దివ్యాంగుల సహాయం కోసం జిల్లా స్థాయిలో కమిటీ...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

దివ్యాంగుల సహాయం కోసం జిల్లా స్థాయిలో కమిటీ...!

పనిచేయాలనే ఉత్సాహం,శ్రద్ధ, పేదలకు,వికలాంగులకు సహాయం చేయాలనే అభిలాష ఉన్న అధికారులు ఉంటే అక్కడ అభివృద్ధి పరుగులు పెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే పలు అభివృద్ధి, సంక్షేమపథకాలను అమలు చేస్తూ..అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధికి నడకలు నేర్పుతున్న కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఇప్పుడు మరో ముందడుగు వేశారు. రాష్ట్రస్థాయిలో ఏ కలెక్టర్‌ ఆలోచించని విధంగా దివ్యాంగులకు సహాయం చేయడానికి జిల్లా స్థాయిలో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో జిల్లాస్థాయి ఉన్నతాధికారులు, వివిధ ఎన్‌జిఒ సంస్థలకు చెందిన ప్రతినిధులు, దివ్యాంగులకు చెందిన ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు అవసరమైన పెన్షన్‌లు, రేషన్‌,ఇళ్లు, నిరంతర కావాల్సిన సామాగ్రిని అందించేందుకు ఈ కమిటీ కృషి చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,40,000 మంది దివ్యాంగులు దీని ద్వారా ప్రయోజనం పొందబోతున్నారు. పేదరికంలో మగ్గుతున్న దివ్యాంగులకు వారి వారి అవసరాలను బట్టి ట్రైసైకిళ్లు,వీల్‌ ఛైర్స్‌, మోటార్స్‌ ట్రైసైకిళ్లు, హియరింగ్‌ ఎయిడ్స్‌ వంటి వాటిని అందించనున్నారు. పేదరికంలో ఉన్న దివ్యాంగులకు ఇళ్లు కట్టించి ఇచ్చే విషయంపై సాధ్యాసాధ్యాలను డిసిఎల్‌ కమిటీ పరిశీలించనుందని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. దివ్యాంగులైన దంపతులు లేదా ఒంటరి వ్యక్తులకు అంత్యోదయ కార్డులను కూడా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. జిల్లాలో ఉన్న దివ్యాంగులకు ఇళ్లు, బ్యాంక్‌ రుణాలు, పెన్షన్స్‌, రేషన్‌కార్డులు అందించేందుకు డిఎల్‌సి కమిటీ కృషి చేస్తుందని కలెక్టర్‌ తెలిపారు. అంతే కాకుండా సెర్మ్‌,మెప్పా, సిడబ్ల్యుఎస్‌, సర్వశిక్షా అభియాన్‌కు డిఎల్‌సి కమిటీ సహకరిస్తుందని తెలిపారు. సెల్ప్‌హెల్స్‌ గ్రూపుల ఆదాయాన్ని నెలకు పదివేలకు పెంచేందుకు కూడా ఈ కమిటీ ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు. మొత్తం మీద దివ్యాంగుల కోసం కలెక్టర్‌ లక్ష్మీకాంతం తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ విజయవంతం అవుతుందని ఆశిద్దాం...!


(307)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ