లేటెస్ట్

20వేల మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు...!

ఇన్నాళ్లూ జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోకుండా, వారి సాదక,బాధలను నిర్లక్ష్యం చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పుడు వారి సమస్యలను పరిష్కరించేందుకు, వారి సంక్షేమానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైకాపా అధికారంలోకి వచ్చి దాదాపు మూడున్నరేళ్లు పూర్తి అయిన తరువాత జర్నలిస్టులకు మేలు చేయాలనే భావనలో ఉందట. ఇన్నాళ్లూ అక్రిడిటేషన్లు ఇవ్వండి మొర్రో అంటే వినిపించుకోని ప్రభుత్వం ఇప్పుడు వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని లీకులు ఇస్తోంది. జగన్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వారిని దూరంగానే ఉంచారు. స్వంత మీడియా సంస్థలకు ఇతోధికంగా ప్రయోజనాలు కల్పించుకుంటున్నారనే భావన మెజార్టీ జర్నలిస్టులో ఉంది. తమకే మాత్రం మేళ్ళు చేయడం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే ఆగ్రహం జర్నలిస్టుల్లో ఉంది. వారిలో నెలకొన్న ఆగ్రహాన్ని, అసంతృప్తిని చల్లార్చేందుకు వారికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనే భావనతో ఫైలును రెడీ చేస్తోంది. రాష్ట్రంలో అక్రిడిటేషన్‌ ఉ్న ప్రతి జర్నలిస్టుకు మూడు సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు, దీనిపై సమాచారశాఖ కసరత్తులు చేస్తోన్నట్లు తెలుస్తోంది. దాదాపు 20వేల మందికి ప్రయోజనం కల్పించబోతున్నట్లు సమాచారం.


రాష్ట్ర కేంద్రంలో పనిచేసే జర్నలిస్టులతోపాటు, జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో పనిచేసే వారికి కూడా ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల సమాచారశాఖ కమీషనర్‌ కొందరు జర్నలిస్టులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి త్వరలో జర్నలిస్టులకు తీపి కబురు చెబుతారంటూ వ్యాఖ్యానించారు. దీంతో ముఖ్యమంత్రి ఇళ్ళ స్థలాలపై నిర్ణయం తీసుకున్నారని, దానికి అనుగుణంగానే సమాచారశాఖ దీనిపై కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది. కాగా గతంలో కరోనాతో మరణించిన జర్నలిస్టులకు రూ.5లక్షలను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దాదాపు మూడేళ్లు కావొస్తున్నా, మరణించిన ఏ ఒక్క జర్నలిస్టు కుటుంబానికి ఈ ప్రయోజనాన్ని ప్రభుత్వం కల్పించలేదు. ఇది కేవలం ప్రకటనలకే పరిమితం అయింది. మరోవైపు చిన్నపత్రికలకు అక్రిడిటేషన్లు ఇవ్వడం లేదని, వారిని జీఎస్టీ నిబంధనలతో ఇబ్బందులు పెడుతున్నారని, వారి పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం లేదని, దీన్ని కూడా సరిచేయాలని చిన్నపత్రికలకు చెందిన వారు కోరుకుంటున్నారు. అయితే అంత మందికి ప్రకటనలు ఇవ్వలేమని సమాచారశాఖ తేల్చి చెబుతోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలకే ఇంకా సొమ్ములు చెల్లించలేదని, కనీసం అదైనా చెల్లించాలని మరి కొందరు కోరుతున్నారు. ఇళ్ళ స్థలాలు సంగతేమో కాని, ముందు అక్రిడిటేషన్లు, ప్రకటల బిల్లులు చెల్లించాలని వారు కోరుకుంటున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ