లేటెస్ట్

‘భీమవరం’ నుండే ‘పవన్‌’పోటీ...!?

గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయిన ‘జనసేన’ అధిపతి ‘పవన్‌కళ్యాణ్‌’ ఈసారి ఎటువంటి తప్పులు చేయకుండా, ఎన్నికలను గట్టిగా ఎదుర్కోవాలని భావిస్తున్నారట. గతంలో తెలుగుదేశం పార్టీ తనవల్లే గెలిచిందని చెప్పుకున్న ‘పవన్‌’ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోవడంతో ఆయన తన ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన అవహేళలను ఎదుర్కొంటున్నారు. తన సీటు తాను గెలవలేని ‘పవన్‌’ వేరే పార్టీని గెలిపించే శక్తి ఎక్కడదని వారు వెటకరిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఎక్కడ పోటీ చేసినా ఓడిరచి తీరుతామని అధికార వైకాపా నాయకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. నిన్న ఇదే విషయంపై ‘కాకినాడ’ ఎమ్మెల్యే ‘ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి’ మాట్లాడుతూ ‘పవన్‌కళ్యాణ్‌’ ఎక్కడ నుంచి పోటీ చేసినా, తాను అక్కడ ఇన్‌ఛార్జిగా ఉండి ఆయనను ఓడిస్తానని శపథం చేశారు. గత ఎన్నికల్లో ‘పవన్‌’ విశాఖపట్నంలోని ‘గాజువాక’ ‘పశ్చిమగోదావరి’ జిల్లాలోని ‘భీమవరం’ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయనను ఓడిరచడానికి వైకాపా ముందుగానే రంగం సిద్ధం చేసుకుంది. ఆయనపై విష ప్రచారం చేస్తూ, ఆయన వ్యక్తిగత విషయాలను బయటకు తెస్తూ విమర్శలు కురిపించారు. ఒకరకంగా ఆయనను టార్గెట్‌ చేశారు. ఆ ఎన్నికల్లో వారు ‘టిడిపి’ అధినేత ‘చంద్రబాబు’ కుమారుడు ‘లోకేష్‌’ను, ‘జనసేన’ అధిపతి ‘పవన్‌కళ్యాణ్‌’లను టార్గెట్‌ చేసి పంతం పట్టి ఓడిరచారు. వైకాపా తమను టార్గెట్‌ చేసిందనే విషయాన్ని వారు గుర్తించలేక ఎన్నికల్లో బోల్లా పడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత తీరిగ్గా వారు తమను వైకాపా అధినేత టార్గెట్‌ చేశారని వాపోయారు. అయితే అప్పటికే చేతులు కాలిపోయాయి. అయితే  గతంలో వలే ఈసారి కూడా వైకాపా ‘పవన్‌’ను, ‘లోకేష్‌’ను టార్గెట్‌ చేయబోతోంది. ఈ విషయాన్ని గుర్తించిన ‘పవన్‌’ దానికి విరుగుడు చర్యలు మొదలుపెట్టారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 


గత ఎన్నికల్లో వలే కాకుండా ఈసారి ‘పవన్‌’ రెండుచోట్ల పోటీ చేయరని, గతంలో పోటీ చేసిన ‘భీమవరం’ నుంచే ఆయన పోటీ చేస్తారని ‘పవన్‌’ సన్నిహితులు చెబుతున్నారు. గతంలో రెండుచోట్ల పోటీ చేసి అయోమయానికి గురయ్యారని, దీని వల్ల రెండుచోట్లా దృష్టి కేటాయించలేకపోయారని, ఈసారి అటువంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారని వారు అంటున్నారు. ‘గోదావరి’ జిల్లాలో ‘పవన్‌’కు గట్టిపట్టుందని, అదీ ‘భీమవరం’ స్వంత సామాజికవర్గం ఇంకా బలంగా ఉందని, ఇక్కడ నుంచి ఆయన మళ్లీ పోటీ చేస్తే ఈసారి ‘భీమవరం’లో ఆయన స్వంత సామాజికవర్గం ఆయన గెలుపుకోసం కృషి చేస్తుందనే భావన ఇప్పటికే వ్యక్తం అవుతోంది. కాగా టిడిపితో ‘జనసేన’ పొత్తుపెట్టుకుంటే ఆయన గెలుపు ఇంకా సునాయాసం అవుతుందని, ఆయన గెలుపుతోపాటు పార్టీ పొత్తులో వచ్చేసీట్లన్నింటిలో సులువుగా గెలుపొందుతారని అంచనా వేస్తున్నారు. అయితే ‘టిడిపి,జనసేన’ పొత్తుకు ‘బిజెపి’ ఆటంకంగా ఉంది. ‘బిజెపి’తో పొత్తులో ఉన్న ‘పవన్‌’ ఆ పార్టీని కాదని ముందుకు వస్తేనే ‘పవన్‌’ ఆయన పార్టీ అభ్యర్థుల గెలుపు ఈజీ అవుతుంది. లేకుంటే ఆయనకు మరోసారి ఇబ్బంది తప్పదే మాట సర్వత్రా వినిపిస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ