WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఎల్‌వి' అహంభావే కానీ...అవినీతిపరుడు కాదు...!

తెల్లవారితే కుమారుడి పెళ్లి...కుటుంబసభ్యులతో,బంధువులతో ఆయన గృహం కళకళలాడిపోతోంది. అంతే కాకుండా టీటీడీ వంటి ధార్మిక సంస్థ ఆయన ఇఒగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఆయన కుమారుడి పెళ్లి. అంతకు ముందు రోజున ఎలక్ట్రానిక్‌ మీడియాలో అదుగో...ఆయనను అరెస్టు చేస్తున్నారు..ఇదుగో...అంటూ పోటీ ప్రచారం చేశాయి. ఎల్‌వి అరెస్టుకు రంగం సిద్ధమైందని ప్రచారం జరగడంతో ఎంతో ఆనందంతో పెళ్లి తంతు పూర్తి చేసుకోవాల్సిన ఆయన వారి కుటుంబ సభ్యులు చివరకు భగవంతునిపై భారం పెట్టారు. 'వెంకన్న' కరుణ చూపించి...ఎటువంటి అరెస్టులు లేకుండా పెళ్లి తంతు పూర్తి చేయించారు. అది అప్పటి కథ...! ఎమ్మార్‌ కేసులో ఎల్‌విని నిందితునిగా చేర్చడానికి హైకోర్టు కొట్టివేసింది...సీబీఐ ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. గతంలో ఆయన ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించగా...2016లో విచారణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి విధానం సరైన పద్దతిలో జరగలేదని కోర్టు తప్పుపట్టింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కేంద్రం తిరస్కరించకూడదని చెప్పింది. ఎపిఐఐసికి ఎండిగా 'ఎల్‌వి' బాధ్యతలు నిర్వహించినప్పుడు ప్రభుత్వానికి ఆయన నష్టం చేకూర్చారని సీబీఐ చేసిన అభియోగాన్ని కోర్టు తోసిపుచ్చుతూ...అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 'ఎల్‌వి' అమలు చేశారు..కానీ..అవి ఆయన స్వంత నిర్ణయాలు కావని కోర్టు స్పష్టం చేసింది. అప్పట్లో భూములు కేటాయించడంలో తక్కువ ధరను చూపించారన్న సీబీఐ వాదను కోర్టు తోసిపుచ్చింది. ఇది నిన్న జరిగిన విషయం.

    1983 బ్యాచ్‌కు చెందిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం తన సర్వీసులో ఎన్నడూ అవినీతికి పాల్పడినట్లు అధికార,రాజకీయవ్యవస్థతో పాటు, ఉద్యోగ వర్గాలు కూడా తప్పుపట్టలేదు..విమర్శించలేదు... ఆరోపించలేదు. నిబందనల ప్రకారమే ఎల్‌వి నిర్ణయం తీసుకుంటారు. ఆయన వ్యక్తిగతంగా మంచివాడైనప్పటికీ, అహంభావమే ఆయన పాలిట శాపంగా మారింది. ఎవరి నమ్మాలో..వారిని నమ్మరు...ఎవరిని నమ్మకూడదో..వారిని నమ్మి నట్టేట మునిగిపోయారు. కుమారుడి పెళ్లికి అయ్యే ఖర్చు కోసం ఆయన అప్పులు చేశారంటే ఆయన ఆర్థిక పరిస్థితి ఏమిటో స్పష్టం అవుతుంది. ఎమ్మార్‌ కేసు నుంచి 'ఎల్‌వి' బయటపడడంతో ఆయనతో పాటు ఐఎఎస్‌ వర్గాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. గతంలో ఆయనపై మీడియా అత్యుత్సాహం చూపించి, అవాస్తవాలు ప్రచారం చేయడమే కాకుండా, సీబీఐ అధికారుల లీకులతో అవాస్తకథనాలను ప్రచురించాయి. జరగాల్సిన నష్టం ఎల్‌వికి ఏనాడో జరిగిపోయింది. తాజాగా కేసు కొట్టివేసినా..గతంలో ఆయన, ఆయన కుటుంబసభ్యులు పడ్డ ఆవేదన తిరిగి రాదు కదా..! సీబీఐ డిపార్ట్‌మెంట్‌, ఎలక్ట్రానిక్‌,ప్రింట్‌మీడియాలు నిజాయితీపరుడైన ఒక ఐఎఎస్‌ అధికారిని మానసికంగా ఆందోళనకు గురి చేయడమే కాకుండా, ఆయన వ్యక్తిగత ప్రతిష్టను మంటగలిపాయి. తాజాగా కోర్టు తీర్పుతో మరికొందరు అధికారులు నిర్దోషులుగా బయటపడే అవకాశాలున్నాయని 'ఎల్‌వి' విషయంతో స్పష్టమైందని అధికారవర్గాలు అంటున్నాయి.

(290)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ