లేటెస్ట్

కోడికత్తి కేసు తేలుతుందా..?

గత సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన కోడికత్తి కేసు గురించి దాదాపు ప్రజలంతా మరిచిపోయారు. అప్పుడప్పుడు టిడిపి నేతలు గుర్తు చేస్తే తప్ప అది ఎవరికీ గుర్తు రాదు. నాడు తమపై హత్యాయత్నం జరిగిందని, నింగీ,నేలా యాగీ చేసిన పార్టీ అధినేత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు నేడూ దాని గురించి ఎక్కడా నోరెత్తరు...? అసలు అటువంటిది జరిగిందన్న సంగతినీ వారు గుర్తుపెట్టుకోరు..? కానీ కాలం ఊరుకోదుగాక..? నాలుగేళ్ల తరువాత మళ్లీ వెలుగులోకి వచ్చిందీ కేసు. ఏమిటీ కోడికత్తి కేసు..అంటే..అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న నేటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి విజయనగరంలో యాత్ర ముగించుకుని హైదరాబాద్‌ వెళ్లేందుకు ‘విశాఖపట్నం’ విమానాశ్రయంలోని లాంజ్‌లో ప్రవేశించినప్పుడు ‘శ్రీను’ అనే యువకుడు ఆయనను హత్య చేసేందుకు ‘కోడికత్తి’తో ప్రయత్నం చేశారనేది అభియోగం. లాంజ్‌లో ఉన్న ‘జగన్‌’పై యువకుడు దాడి చేయడంతో ఆయన భుజానికి గాయమైందని ప్రచారం జరిగింది. దాడి జరిగిన తరువాత ‘జగన్‌’ హైదరాబాద్‌ వెళ్లి చికిత్స పొందారు. అప్పట్లో ‘ఆంధ్రా’ పోలీసులపై తనకు నమ్మకం లేదని, అందుకే హైదరాబాద్‌లో చికిత్స పొందానని ఆయన చెప్పుకున్నారు. అది వేరే కథనుకోండి.


తనపై టిడిపినే హత్యాయత్నం చేయించిందని ‘జగన్‌’ ఆరోపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమ నేతను ‘చంద్రబాబు’ హత్య చేయించేందుకు ప్రయత్నించారని వైకాపా నేతలు పెద్దఎత్తున ఆరోపించారు. నాడు మేధావులుగా చెప్పుకున్నవారు కూడా ‘చంద్రబాబు’వైపే వెలెత్తి చూపించారు. అయితే సానుభూతి కోసమే ‘జగన్‌’ తనపై దాడి చేయించుకున్నారని టిడిపి ప్రతిదాడి చేసింది. ఈ ఆరోపణలు..ప్రత్యారోపణలతో ఎన్నికల కాలం పూర్తయింది. బ్రహ్మాండమైన అధికారంతో ‘జగన్‌’ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే..ఆయన ముఖ్యమంత్రి మూడేళ్లు దాటినా..ఆ కేసు అతీ గతీ లేకుండాపోయింది. ప్రస్తుతం కోడికత్తి శ్రీను తల్లి ఈ కేసును తేల్చాలని, తన కుమారుడు నాలుగేళ్ల నుంచి జైలులోనే ఉంటున్నాడని, దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణకు లేఖ రాసింది. దీంతో ఒక్కసారిగా కోడి కత్తి కేసు బయటకు వచ్చేసింది. దాదాపు నాలుగేళ్ల తరువాత అప్పట్లో సంచలనం సృష్టించిన కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. టిడిపినే తమ నేతపై హత్యాయత్నం చేయించిందన్న వైకాపా నేతలు..ప్రస్తుతం అధికారంలో ఉన్నా ఆ కేసులో నిజానిజాలు తేల్చలేకపోయారు. దీనిపై అప్పుడప్పుడూ ప్రతిపక్షం చురకలు వేసినా వారు మౌనానే ఆశ్రయిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ కేసు విషయంలో సుప్రీం ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా..? ఏమో చెప్పలేం..? కాగా ఇటీవల సస్పెండ్‌ అయిన మాజీ ఇంటిలిజెన్స్‌ ఛీప్‌ వెంకటేశ్వరరావు కోడికత్తి కేసును అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని నాడు వైకాపా నేతలు తగులపెట్టాలని కుట్ర చేశారని, దాన్ని తాను అడ్డుకున్నాననే కోపంతో తనను ఇప్పుడు పదే పదే సస్పెండ్‌ చేస్తున్నారని ఆరోపించారు. మరి ఆయన వ్యాఖ్యలపై కూడా వైకాపా స్పందించినట్లు లేదు. మొత్తం మీద నాలుగేళ్ల తరువాత..అయినా అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు ఒక కొలిక్కి వస్తుందా..అంటే ఏమో చెప్పలేమనే సమాధానం వస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ