లేటెస్ట్

ఎపిలో ఐదు లోక్‌సభ సీట్లపై గురిపెట్టిన బిజెపి...!

గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 0.5శాతం ఓట్లు సాధించిన బిజెపి భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటోంది. మిషన్‌ దక్షిణాదిలో భాగంగా తొలుత తెలంగాణలో అధికారం సాధించి తరువాత ఆంధ్రాలో అధికారంలోకి రావాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. వీలుంటే స్వంతంగా లేకపోతే జనసేనతో పొత్తుపెట్టుకుని అయినా అనుకున్న లక్ష్యాలను సాధించాలని భావిస్తోంది. ప్రస్తుతం ‘జనసేన’తో పొత్తులో ఉన్న బిజెపి రేపటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీతోనే కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే ఈ పొత్తులు మారే అవకాశం కూడా ఉంది. అన్నీ కుదిరితే ప్రతిపక్ష టిడిపిని కూడా పొత్తులో భాగస్వామ్యం చేయడానికి ప్రణాళికలు వేసుకుంటోంది. ప్రస్తుతానికి తమకు టిడిపితో పొత్తు లేదని ప్రకటిస్తున్నా ఎన్నికల నాటికి ఈ మూడు పక్షాలు కలిసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైకాపాతో తెరవెనుక మైత్రి నడుపుతున్న బిజెపి ఎన్నికల నాటికి ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్‌ చెబుతారని కొందరు నాయకులు అంటున్నారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తోన్న వైకాపాను అంత సులువుగా వదులుకోరని, తమకు కేంద్రంలో మద్దతు అవసరమైన ప్రతిసారీ, తాము అడకపోయినా మద్దతు ఇస్తోన్న వైకాపాను వదులుకోరని మరికొంత మంది అంటున్నారు. అయితే ఇతర పార్టీలపై ఆధారపడే దాని కన్నా స్వంతంగా బలపడడమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో వ్యవహరించాలని ఆ పార్టీ పెద్దలు కోరుకుంటున్నారు.


వచ్చే ఎన్నికల నాటికి పొత్తులు ఉన్నా లేకపోయినా కనీసం ఐదు లోక్‌సభ సీట్లను గెలవాలనే లక్ష్యాన్ని ఆ పార్టీ నిర్ధేశించుకున్నదని వార్తలు వస్తున్నాయి. గతంలో తాము గెలిచిన సీట్లను ఈసారి మళ్లీ గెలవాలని అధినేతలు రాష్ట్ర నాయకులకు లక్ష్యంగా నిర్ధేశించారు. నర్సాపురం, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్‌ సీట్లపై వారు గురిపెట్టారు. 1998లో బిజెపి స్వంతంగా తిరుపతి, కాకినాడల్లో విజయం సాధించింది. ఆ తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో టిడిపితో పొత్తుపెట్టుకుని తిరుపతి, నర్సాపూర్‌, రాజమండ్రిల్లో గెలుపొందింది. ఇప్పుడు ఆ స్థానాలతో పాటు ‘విశాఖపట్నం’లో గెలవాలనే లక్ష్యంతో ఉంది. కేవలం 0.5శాతం ఓటు బ్యాంక్‌ ఉన్న బిజెపి ఎలా ఈ సీట్లను గెలుచుకుంటుందనే దానిపై పార్టీ నేతలు సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వడం లేదు. తమ అధినేతలు నిర్ణయించారని, వారు చెప్పిన విధంగానే గెలుస్తామంటున్నారు. అధికార వైకాపాపై పోరాడకుండా, ప్రజలకు ఎటువంటి మేలు చేయకుండా గెలవడం ఎలా అనే ప్రశ్న పలువురి నుంచి వస్తోంది. అయితే తాము అధికారపార్టీపై పోరాడుతున్నామని, ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలన్నీ తమవేనని, తాము నిధులు ఇస్తుంటే వైకాపా పంచుతోందని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబులపై ప్రజలకు విశ్వాసం లేదని, మోడీ, అమిత్‌షాల నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఇవే తమకు ఓట్లు తెచ్చిపెడతాయని వారు వాదిస్తున్నారు. మొత్తం మీద..రాబోయే ఎన్నికల్లో తాము రాష్ట్రంలో ఐదు లోక్‌సభ సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టిస్తామని బలంగా చెబుతున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ