WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సోమిరెడ్డి' ఇలాకాలో 'ఆత్మగౌరవ అవినీతి'...!

రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి నిర్మించే పథకాన్ని 'ఆత్మగౌరవపథకం'గా ప్రభుత్వం ప్రకటించింది. మరుగుదొడ్ల నిర్మాణంలో అనేక గ్రామాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. 'జగన్‌' అంత అవినీతి పరుడు మరొకరు లేరని, తనపై అవినీతి ఆరోపణలు చేసిన వారిని కోర్టులే చెంప దెబ్బలు కొట్టాయని, తానెంతో నిజాయితీపరుడ్ని అని పదే పదే గొప్పలు చెప్పుకుంటున్న వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్వంతనియోజకవర్గమైన 'సర్వేపల్లి'లో ఆత్మగౌరవపథకంలో భారీ ఎత్తున్న అవినీతి జరుగుతోంది. అనేక గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న ప్రజలు కూడా మీడియా వర్గాలతో మాట్లాడుతూ స్వంత సొమ్ముతో మరుగుదొడ్లు నిర్మించుకున్నాం..ఇంత వరకు బిల్లులు మంజూరు చేయలేదు. మరుగుదొడ్లు నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు,పంచాయితీ కార్యదర్శులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారని గ్రామ ప్రజలు చెబుతున్నారు. అంతే కాకుండా ఎప్పుడో నిర్మించిన మరుగుదొడ్లుకు ఇప్పుడు నూతన బిల్లులు పెట్టి స్వాహా చేస్తున్నారు. అనేక గ్రామాల్లో లక్షల రూపాయలు విలువ గల బిల్లులు పెట్టి కాంట్రాక్టర్లు, పంచాయితీకార్యదర్శులు, మంత్రి అనుచరులు దోచుకుంటున్నారని బయటపడింది. కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా అవినీతిలో పాలుపంచుకున్నారని, స్వపక్షీయులు కూడా విమర్శలు చేస్తున్నారు. పూర్తికాని మరుగుదొడ్ల నిర్మాణాలకు బిల్లులు ఇచ్చారని ఆధారాలతో కొంత మంది ఫిర్యాదు చేయగా, ఆర్‌ఆర్‌ యాక్టు ప్రకారం నిధులు రికవరీ చేస్తామని చెప్పినప్పటికీ ఇంత వరకు ఆచరణలోకి రాలేదు. కొంత మంది పంచాయితీ కార్యదర్శులను సస్పెండ్‌ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక ఇంటిలో నాలుగు పోర్షన్‌లు ఉంటే నాలుగు మరుగుదొడ్లు నిర్మించినట్లు(ఇల్లు ఒకరిదే అయినా) బిల్లు వసూలు చేసుకున్నారు. కొన్ని చోట్ల పాత మరుగుదొడ్లకు రంగులు వేసి, ఫోటోలు తీసుకుని నిధులు స్వాహా చేశారు. ఇంత అరాచకం మంత్రి నియోజకవర్గంలో జరుగుతుంటే, ఆధారాలతో ఫిర్యాదు చేసినా..మంత్రి సోమిరెడ్డికి దీనిపై దృష్టిసారించడానికి సమయం ఉండడం లేదట. 'జగన్‌'ను నిత్యం విమర్శించి..చంద్రబాబు ప్రశంసలు పొందుతున్న ఆయన తన నియోజకవర్గంలోని అవినీతి మాత్రం కనిపించడం లేదని అధికారపార్టీ నాయకులు అంటున్నారు. ఆత్మగౌరపథకంలో అవినీతి జరిగిన మాట యధార్థమేనని, బోగస్‌లబ్దిదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.






(350)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ