WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎపి బిజెపి అధ్యక్షపదవి దక్కేదెవరికో...!?

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో...బిజెపి పెద్దలు ఇప్పుడు దక్షిణాదిపై దృష్టిసారించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దక్షిణాదిలో బలపడాలని ఆ పార్టీ వ్యూహకర్తలు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక,ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో బలపడాలని..సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రాలే కీలకమని...ఇక్కడ బలపడితేనే మళ్లీ కేంద్రంలో అధికారం సాధ్యమనే భావనతో ఉన్నారు. ఇప్పటికే కర్ణాటక, ఒరిస్సాలపై పట్టుసాధించి కాషాయి పార్టీ...ఇప్పుడు తెలుగురాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లపై దృష్టి పెట్టాయి. ఇటీవల ఎన్నికల్లో బిజెపి ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోయినా..రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా తెలుగు రాష్ట్రాల్లో విజయంసాధిస్తామని ఆ పార్టీ స్థానిక నేతలు బీరాలు పోతున్నారు. దానిలో భాగంగా తమకు పార్టీలో మంచి పదవులు కట్టబెడితే..ఒంటిచేత్తో విజయం సాధిస్తామని పార్టీ అధినేతల వద్ద గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఉత్తరాదిపై దృష్టి కేంద్రీకరించిన పార్టీ నాయకత్వం ఇప్పుడు..అక్కడ ఎన్నికలు అయిపోవడంతో..దక్షిణాదిపై పూర్తి దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తాము భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌పై కసరత్తులు మొదలు పెట్టారు.

   ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని సంస్థాగత బలోపేతం చేయాలని ఆపార్టీ అధ్యక్షుడు అమిత్‌షా పలుసార్లు రాష్ట్ర నాయకులను కోరారు. వివిధ స్థాయిలో పార్టీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి...పార్టీని ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు. అధికార టిడిపితో పొత్తు ఉన్నా లేకున్నా..ఒంటరిగా బరిలోకి దిగడానికి అన్ని హంగులు సమకూర్చుకోవాలని ఆయన నాయకులను ఆదేశించారు. పార్టీ పదవులు, ఇతర అనుబంధ విభాగాల పదవులను కూడా త్వరలో భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు ముగిసినందున రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని భర్తీ చేయాలని పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు అధ్యక్ష పదవిలో ఉన్న విశాఖపట్నం ఎంపి 'కంభంపాటి హరిబాబు'ను తప్పించి..ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని ఆయన వ్యతిరేకులు కోరుతున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శిష్యుడైన 'హరిబాబు'ను తప్పిస్తేనే పార్టీకి మేలు జరుగుతుందని కొందరు నేతలు పార్టీ అధిష్టాన వర్గానికి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఆయన వల్ల పార్టీ బలపడలేకపోతుందని, ఆయన అధికార టిడిపి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పదవిని నిలుపుకునేందుకు 'హరిబాబు' తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా...ఆ పదవి పొందేందుకు ఎమ్మెల్సీ 'వీర్రాజు', మాజీ కేంద్రమంత్రి 'పురందేశ్వరి' తీవ్రంగా యత్నిస్తున్నారు. వీరిలో 'వీర్రాజు' 'కాపు' సామాజికవర్గానికి చెందిన వారు కాగా...'పురంధేశ్వరి, 'హరిబాబు'లు 'కమ్మ'సామాజికవర్గానికి చెందిన వారు. 'కమ్మ' సామాజికవర్గానికి అధ్యక్ష పదవి ఇస్తే..వారు టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తారని, తనకు పదవి ఇస్తే..పార్టీని సొంతగా నిలబెడతానని, 'సోము' అంటున్నారట.కాగా రాయలసీమ నుంచి తమకు అవకాశం ఇవ్వాలని 'రెడ్డి' వర్గానికి చెందిన నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న సీనియర్‌ నాయకుడు ఒకరికి పదవి ఇవ్వాలని ఆ వర్గం డిమాండ్‌ చేస్తుందట.  ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్న దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠత నెలకొని ఉంది.  


(2060)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ