లేటెస్ట్

ఆ ఎమ్మెల్యే ఉపఎన్నికలు తెస్తారా...!?

రాజధాని జిల్లాలో ఉన్న ఓ ఎమ్మెల్యే త్వరలో ఉప ఎన్నికలు తెస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. అందరూ అనుకున్నట్లు ఆయన బిజెపి వైపు వెళ్లడం లేదట. తాను పార్టీ మారితే అధికార వైకాపాలోకే వెళతానని, మారకపోతే... ఇక్కడే ఉంటాను..తప్ప బిజెపి వైపు వెళ్లే ప్రసక్తేలేదని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారట. టిడిపిలో ఉన్న ఆ ఎమ్మెల్యే అధికార పార్టీలోకి రావాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే వెంటనే చర్యలు తీసుకోవాలని వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో..సదరు ఎమ్మెల్యే పార్టీ మారితే...వెంటనే మాజీ అయిపోతారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే సదరు ఎమ్మెల్యే మాత్రం తాను త్వరలో వైకాపాలో చేరతానని, దాని కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెబుతున్నారట. రాజీనామా చేసి..వైకాపాలో చేరి...ఉప ఎన్నికలు తెస్తానని, ఉప ఎన్నికల్లో వైకాపా తరుపున పోటీ చేసి ఘన విజయం సాధిస్తానని ఆయన సన్నిహితులతో చెబుతున్నారట. 

టిడిపి బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే అతి తక్కువ మెజార్టీతో గెలుపొందారు. అయితే...పార్టీ మారిన తరువాత వైకాపా తరుపున తాను పోటీ చేస్తే...సునాయాసంగా గెలుస్తానని...ఆ ఎమ్మెల్యే చెప్పుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో తాను పార్టీ బలంతో గెలవలేదని, తన స్వంత బలంతో గెలిచానని, ఇప్పుడు ఉప ఎన్నికల్లో తన స్వంత బలం, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఛర్మిషాతో సునాయాసంగా గెలుస్తానని చెబుతు న్నారట. కాగా అతి త్వరలోనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తనతో పాటు మరో ఎమ్మెల్యే కూడా వైకాపాలోకి వస్తున్నారని, ఇద్దరం కలిసి రాజీనామాలు చేసి, ఉప ఎన్నికలు తెస్తామని ఆ ఎమ్మెల్యే చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా...ఈ ఎమ్మెల్యే వ్యవహారాన్ని గమనిస్తోన్న కొందరు టిడిపి నేతలు..గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2004 ఎన్నికల సమయంలో ఆఖరి నిమిషంలో టిడిపిలోకి దూకి ఎమ్మెల్యేగా 'దానం నాగేందర్‌' గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో...టిడిపి ఓడిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ గెలవడం, తన రాజకీయ గురువు వై.ఎస్‌. ముఖ్యమంత్రి కావడంతో...వెంటనే రాత్రికి రాత్రి 'దానం' ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..కాంగ్రెస్‌లో చేరి తరువాత...జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 'దానం' ఘోరంగా ఓడిపోయారు. తనను సిఎం వై.ఎస్‌ గెలిపిస్తారనే  నమ్మకంతో బరిలోకి దిగిన 'దానం' ఎన్నికల ఫలితాలతో ఖంగుతిన్నారు. నాడు 'దానం'కు జరిగిన పరాభవమే..ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి...ఉపఎన్నికలు తెచ్చే వారికి జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలను సదరు ఎమ్మెల్యే తేలిగ్గా తీసుకుంటున్నారట. మొత్తం మీద..ఆంధ్రాలో మరి కొన్ని నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని ఆయన చెబుతున్నారట. చూద్దాం ఏమి జరుగుతుందో..? 

(424)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ