లేటెస్ట్

ప్రశాంత్‌ కిశోర్‌కు ‘జగన్‌’కు చెడిందా...!?

ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్‌ కిశోర్‌ నిన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీహార్‌ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు కారణం అవుతున్నాయి. తాను అనవసరంగా ‘జగన్‌’కు, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు ఎన్నికల్లో గెలవడానికి సహాయం చేశానని, వారికి సహాయం చేయడం కంటే కాంగ్రెస్‌కు సహాయం చేస్తే బాగుండేదని ఆయన వాపోయారు. గాడ్సేను ఎదుర్కొవాలంటే గాంధీ వారసులకు సహాయం చేయాలని, కానీ తాను అలా చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను గమనిస్తే ‘జగన్‌’,నితీష్‌లను గెలిపించి ఆయన తప్పు చేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు అనిపిస్తోంది. నిన్న మొన్నటి దాకా, నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ కోసం పనిచేస్తోంది. గత ఎన్నికల్లో ‘పికె’ రచించిన వ్యూహాల వల్లే అధికారా వైకాపా ఆ ఎన్నికల్లో గెలుపొందిందనే భావన అన్ని రాజకీయపార్టీల్లో ఉంది. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా తాను ‘పికె’ వల్లే గెలిచానని, ఆయన సేవలను పాలనలో కూడా వాడుకుంటానని బహిరంగంగానే చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత కూడా ‘పికె’ వ్యూహాలను ఆయన ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. మూడు రాజధానులు, నవరత్నాలు, ప్రతిపక్షాలపై అణచివేత వ్యూహాలు అన్నీ ‘పికె’ సూచనలతోనే జరుగుతున్నట్లు ఎక్కుమంది నమ్ముతున్నారు. దానికి కారణం ఏమిటంటే ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో కూడా వైకాపా అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ‘పికె’ టీమ్‌ చూస్తోంది. మీడియాకు ప్రెస్‌నోట్‌లు పెట్టడం, మీడియా వారితో వారు డైరెక్ట్‌గా మాట్లాడం కూడా వారే చేస్తున్నారు. అంటే ఇప్పటికీ ‘పికె’కు ‘జగన్‌’కు మధ్య మంచి అనుబంధం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.


అయితే..నిన్న ‘జగన్‌’ గురించి ‘పికె’ ఎందుకు ఆ విధంగా మాట్లాడారనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ‘పికె’కు ‘జగన్‌’కు మధ్య కొన్ని విషయాల్లో స్పర్ధలు వచ్చాయని, తాను అనుకున్న విధంగా తన పాదయాత్రకు ‘జగన్‌’ సొమ్ములు ఇవ్వడం లేదనేది ఒక కారణం అయితే, తాను చేస్తోన్నయాత్రకు ‘జగన్‌’ మద్దతుగా మాట్లాడకపోవడం, కనీసం బిజెపిని విమర్శించకపోవడం ‘పికె’కు బాధ కలిగించిందని, అందుకే ఆయన ఆ విధంగా మాట్లాడారనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్నాళ్లూ పాలూ, నీళ్లలా కలిసిపోయిన ‘జగన్‌’ ‘పికె’ల మధ్య నిజంగానే విభేధాలు వస్తే ‘జగన్‌’ నష్టపోతారని, ప్రస్తుతం ఐప్యాక్‌ చేస్తోన్న పనిని వదిలేసిపోతుందని, దాని వలన ‘జగన్‌’ పార్టీకి దెబ్బపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మూడున్నరేళ్ల ‘జగన్‌’ పాలన నిరాశాజనకంగా ఉందని, తాను అనుకున్నట్లు ‘జగన్‌’ పాలన చేయలేకపోయారని, వచ్చే ఎన్నికల్లో ఎలాగూ ‘జగన్‌’ పార్టీ ఓడిపోతుందనే భావనతో ముందే తప్పుకోవాలనే ఎత్తుగడతో ‘పికె’ ఉన్నారని, దాని కోసమే ఈ వ్యాఖ్యలు చేశారనే వారూ ఉన్నారు. అయితే ‘పికె’కు ‘జగన్‌’కు మధ్య గొడవలకు సొమ్ములే ప్రధాన కారణం అని, ఆయన అడిగినంత ‘జగన్‌’ ఇవ్వకపోవడంతోనే ‘పికె’ రచ్చ చేస్తున్నారని వైకాపా నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద ‘జగన్‌’ అఖండ మెజార్టీతో అధికారాన్ని తెచ్చిపెట్టిన వ్యూహకర్త ‘పికె’తో విభేధాలు ‘జగన్‌’కు నష్టం చేకూర్చేవే.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ