WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

డీజీపీగా 'నండూరి' కొనసాగింపు...!

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీ ఎంపిక వ్యవహారం నూతన మలుపు తిరిగింది. ఈ మాసాంతానికి ప్రస్తుత డీజీపీ 'నండూరి సాంబశివరావు' రిటైర్‌ అవుతారని..ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండి 'మాలకొండయ్య' డీజీపీగా నియమితులవుతారని సాయంత్రం దాకా ప్రచారం జరిగింది. ఈ రోజో..రేపో..దానిపై ఉత్తర్వులు వెలువడతాయని భావిస్తున్న సమయంలో ప్రభుత్వం అనూహ్యంగా రిటైర్డ్‌ కాబోతున్న 'నండూరి సాంబశివరావు'ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 'నండూరి'ని డీజీపీగా కొనసాగిస్తూ జీ.ఒ.ఆర్‌.టి నెం. 2887ను ఉత్తర్వులను వెలువరించింది. ఆయనకు నెలకు రూ.2,25,000/- జీతం ఇస్తున్నట్లు కూడా ఆ జీఓలో తెలిపారు. జిఎడి పొలిటికల్‌ సెక్రటరీ నాగులపల్లి శ్రీకాంత్‌ పేరిట ఉత్తర్వులను ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని జీవోలో పేర్కొన్నారు.  నేడో..రేపో తనకు డీజీపీగా అవకాశం వస్తుందని భావించిన 'మాలకొండయ్య' ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. కాగా 'నండూరి' ఎంత కాలం డీజీపీగా కొనసాగుతారో..అనే విషయంపై జీవోలో ఎటువంటి ఉత్తర్వులను ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు (సంస్కరణలు) సవరణ ఆర్డినెన్స్‌-2017ను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. దాన్ని అనుసరించి...డీజీపీగా 'నండూరి'ని కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. ఈ నెల16వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌ను మంత్రివర్గం ఆమోదించింది. దీనికి గవర్నర్‌ ఆమోదముద్ర వేయటం..దీన్ని అనుసరించి 'సాంబశివరావు'కు పోస్టు ఇవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి.


   'నండూరి సాంబశివరావు'ను డీజీపీగా మరికొన్నాళ్లపాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా పట్టుదలతో వ్యవహరిస్తోంది. దీనిపై ఇటీవల కాలంతో కేంద్రంతో ఘర్షణకు కూడా దిగింది. ఆయనను డీజీపీగా మరో రెండేళ్లపాటు కొనసాగించాలని యూపీఎస్సీకి లేఖ రాసింది. డీజీపీ పోస్టుకు అర్హులైన సీనియర్ల జాబితాను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపగా..వారిలో రమణమూర్తి, సాంబశివరావు, మాలకొండయ్యలకు ఏడాది మాత్రమే సర్వీసు ఉందని, వారిని ఆ జాబితా నుంచి తొలగించి నూతన జాబితా పంపాలని కేంద్రం కోరింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసి..పాత జాబితానే మళ్లీ పంపించింది.అయితే దీనిపై కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కేంద్రం స్పందించకపోవడంతో..రాష్ట్ర ప్రభుత్వం తాము యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేయమని, కర్ణాటకవలే తాము స్వంతంగా డీజీపీని నియమించుకుంటామని చెబుతూ ఆంధ్రప్రదేశ్‌ పోలీసు(సంస్కరణలు) సవరణ ఆర్డినెన్స్‌ను తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా ప్రస్తుతం డీజీపీగా ఉన్న 'నండూరి'కి పూర్తిస్థాయి సర్వీసు ప్రయోజనాలు పొందగలరని ఎక్కువ మంది భావించారు. అయితే ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్‌ను ఉపయోగించుకుని 'నండూరి'ని డీజీపీగా కొనసాగిస్తూ జీవో విడుదల చేయడం గమనార్హం.


(1043)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ