుండా నిరుద్యోగులను రెచ్చగొట్టడంలో, తన కుటుంబంపై విమర్శలు చేయించడంలో ఆయనే కీలకమని, అందుకే ఒక్కసారిగా ఆయనపై కెసిఆర్ విరుచుకుపడ్డారట. మొత్తం మీద 'కోదండరామ్'పై కెసిఆర్ వ్యాఖ్యలు చూసిన తెలంగాణ వాదులు అవాక్కు అవుతున్నారు. తమ నాయకుడు తెలంగాణ రావడంలో కీలకమైన వ్యక్తులనూ తూలనాడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. మరి ఈ విమర్శల ప్రభావం రాబోయే ఎన్నికల్లో చూపిస్తుందో..లేదో మరి...!