WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాబు'పై ఆర్‌ఎస్‌ఎస్‌ విషప్రచారం...!

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మొదటి నుంచి 'రాష్ట్రీయ స్వయం సేవక్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంటారు. గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని 'చంద్రబాబు' ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయం నుంచి వారు ఆయనపై ధ్వజమెత్తుతూ ఉంటారు. ఆయన వ్యవహారతీరు  వారికి నచ్చకపోవడం వారు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం. పైగా తాము చెప్పినట్లు వినడం లేదనే భావన కూడా ఉండడం, మైనార్టీల పట్ల 'చంద్రబాబు' చూపించే ఆపేక్ష, హిందూ సంస్థలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆలోచన తదితర కారణాలతో పాటు..తమ స్వంత పార్టీ అయిన బిజెపిని రాష్ట్రంలో అధికారంలోకి తేవాలనే కాంక్షతో ఆర్‌ఎస్‌ఎస్‌ బాధ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటారు. అయిన దానికి కాని దాని 'చంద్రబాబు'పై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. ప్రత్యేకించి...చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కోవలో క్రైస్తవుడైన 'వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి'ని భుజాన వేసుకోవడానికి కూడా వారు సంసిద్దంగా ఉన్నారు. వై.ఎస్‌.జగన్‌ అధికారంలో ఉన్నా ఫర్వాలేదు..కానీ...'చంద్రబాబు' అధికారంలో ఉండకూడదనే లక్ష్యంతో ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ పనిచేస్తోంది. అవసరమైన సందర్భంలోనూ, అవసరంలేని చోట కూడా 'చంద్రబాబు' ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందనే భావన వ్యాపింపచేయడంలో వారు ముందుంటున్నారు. దానికి తాజాగా వారు చేస్తోన్న ప్రచారమే ఉదాహరణ.

   ఇటీవల తాము ఒక సర్వే నిర్వహించామని, ఆ సర్వేలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బిజెపికి ప్రస్తుతం ఉన్న సీట్లలో దాదాపు 60పైగా తగ్గిపోతాయని తేలిందట. బిజెపి స్వంతంగా అధికారంలోకి రావడం కష్టమని, నష్టపోయే సీట్లను ఎలా భర్తీ చేసుకోవాలనే దానిపై కసరత్తు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు బిజెపి నేతలకు సూచించారట. ఇంత వరకు పెద్దగా తప్పేమీ లేదు..వాళ్లపార్టీ నష్టపోతుంది కాబట్టి..నష్టనివారణ చర్యలు తీసుకోవాలని కోరవచ్చు...! కానీ...అదే సమయంలో తమ భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ గురించి వ్యాఖ్యలు చేయటం, కావాలనే విష ప్రచారం చేయించడంపైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తమతోపాటు తమ భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి కూడా రాబోయే ఎన్నికల్లో సీట్లు తగ్గుతాయని, ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌.జగన్‌ పార్టీ పుంజుకుంటుందని ప్రచారం నిర్వహిస్తున్నారు. వాస్తవానికి వారు నిర్వహించిన సర్వేలో టిడిపికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 20కి పైగా పార్లమెంట్‌ స్థానాలు వస్తాయని తేలితే...ఆ పార్టీ బలం తగ్గిపోతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యులు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా రోజు రోజుకు బలహీనమవుతున్న పరిస్థితుల్లో...ఆపార్టీ బలం పుంజుకుంటుందని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఎలా చెప్పగలుగుతారు. రాష్ట్రంలో రాజకీయాల గురించి అవగాహన ఉన్న ఎవరిని అడిగినా ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పార్టీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయో చెప్పగలుగుతారు..కానీ..ఆర్‌ఎస్‌ఎస్‌ కావాలనే ఇటు వంటి విష ప్రచారం ముందుండి నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

   కాగా ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న ప్రచారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. దీనిపై ఆయన బహిరంగంగా స్పందించకపోయినా..సన్నిహితుల వద్ద మాత్రం స్పందించినట్లు తెలుస్తోంది. బిజెపి పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని మనపై నెట్టాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారంటున్నారు. వాస్తవానికి మనకు 20కిపైగా పార్లమెంట్‌ స్థానాలు వస్తాయని పలు సర్వేలు చెబుతున్నాయని, బిజెపిపై దేశ వ్యాప్తంగా ఉన్న అసంతృప్తి మన రాష్ట్రంలోనూ ఉందని చంద్రబాబు తన సన్నిహితులతో చెప్పారట. అయితే కావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ తమపై విష ప్రచారం చేస్తుందని, దీన్ని అడ్డుకోవాలని వారికి ఆయన సూచించినట్లు తెలిసింది. ఏది ఏమైనా...ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తోన్న ప్రచారంపై టిడిపి నేతలు రగిలిపోతున్నారు.  


(1627)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ