లేటెస్ట్

'శ్రీలక్ష్మి'కి...అలా...'పి.వి.రమేష్‌'కు ఇలా...!

వాళ్లిద్దరూ అధికార వైకాపాకు కావాల్సిన అధికారులే. ఇద్దరూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితులు, అభిమానపాత్రులు. ఆయన సిఎంగా ఉండగా...ఈ ఇద్దరు అధికారులకు ఆయన ఎక్కువ ప్రాధాన్యతే ఇచ్చారు. వై.ఎస్‌. మృతి చెందిన తరువాత...వారిలో ఒక అధికారి 'జగన్‌' అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లగా మరో అధికారి మాత్రం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోయారు. కాల చక్రం గిర్రున తిరగడం..'జగన్‌' అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. గతంలో తండ్రి వద్ద పనిచేసిన అధికారుల్లో ఒకరు తెలంగాణలో ఉండగా...మరొకరు ఢిల్లీలో ఉన్నారు. వారిలో ఒక అధికారిని ఎటువంటి ఆటంకాలు లేకుండా సిఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా 'జగన్‌' నియమించుకోగా... తెలంగాణలో ఉన్న అధికారిని ఆంధ్రాకు కేటాయించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అలా విజ్ఞప్తి చేసిన అధికారుల్లో ఒకరు 'శ్రీలక్ష్మి' కాగా మరొకరు 'పి.వి.రమేష్‌'.

ఈ ఇద్దరు అధికారులు 'జగన్‌' అధికారంలోకి రావడంతో ఆంధ్రాలో పనిచేయడానికి ఉత్సాహపడ్డారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న 'పి.వి.రమేష్‌' నేరుగా రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చి సిఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేరిపోగా..'శ్రీలక్ష్మి'ని తెలంగాణ నుంచి ఆంధ్రాకు తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆమెను ఆంధ్రాకు కేటాయించాలని తెలంగాణ ప్రభు త్వాన్ని వైకాపా ప్రభుత్వం కోరిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అయితే కేంద్రం మాత్రం అడ్డుపుల్ల వేసింది. దీంతో...ఆమె కోసం...వైకాపా సీనియర్‌ నేత, వైకాపా పార్లమెంటరీపార్టీనేత 'విజయసాయిరెడ్డి' ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి 'అమిత్‌షా'ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమెను తమ రాష్ట్రానికి కేటాయించాలని ఆమెను వెంట పెట్టుకుని.. మరీ ఆయన ఢిల్లీలో పైరవీ చేశారు. ఆయన పైరవీ ఫలితం ఏమిటో తెలియదు కానీ...ఆమెకు వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత చూసి అధికారవర్గాలు అవాక్కు అయ్యాయి. 'జగన్‌' కేసుల్లో నిందితురాలు అయిన ఆమె కోసం వైకాపా ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, ఆమె కోసం పార్లమెంటరీ పార్టీ నేతే...స్వయంగా వెళ్లి పైరవీ చేశారని..అంటున్నారు. 

అదే సమయంలో సిఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన 'పి.వి.రమేష్‌' విషయంలో పట్టించుకోలేదని కొందరు దళిత అధికారులు అంటున్నారు. సర్వీసు రికార్డులో నమోదైన పుట్టిన తేదీనీ మార్చాలని, మరో మూడు నెలలు సర్వీసు పొడిగించాలని 'పి.వి.రమేష్‌' పెట్టుకున్న విజ్ఞప్తిపై కేంద్ర తిరస్కరించింది. ఆయన అభ్యర్థనపై వైకాపా ఎంపీలు కానీ, కేంద్రంలో చక్రం తిప్పుతున్న 'విజయసాయిరెడ్డి' కానీ..పట్టించుకోలేదని, 'శ్రీలక్ష్మి' కోసం ప్రధాని,అమిత్‌షా వద్దకు వెళ్లిన 'విజయసాయిరెడ్డి' దళిత అధికారి అయిన 'రమేష్‌' కోసం వెళితే...బాగుండేదని సచివాలయ ఎస్సీ ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు అభిప్రాయపడ్డారు. 

శ్రీలక్ష్మి విషయంలో పార్టీ ఎంతో చేసిందని, 'పి.వి.రమేష్‌' విషయంలో మాత్రం అసలు పట్టించుకోలేదని, అందుకే ఆయన విజ్ఞప్తి తిరస్కారానికి గురైందంటున్నారు. కాగా..ఇక్కడే మరో మాటను కూడా వారు జోడిస్తున్నారు. ప్రస్తుతం పరిపాలన మొత్తం ఒక్క చేత్తో నిర్వహిస్తున్న 'జగన్‌' అంతరంగికుడుకు 'పి.వి.రమేష్‌' అక్కడ ఉండడం ఇష్టం లేదని, దానితోనే ఏ ఒక్క వైకాపా నాయకుడు 'పి.వి.రమేష్‌' గురించి ఢిల్లీలో పట్టించుకోలేదని చెబుతున్నారు. కాగా...దీనిపై మరి కొందరు అధికారులు స్పందిస్తూ..ఐఎఎస్‌ల విషయంలో కేంద్రం గట్టి పట్టుదలతో ఉందని, రాష్ట్రం ఏది కోరితే..అది చేయడానికి ముందుకు రావడం లేదని, నిజంగా అవసరం ఉంటేనే స్పందిస్తోందని, టిడిపితో బిజెపి సంబంధాలు బాగున్న సమయంలోనూ..ఐఎఎస్‌ అధికారుల సర్వీసు పొడిగింపు విషయంలో ఖచ్చితంగా వ్యవహరించిందని, ఇప్పుడూ అదే బాటలో వెళుతోందంటున్నారు. అందుకే 'శ్రీలక్ష్మి' విషయంలో 'విజయసాయిరెడ్డి' అంత ప్రయత్నం చేసినా..ఫలితాలు రాలేదని, 'పి.వి.రమేష్‌' విషయంలోనూ అదే జరిగిందంటున్నారు. అయితే 'శ్రీలక్ష్మి' విషయంలో వైకాపా నాయకులు వ్యవహరించిన తీరు..మీడియాలో హైలెట్‌ కాగా..రమేష్‌ గురించి ఎక్కడా రాలేదు. అగ్ర కులానికి చెందిన అధికారి విషయంలో విపరీతమైన ప్రచారం జరగగా...దళిత అధికారిని పట్టించుకోలేదనే మాట ఆ సామాజికవర్గ అధికారుల నుంచి వస్తోంది. 

(631)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ