WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తిరుమలలో ఆకలికేకలు..తోపులాటలు..!

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్య భక్తులకు అక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి. తాగేందుకు నీళ్లు లేవు...తినేందుకు ఆహారం లేదు. వీవీఐపిల దర్శన ఏర్పాటుల్లోనే టీటీడీ అధికారులు సింఘాల్‌, శ్రీనివాసరాజులు తరించారు. సామాన్య భక్తులకు ఏర్పాట్లు చేయడంలో వారు ఘోరంగా విఫలమయ్యారు. గత సంవత్సరం రెండు లక్షల మంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు వచ్చినప్పటికీ వారికి తినేందుకు ఆహారం, పాలు వంటివి అందించారు. అంతే కాకుండా నారాయణగిరి ఉద్వానవనం వద్ద షెడ్‌లు నిర్మించి భక్తులకు వసతి కల్పించారు. అప్పటి ఇఒ సాంబశివరావు క్రింది స్థాయి అధికారులతో సమన్వయంతో అన్నీ తానై దగ్గర ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించడమే కాకుండా..రాత్రింభవళ్లు క్యూలైన్ల చుట్టూ ప్రదిక్షణలు చేశారు. అప్పట్లో శ్రీవారి దర్శనానికి ఆలస్యమై ఉండవచ్చు కానీ...తోపులాటలు జరగలేదు..ఆకలి కేకలు వినిపించలేదు..అప్పట్లో కేవలం రెండున్నర మూడు గంటలు మాత్రమే వీవీఐపిలకు దర్శనానికి అవకాశమిచ్చారు. మిగతా సమయమంతా సామాన్యభక్తులకు కేటాయించారు. కానీ ఈ రోజు సుమారు ఐదు నుంచి ఆరు గంటల వరకు వీవీఐపిల దర్శనానికే సమయం గడిచిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుండి క్యూలైన్లులో ఉన్న భక్తులకు తాగేందుకు నీరు దొరకలేదు..తినేందుకు ఎటువంటి ఆహారం లభించలేదు. భక్తుల ఆకలి తీర్చేందుకు కనీసం పాలు కూడా సరఫరా చేయలేదు. మాకు భోజనాలు వద్దు...టిఫన్‌ వద్దు..తాగేందుకు కనీసం నీటినైనా సరఫరా చేయమని భక్తులు ఆగ్రావేశాలతో కేకలు వేస్తున్నారు. అప్పటికి కానీ..తిరుమలలోని పరిస్థితి ఇఒ సింఘాల్‌కు అర్థం కాలేదు. తిరుమలలోని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించాల్సిన ఇఒ ఎసి గదులకే పరిమితమై క్రిందిస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పచెప్పి చేతులు కాల్చుకున్నారు. 

   తిరుమల కొండపై మొట్టమొదటిసారిగా ఆకలి కేకలు, దాహం అంటూ భక్తులు నినాదాలు చేశారని వార్తలు వస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించండి...కింది స్థాయి అధికారులపై ఆధారపడవద్దు..పరిస్థితి అదుపు తప్పితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కొందరు రిటైర్డ్‌ అధికారులు సింఘాల్‌కు సూచించినా ఆయన వినిపించుకోలేదు. దాని ఫలితమే నేడు తిరుమల కొండపై నెలకొన్న పరిస్థితి అని వారు అంటున్నారు. ప్రస్తుతం కొండపై ఉన్న లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం పూర్తి చేసుకోవాలంటే రేపు రాత్రి వరకు సమయం పట్టవచ్చు. ఈ మధ్య కాలంలో వారికి కావాల్సిన ఆహారసదుపాయాలను ఏర్పాటు చేయడం చాలా కష్టం. ముందస్తు ప్రణాళిక లేకుండా..ఇప్పుడు ఆదరాబదరాగా అధికారులపై కేకలు వేస్తే..భక్తుల ఆకలి తీరుతుందా..? అని రిటైర్డ్‌ అధికారులు మీడియా వర్గాలతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా అప్పటి ఇఒ సాంబశివరావు భక్తులకు కావాల్సిన సౌకర్యాలను దగ్గర ఉండి పర్యవేక్షించారు. దీంతో అప్పట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు శ్రీవారిని దర్శించుకుని సంతృప్తిగా వెనుతిరిగారు. మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరం సందర్భంగా తిరుమలకు రావద్దని, గదులు ఖాళీగా లేవని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇఒ సింఘాల్‌. కొండపై క్యూలైన్లు సుమారు ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉన్నట్లు..కొందరు భక్తులు మీడియాకు సమాచారం ఇస్తున్నారు.


(315)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ