WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కర్నూలు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక నిర్ణయం 'బాబు'దే...!

కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికను మీరే ఎంపిక చేయాలని 'చంద్రబాబునాయుడు' నాయకులకు సూచించినా..ఇంత వరకు వారు ఏకాభిప్రాయానికి రాలేదు. జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇద్దరు మంత్రులతోపాటు ఇన్‌ఛార్జి మంత్రి నిర్వహించిన సమావేశంలో ఎక్కువ మంది ఏ ఒక్కరి పేరును తెలపకపోవడం విశేషం. జిల్లాలోని నాయకులందరూ నాలుగు గ్రూపులుగా విడిపోయారన్నది వాస్తవం. ఎట్టి పరిస్థితుల్లో తన తమ్ముడిని ఎంపిక చేయాలని డిప్యూటీ ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి పట్టుబడుతున్నారు. గతంలో అగ్ర కులానికి చెందిన వారికే పోటీ చేసే అవకాశం ఇచ్చారు..ఈసారి కూడా చల్లా రామకృష్ణారెడ్డికే ఇవ్వాలని బనగానపల్లె ఎమ్మెల్యే జనార్థన్‌రెడ్డితో పాటు ఇతర ముఖ్యులు కూడా పట్టుబడుతున్నారు. ఆదివారం అమరావతిలో సమావేశం జరగనున్న నేపథ్యంలో నాలుగు వర్గాలకు చెందినవారి అభిప్రాయాలను తీసుకుని...అభ్యర్థిని చంద్రబాబు ఎంపిక చేస్తారు. ఆ అభ్యర్థి ఎవరనేదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఆ అభ్యర్థిపై ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఎవరితో చర్చించలేదు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులకు కూడా 'చంద్రబాబు' ఏమనుకుంటున్నారో తెలియటం లేదు. జిల్లా నాయకులతో మంత్రి కాల్వ సమావేశమవుతున్నా...వారు ఏకాభిప్రాయానికి రావడంలేదు. ఇదే విషయాన్ని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం గురించి ఆయన తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. చంద్రబాబు అనుగ్రహం ఎవరిపై ఉందో ఈ రోజు సాయంత్రానికి తెలియనుంది. కానీ అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేసినా..ఇంతకు ముందు వెన్నుపోట్లు జరిగినా..ఈసారి అటువంటివి జరగకుండా..అఖండ మెజార్టీతో అభ్యర్థిని గెలిపిస్తామని నాలుగు వర్గాలకు చెందిన నేతలు ఇన్‌ఛార్జి మంత్రి కాల్వకు తెలిపారు. ఇప్పటికే నంద్యాల ప్రాంతానికి ఎమ్మెల్సీ పదవితో పాటు కౌన్సిల్‌ ఛైర్మన్‌పదవి ఇచ్చిన నేపథ్యంలో..కర్నూలు లోక్‌సభ పరిధిలో నియోజకవర్గాల నాయకునికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ పెరిగింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని 'చంద్రబాబు' నిర్ణయాన్ని వెలువరిస్తున్నారని మంత్రి కాల్వ చెబుతున్నారు. మంత్రి అఖిలప్రియ తన మనసులో మాట బయటపెట్టడం లేదని ప్రచారం జరుగుతోంది.

(158)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ