WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తొలి రోజే సమరోత్సాహం...!

విపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర తొలిరోజే సమరోత్సాహాన్ని చాటింది. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఆయన తలపెట్టిన సుధీర్ఘపాదయాత్ర  ఇడుపులపాయ నుంచి ప్రారంభమైంది. ముందుగా ఆయన మహానేత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని సమాధిని సందర్శించి నివాళులు అర్పించి..తొలి అడుగు మొదలు పెట్టారు. మహానేత ప్రారంభించినట్లే..ఆయన కూడా పాదయాత్రను ఉత్సాహంగా ప్రారంభించారు. యువనేత ప్రారంభించిన పాదయాత్రకు జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన ప్రజానీకం వేల మంది యాత్ర ప్రారంభానికి ముందే ఇడుపలపాయకు చేరుకున్నారు. 'జై..జగన్‌...జై.జై. జగన్‌ అంటూ నినాదాలు చేసుకుంటూ యువనేతతో కరచాలనానికి పోటీపడ్డారు. మహానేత కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, పార్టీలో సీనియర్‌ నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులతో ఇడుపులపాయ కిక్కిరిసిపోయింది. వేల సంఖ్యలో వచ్చిన ప్రజలను కంట్రోల్‌ చేయటం పోలీసులకు తలకు మించిన పని అయింది. ఒక వైపు అభిమానుల ఉత్సాహం...మరో వైపు సమరోత్సాం మధ్య పాదయాత్రను ప్రారంభించారు వై.ఎస్‌.జగన్‌.

మారిన 'జగన్‌' ప్రసంగం తీరు...!

పాదయాత్రకు ముందు జరిగిన సభలో 'జగన్‌' ప్రసంగ ప్రజలను ఆకట్టుకుంది. వేల మంది హాజరైన ఈ సభలో 'జగన్‌' రాష్ట్రప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రివర్గ సహచరుల అవినీతిపై ఆయన సూటిగా బాణాలు ఎక్కుపెట్టారు. అదే సమయంలో ఈ నాలుగేళ్లల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన పనేమిటో చెప్పాలని నిలదీశారు. తన వయస్సు 'చంద్రబాబు వయస్సులో సగం ఉంటుందని, అటువంటి తనను రాజకీయాల నుంచి తప్పించాలని కుట్రలు పన్నుతున్నారని ఆయన ప్రజలకు వివరించారు. రాజశేఖర్‌రెడ్డి చేపట్టి పూర్తి చేసిన ప్రాజెక్టులకు 'చంద్రబాబు' గేట్లు ఎత్తుతున్నారని, ఆయన లస్కర్‌ పనులు చేస్తున్నారన్నప్పుడు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. నాలుగేళ్ల 'చంద్రబాబు' పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయని, రాబోయే కాలంలో మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అందరి కష్టాలు తీరుస్తామని ఆయన చెప్పారు...!

కాసుల కక్కుర్తిలేదు...!

ముఖ్యమంత్రి చంద్రబాబు వలే తనకు కాసుల కక్కుర్తి లేదని, ఆయన వలే తాను అవినీతిపరుడ్ని కాదని, తన కోరికల్లా తాను పోయిన తరువాత కూడా తన ఫోటో తండ్రి పక్కన ప్రజలు పెట్టుకుని చూసుకోవాలనేదనేనని 'జగన్‌' అన్నప్పుడు..'జై..జగన్‌..జై..జై..జగన్‌' అంటూ ప్రజలు స్పందించారు. ప్రజల కుటుంబాలలో ఆప్యాయతలు పెంచాలని, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలన్న కసి తనలో ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తన అవినీతితో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదాను పక్కన పెట్టించిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే...ప్రత్యేకహోదాను సాధించుకుందామని ఆయన వివరించారు. ప్రత్యేక హోదావల్ల వెనుకబడిన ప్రాంతాలకు నిధులు వస్తాయని, తద్వారా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని 'జగన్‌' చెప్పారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడిగితే లాగి తంతారనే భయంతో ఆయన నోరుమూసుకున్నారని, ఆయన చేసిన అవినీతిపనుల వల్లే 'మోడీ'ని ప్రత్యేకహోదా అడగలేకపోతున్నారని విమర్శించారు.


   తమ పార్టీ నుంచి కొనుక్కున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళితే ఎవరి బలం ఏమిటో తేలిపోతుందని 'జగన్‌' అధికార పార్టీ నేతలకు సవాల్‌ విసిరారు. నంద్యాల ఎన్నికల్లో ఏమి జరిగిందో..లోకం అంతా చూసిందని, ఇప్పుడు తమ పార్టీనుంచి టిడిపిలో చేరిన వారితో రాజీనామా చేయించాలని సవాల్‌ విసిరినప్పుడు ప్రజలు గట్టిగా ప్రతిస్పందించారు. తాను ఎన్నికలకు, కేసులకు భయపడనని మరోసారి 'జగన్‌' ధైర్యంగా ప్రకటించారు. ఒకవైపు తాను సిఎం అయితే ఏమి చేస్తారో..చెబుతూనే...మరోవైపు ప్రస్తుత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ నాలుగేళ్లలో జరిగిందేమీ లేదని, ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగించారని 'జగన్‌' వివరంగా చెప్పారు. రాజధాని నిర్మాణంలో కుంభకోణం చోటు చేసుకుందని, రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా..ఇంత వరకు అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని, చంద్రబాబు వస్తే..జాబు వస్తుందని..ప్రచారం చేశారని..ఇప్పుడు ఎంత మందికి జాబులో వచ్చాయో..చెప్పాలని ఆయన ప్రశ్నించినప్పుడు లేదూ..లేదూ..లేదంటూ సమాధానం వచ్చింది. ఇప్పుడు జాబు రావాలంటే 'బాబు' పోవాలన్నప్పుడు కూడా అదేరకమైన స్పందన వచ్చింది. మొత్తం మీద 'జగన్‌' తన తొలిరోజు పాదయాత్రలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ...వాటిని పరిష్కరించాలంటే 'తాను' రావాల్సిన అవసరాన్ని గట్టిగా నొక్కి చెప్పిన విధానం ప్రజలను ఆకట్టుకుంది. అశేషంగా తరలివచ్చిన అభిమానులు ఆయనకు అడుగడుగునా మద్దతు పలికారు. రాబోయేది తమ ప్రభుత్వమేనన్న భావనను కార్యకర్తల్లో,నాయకుల్లో 'జగన్‌' ఈ యాత్ర ద్వారా కల్పించగలిగారు. తొలి రోజు పాదయాత్రకు హాజరైన ప్రజానీకాన్ని చూసి స్వంత పార్టీ నాయకుల్లో సంతృప్తి వ్యక్తమైంది.

(ఇడుపుల‌పాయ నుంచి వెంక‌ట్)


(258)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ