లేటెస్ట్

టిడిపిలో నూతనోత్సాహం

2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చూసిన తర్వాత,  తమ పార్టీ కోలుకుంటుందని, మళ్లీ అధికారంలోకి వస్తుందని, టిడిపి నాయకులు,కార్యకర్తలు భావించలేదు. ఎన్నికల్లో పరాభవం తర్వాత, అధికారంలోకి వచ్చినా వైకాపా నాయకులు చేస్తున్న అరాచకాలకు, అక్రమాలకు, అన్యాయాలకు, అక్రమ కేసులకు, అరెస్టులకు ఎదురొడ్డి నిలిచి పార్టీని రక్షించుకుంటామనికాని, మళ్లీ అధికారంలోకి వస్తామని గాని, వారు ఆశించలేదు. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అనూహ్యమైన మార్పులు వచ్చాయి. మూడేళ్ల జగన్ పాలనలో అన్ని వర్గాలు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో, ఇప్పుడిప్పుడే టిడిపి నాయకులు, కార్యకర్తల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మూడేళ్ల జగన్ పాలనను, చంద్రబాబు పాలనను సామాన్య ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు. మూడేళ్లలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో, ప్రజలు ఎంత నష్టపోయారో, ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఏదో చేస్తాడని, తండ్రివలె పరిపాలన చేస్తాడని కొంత మంది ప్రజలు ఆశించి జగన్ కు అధికారాన్ని కట్టబెట్టారు. అయితే వారి ఆశలను జగన్ వమ్ము  చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నానని, అన్ని వర్గాలకు న్యాయం  చేస్తున్నామ‌నే మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో మరో రెండేళ్లు  అధికారం ఉండగానే జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. 


దీన్ని ఆసరా చేసుకుని టిడిపి అధినేత చంద్ర‌బాబు జిల్లాల పర్యటన ప్రారంభించారు. మొదట ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ప్రజల నుంచి ఆయనకు అనూహ్య స్పందన వ‌చ్చింది. ఆయన రాక కోసం ప్రజలు గంటలకొద్దీ వేచి చూశారు. దారిపొడవునా ఆయనకు హారతులు పట్టారు. జేజేలు కొట్టారు. ఆయన ప్రసంగానికి కేరింతలు కొడుతూ, ఈలలు వేస్తూ ఉత్సాహపరిచారు. మూడేళ్ల జగన్ పాలనలో  ఆయన ప్రజలను ఏవిధంగా మోసగించారో, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజలపై పెద్ద ఎత్తున పన్నులు వేస్తూ, పీడిస్తూ, వేధిస్తున్న  విధానాన్ని ఆయన తూర్పారబట్టారు. ఆయన ప్రసంగాలకు ప్రజలు జేజేలు పలికారు. కాబోయే ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉత్తరాంధ్ర పర్యటన ముగిసిన అనంతరం చంద్రబాబు చేసిన రాయలసీమ పర్యటన టిడిపిలో అంతులేని ధైర్యాన్ని నింపింది. ముఖ్యంగా సీఎం సొంత జిల్లాలో ఆయన పర్యటనకు ప్రజల తండోపతండాలుగా వచ్చారు. కిక్కిరిసిన సభలో ఆయన చేసిన ప్రసంగానికి అనూహ్య స్పందన వచ్చింది. జగన్ సొంత జిల్లాలో ఇటువంటి ఆదరణ  గతంలో చంద్ర‌బాబుకు ఎప్పుడూ దక్కలేదు. ప్రస్తుతం ఇటువంటి ఆదరణ ఆయనకు దక్కటానికి జగన్ వైఫల్యమే కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ కు సొంత జిల్లాలో పరాభవం తప్పదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అదేవిధంగా కర్నూల్, అనంతపురం జిల్లాలోనూ ఆయన పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మూడేళ్ల తర్వాత ప్రజల్లోకి వెళ్లిన చంద్రబాబు పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ టిడిపి నేత‌ల్లో ఎక్క‌డ లేని స్థైర్యాన్ని నింపుతోంది.   గట్టిగా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని టిడిపి నేతలు చెపుతున్నారు. మొత్తం మీద మూడేళ్ల క్రితం ఎటువంటి ఆశలు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు అధికారం తమదేనని ధీమా వారిలో వ్యక్తమవుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ