WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సంఘాలు వద్దు...జర్నలిస్టులే ముద్దు...!

జేఏసీ నాయకులకు తేల్చి చెప్పిన సిఎం...!

జర్నలిస్టుల ఇళ్ల గురించి తాము బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలసి చర్చించామని, అందరికీ ఇళ్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, తాము చెప్పిన సమస్యలను సావధానంగా విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కొందరు జర్నలిస్టు సంఘాల నాయకులు(జేఏసి) పత్రికలకు ప్రకటనలు పంపించారు. అంతే కాకుండి సోషల్‌మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని, ఇక అందరికీ త్వరలో ఇళ్లు వస్తాయని సదరు జర్నలిస్టు సంఘాల నాయకులు ఊదరగొడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రతి జర్నలిస్టుకూ సంతోషకరమే. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీరి వ్యవహారశైలిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారనే సంగతిని సదరు జర్నలిస్టు సంఘాల నాయకులు ఎవరికీ చెప్పకపోవడం విశేషం. ముఖ్యమంత్రిని వీరు కలిసిన తరువాత జర్నలిస్టు ఇళ్ల వ్యవహారంలో వీరి అత్యుత్సాహం, జేఏసీల ఏర్పాటుపై తీవ్రంగా మందలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాము జర్నలిస్టులందరికీ ఇళ్లు ఇస్తామని ఒక వైపున చెబుతూ ఉంటే మరో వైపు జేఏసీల పేరుతో ఆందోళనలు చేస్తామని ప్రకటనలు చేయటం ఏమిటని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. తనకు జర్నలిస్టుల సంఘాలతో పనిలేదని..తాను జర్నలిస్టులందరికీ ఇళ్లు ఇస్తానని ముఖ్యమంత్రి అన్నట్లు సదరు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ జేఏసీల పేరుతో వీరు వ్యవహరిస్తున్న తీరుపై సిఎం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు న్యాయం చేస్తామని చెబుతూ అందుకు అవసరమైన సమగ్ర కార్యాచరణను చేస్తుంటే సంఘాల పేరిట ప్రభుత్వంపై బుదర చల్లే వ్యవహారంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాను ఏ ఒక్కరి విన్నపంతో ఇళ్లు ఇస్తానని చెప్పలేదని, జర్నలిస్టుల బాధలను చూసే తనంతట తానే హామీ ఇస్తే...ఇప్పుడు సంఘాల పేరిట నాయకులు చేస్తున్న వ్యవహారాలు ముఖ్యమంత్రి ఆగ్రహానికి కారణాలని కొందరు సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

   గతంలోనే జర్నలిస్టుల జేఏసీ ఏర్పాటుపై కొందరు సీనియర్‌ జర్నలిస్టులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమంత తాము ఇస్తామని చెబుతూ అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించే పనిలో ఉండగా...జేఏసీల పేరిట ఆందోళనను నిర్వహిస్తామని హెచ్చరికలు చేయటం ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. అసలు జేఏసీలు అవసరం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో లేని జేఏసీల సంసృృతిని తెలంగాణ నుంచి దిగుమతి చేసుకొన్న కొంత మంది జర్నలిస్టు సంఘ నాయకులు ప్రభుత్వంపై బురదజల్లడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం తాము చెప్పిన హామీని నెరవేర్చకపోతే ఆందోళన చేసినా..అర్థం ఉంది కానీ...ఇప్పుడా అవసరం ఏమిటనే ప్రశ్న అందరి నుంచీ వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సదరు జేఏసీ సంఘాల నాయకులు వ్యవహరిస్తే జర్నలిస్టులకు ఉపయోగం ఉంటుంది. లేదూ..తమకే పెత్తనం దక్కాలన్న ఆతృతతో వ్యవహరిస్తే అందరూ నష్టపోవాల్సి వస్తుంది...!  


(337)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ