లేటెస్ట్

వై.ఎస్‌ వ్యూహాన్నే అమలు చేస్తోన్న ‘జగన్‌’...!

పత్రికల విషయంలో గతంలో తన తండ్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అనుసరించిన వ్యూహాన్నే ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ అనుసరిస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. 2004లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ఆయన ఆ పత్రికలపై విరుచుకుపడేవారు. పదే పదే ‘ఈనాడు, ఆంధ్రజ్యోతి’ పత్రికలపై ఆయన నోరుపారేసుకునేవారు. ప్రతి సమావేశంలోనూ ‘ఆ రెండు పత్రికలు’ అంటూ వాటిని చులకన చేసేవారు. దాంతో ఆయన మంత్రివర్గ సహచరులు, ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు ఆ రెండు పత్రికలపై విరుచుకుపడేవారు. ఆ పత్రికలకు తన ప్రభుత్వం చేసే మంచిపనులు కనిపించడం లేదంటూ విమర్శించేవారు. ప్రజా సమస్యలను, అవినీతి వ్యవహారాలను బయటపెడుతూ ప్రజల తరుపున ప్రశ్నించిన పత్రికలను తన వ్యతిరేకులుగా అప్పట్లో ఆయన చిత్రీకరించేవారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కావాలనే తనపై, తన ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయంటూ వాటిని టార్గెట్‌ చేశారు. ఆయన వ్యూహం కొంత వరకు ఫలించింది. నాడు ఆ రెండు పత్రికలు ‘చంద్రబాబు’కు చెందినవని, తాను మంచి చేసినా అవి కావాలనే రచ్చ చేస్తోన్నాయనే భావనను ఆయన కలిగించగలిగారు. దీంతో 2009 ఎన్నికల్లో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా గెలుపొందగలిగారు. అయితే..ఆయన అనుకున్నంత సులువేంకాలేదు..ఆ ఎన్నికల్లో...! నాడు ప్రజారాజ్యం,లోక్‌సత్తాలను పెట్టించి ఓట్లను చీల్చి ఆయన టిడిపిని ఓడిరచారు. ఏదైతేనేమి..ఆ రెండు పత్రికలంటూ...యాగీ చేసి..ప్రజల్లో అయోమయాన్ని సృష్టించిన అత్తెసరు సీట్లతో అధికారంలోకి రాగలిగారు.


పత్రికలకు ఉద్ధేశ్యాలను ఆపాదించి నాడు వై.ఎస్‌ ఫలితాలను రాబట్టినట్లే..ఇప్పుడు ‘జగన్‌’ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 సంస్థలను దుష్టచతుష్టయమని, తాను ప్రజలకు మంచి చేస్తోంటే అడ్డుకుంటున్నాయని ప్రచారాన్ని ప్రారంభించారు. చంద్రబాబుతో తనకు పోటీ లేదని, కేవలం ఆ మూడు సంస్థలతోనే తనకు పోటీ అని పదే పదే వాటిని టార్గెట్‌ చేస్తూ వాటి విశ్వసనీయతను ఆయన దెబ్బతీస్తున్నారు. గతంలో వై.ఎస్‌ మరీ ఇంత దిగజారి వ్యహరించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ‘జగన్‌’ పదే పదే తన వ్యతిరేక మీడియాను లక్ష్యంగా చేసుకుని దుయ్యబడుతున్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రీ ఇంతలా మీడియాపై విరుచుకుపడ్డ సందర్భం లేదనే మాట మీడియా వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన మీడియాపై అక్కసుతోనే వ్యవహరిస్తున్నారు. స్వంత మీడియాకు, ఇతర అనుకూల మీడియా ప్రభుత్వ సొమ్మును ధారబోస్తోన్న ‘జగన్‌’ తనకు వ్యతిరేకంగా వ్యవహరించే మీడియాపై నిప్పులు కక్కుతున్నారు. కేవలం తానే కాకుండా తన మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా ఉసిగొల్పుతున్నారు. మొత్తం మీద తండ్రి అనుసరించిన వ్యూహాన్నే అమలు చేస్తోన్న జగన్‌ ఆయన వలే ఫలితాలను రాబడతారా..? లేక ఆయన ప్రచారం బెడిసిగొట్టి ప్రతిపక్షంలో కూర్చుంటారా..? చూడాలి ఏం జరుగుతుందో..?

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ