విజయవాడలో క్షీణిస్తోన్న వైకాపా...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విజయవాడలో క్షీణిస్తోన్న వైకాపా...!

రాష్ట్ర రాజకీయాలకు కీలకమైన విజయ వాడలో అధికార తెలుగుదేశం పార్టీ దూసుకు పోతుండగా..ప్రతిపక్ష వైకాపా రోజు రోజుకు క్షీణిస్తోంది. వివిధ అభివృద్ధి కార్య క్రమా లను, సంక్షేమపథకా లను నిర్వహిస్తూ అధికారపార్టీ ప్రజల్లో తన పలుకుబడిని పెంచుకుంటూ రాబోయే ఎన్నికల్లోనూ స్వీప్‌ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. గత ఎన్నికల్లో విజయవాడ నగరంలో ఉన్న మూడు స్థానాల్లో రెండుస్థానాలు టిడిపి కైవసం చేసుకోగా ఒక స్థానం ప్రతిపక్ష వైకాపా గెల్చుకుంది. అయితే...వైకాపా నుంచి గెలిచిన ఎమ్మెల్యే 'జలీల్‌ఖాన్‌' తరువాత టిడిపిలోకి చేరిపో యారు. దీంతో విజయవాడ పట్టణంలో వైకాపా పూర్తిగా పట్టుకోల్పోయింది. ఒకవైపు అధికార పార్టీ మళ్లీ ఎన్నికల్లో గెలవడానికి సర్వం సిద్ధం చేసుకుంటుండగా...వైకాపా మాత్రం నాయకత్వలేమి, అంతర్గత కలహాలతో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఓట్లపరంగా, వర్గాల పరంగా వైకాపాకు ఇక్కడ స్థానం ఉన్నా..వాటిని ఒడిసి పట్టడానికి సమర్థుడైన నాయకులు కరువయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా తరుపున బరిలో నిలిచిన వారందరూ ఇప్పుడు నామమాత్రం అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకుండా తమ వ్యాపారాలు, ఇతర విషయాలపై శ్రద్ద చూపిస్తున్నారు. రాజధాని నగరంలో పట్టుసాధించాల్సిన అవసరాన్ని పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కూడా గుర్తించడం లేదు. ఇటీవల ఇక్కడ బిసిల సదస్సు నిర్వహించి తమ పార్టీ కూడా ఉందనే విధంగా వ్యవహరించారు. బిసి సదస్సుకు వచ్చిన అధ్యక్షుడు 'జగన్‌' కేవలం రెండు గంటలు మాత్రమే నగరంలో ఉండి...మళ్లీ...హైద రాబాద్‌కు పయనమయ్యారు. ఈవిషయంపై విమర్శలు వచ్చినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అధ్యక్షుడే పట్టించుకోక పోవడంతో...నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు...కూడా పెద్దగా శ్రద్ద పెట్టడం లేదు.

      గత ఎన్నికల్లో వైకాపా తరుపున పోటీ చేసిన వారికి మళ్లీ టిక్కెట్‌ వస్తుందో రాదో..తెలియని పరిస్థితి ఉంది. అయినా వారు తమ ప్రయత్నాలను తాము చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసిన 'వంగవీటి రాధాకృష్ణ'కు మళ్లీ అధిష్టానం టిక్కెట్‌ ఇస్తుందో లేదో..తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల తన తండ్రి వంగవీటి మోహన్‌రంగాపై స్వంత పార్టీ నాయకుడు గౌతమ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయనను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై అధిష్టానం స్పం దించి...గౌతమ్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు. అయితే అంతా నాటకమని, గౌతమ్‌రెడ్డిని సస్పెండ్‌ చేయలేదని పార్టీ వర్గాలు వ్యాఖ్యా నించాయి. దీనిపై 'రాధాకృష్ణ' అసంతృప్తితో ఉన్నారు. ఆయన అసంతృప్తితో ఉన్నారని, పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళతారనే దానిపై స్పష్టత రావడంలేదు. కొంత మంది టిడిపిలోకి అని..మరి కొందరు 'జనసేన'లోకి అని ప్రచా రం చేస్తున్నారు. ఆయన పార్టీ మారినా.. మారకున్నా...వచ్చే ఎన్నికల్లో ఆయనకు 'జగన్‌' సీటు ఇస్తారా..? అనే సందేహాలు ఆపార్టీ వర్గాల నుంచే వ్యక్తం అవుతున్నాయి. రాధాకృష్ణకు సీటు ఇవ్వకుండా వేరే వారికి సీటు ఇవ్వాలని అధిష్టానం భావిస్తుందట. నియోజకవర్గంలో బలమైన పట్టుసాధించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావును ఎదుర్కోవాలంటే కొత్త వ్యక్తికి సీటు ఇస్తేనే సాధ్యమవుతుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఏది ఏమైనా ఈనియోజ కవర్గంలో వైకాపాకు బలమైన ఓటుబ్యాంక్‌ ఉన్నా..నడిపించే నాయకుడు లేక..పార్టీ రోజు రోజు క్షీణిస్తోంది.

     కాగా గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో అత్యధిక మెజార్టీ తెచ్చుకున్న టిడిపి ఎమ్మెల్యేల్లో రెండోవారిగా నిలిచిన విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇప్పుడు కూడా ఎదురులేకుండా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన వైకాపా అభ్యర్థి పి.గౌతమ్‌రెడ్డిపై 27529 ఓట్ల తేడాతో గెలుపొందారు. 'బోండా' సామాజికవర్గం అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో 'రెడ్డి' వర్గానికి టిక్కెట్‌ ఇచ్చి గతంలోనే అధిష్టానం తప్పుచేసింది. ఆ తప్పును ఇప్పుడు దిద్దుకోవడానికి కూడా అధినేత ప్రయత్నించడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల మాజీ కాంగ్రెస్‌నేత, స్వర్గీయ వంగవీటి మోహన్‌రంగాను ఉద్దేశించి 'గౌతమ్‌రెడ్డి' చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. దీంతో మొన్నటిదాకా ఆయనకే మళ్లీ టిక్కెట్‌ వస్తుందని భావించినా..ప్రస్తుతం ఆయనకు టిక్కెట్‌ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ నూతన వ్యక్తి కోసం పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. కాపులకు రిజర్వేషన్లు ప్రకటించి..ఆవర్గాన్ని ఆకట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యూహాలకు అనుగుణంగా ఇక్కడ కాపు వర్గానికి చెందిన వారికి టిక్కెట్‌ ఇవ్వాలని స్థానిక కాపు నేతలు కోరుతున్నారు. మరి వారి విజ్ఞప్తిని అధినేత ఆలకిస్తారో లేదో చూడాల్సి ఉంది.

  ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండే విజయవాడ వెస్ట్‌లో గతంలో పార్టీ తరపున గెలిచి పార్టీ ఫిరాయించిన 'జలీల్‌ఖాన్‌'ను ఎదుర్కోవడానికి 'మల్లాది విష్ణు'ను ప్రయోగించాలని అధినేత నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన 'మల్లాది'ని అక్కడ పోటీకి నిలిపితే హిందువుల ఓట్లు గంపగుత్తగా పొందవచ్చు అనేది 'జగన్‌' ఆలోచనగా చెబుతున్నారు. అయితే ముస్లింలు ఎక్కువగా ఉన్న ఇక్కడ ముస్లిమేతరులకు టిక్కెట్‌ ఇస్తే టిడిపి సులువుగా గెలుపొందుతుందని, గతంలో టిడిపి చేసిన తప్పునే మళ్లీ వైకాపా చేస్తుందని వారు అంటున్నారు. అంతే కాకుండా...గత ఎన్నికల్లో బిజెపి/టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు వైకాపాలో చేరడం, ఆయనకు మళ్లీ టిక్కెట్‌ ఇస్తానని 'జగన్‌' హామీ ఇచ్చారని 'వెల్లంపల్లి' అనుచరులు చెబుతున్నారు. మొత్తం మీద రాజధాని నగరంలో పైన చెప్పిన నలుగురు తప్ప...నలుగురికి తెలిసిన నాయకులు పార్టీలో కాగడా వేసి వెతికినా కనిపించడం లేదు. బలమైనఓటు బ్యాంక్‌, కార్యకర్తల బలం ఉన్నా నాయకులు లేక..నగర పార్టీ ఉసూరుమంటోంది. మరి ఇప్పటికైనా 'జగన్‌' నూతన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారా..? లేక వీరితోనే సరిపెడతారా..? ఏమో చూడాలి మరి...!


(2830)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ