WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆది నుంచి 'నర్సింహ్మన్‌' వివాదాస్పదుడే...!

తెలంగా కాంగ్రెస్‌ నాయకులతో లొల్లి పెట్టుకుని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నర్సింహ్మన్‌ పరువు తీసుకున్నారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అధికార తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన కాంగ్రెస్‌ నేతలపై ఆయన విరుచుకుపడడం, దానికి ప్రతిగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎదురుదాడికి దిగడం సంచలనం సృష్టిస్తోంది. ఒక రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న వ్యక్తి ప్రతిపక్షాలపై మాటల దాడి చేయడం, ప్రభుత్వ పెద్దలపై ఫిర్యాదు చేస్తారా..? అని ప్రశ్నించడం సహజంగా జరగదు. గతంలో ఏ రాష్ట్ర గవర్నర్‌ కూడా ఈ విధంగా వ్యవహరించలేదు. కొంత మంది గవర్నర్‌లు అధికారపార్టీకి సానుకూలంగా ఉండడం సహజమే కానీ..మరీ ఇంతగానా..? అధికారపార్టీపై సహజంగా ప్రతిపక్షాలు గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తుంటాయి..దానికి గవర్నర్‌ పరిశీలిస్తాననో..లేదంటే...మౌనంగా ఉండడం జరుగుతుంది. కానీ...నిన్న గవర్నర్‌ నర్సింహ్మన్‌ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయింది.  ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్‌పై, ఆయన కుమారుడిపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ నాయకులపై విమర్శలు గుప్పించారు. ఇసుక మాఫియా అనేది ఇప్పుడే ఉందా..? ఇంతకు ముందు లేదా..? అని ప్రశ్నించారు. ఇసుక మాఫియా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరు మరణించడం, దానిపై ప్రతిపక్షం ఫిర్యాదు చేయడంలో ఆయనకు ఉన్న అభ్యంతరం ఏమిటో..అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఈగవాలినా సహించలేనట్లు ఆయన ఎందుక వ్యవహరిస్తున్నారు. గవర్నర్‌ నర్సింహ్మన్‌ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఏజెంట్‌ అన్న కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు నిజమేననట్లు ఆయన వ్యవహరించారు.

   కాంగ్రెస్‌ హయాంలో గవర్నర్‌గా నియమితులైన నర్సింహ్మన్‌ తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ ఉద్యమకారుల పట్ల కఠినంగా వ్యవహరించారు. వారి ఉద్యమాన్ని చులకనగా చూస్తూ..కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు ఇచ్చేవారు. అప్పట్లో ఈ విషయంపై ఇప్పటి రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పడు ఉద్యమకారులు ఆయన కుర్చీని లాగివేశారు. అప్పట్లో ఆయన దాన్ని తీవ్ర అవమానంగా భావించారు. అయితే...తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించుకున్న తరువాత ఆయన హఠాత్తుగా ఉద్యమకారులతో మంచి సంబంధాలు నెరపగలిగారు. అదే సమయంలో సమైక్యవాదుల పట్ల ఆయన నిరంకుశంగా వ్యవహరించేవారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బాగా దగ్గరైయ్యారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ గవర్నర్‌ నర్సింహ్మన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఆంధ్రా, తెలంగాణకు చెందిన ఉమ్మడి ఆస్తుల పంపకంలో కూడా ఆయన సక్రమంగా వ్యవహరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేయడం లేదని, రెండు తెలుగు రాష్ట్రాల అధినేతలపై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారంటారు. ఇద్దరు ముఖ్యమంత్రుల రహస్యాలను బిజెపి పెద్దలకు చేరవేశారని, అందువల్లే ఆయన పదవీ కాలం ముగిసిపోయినా..ఇంకా బిజెపి పెద్దలు ఆయనను గవర్నర్‌గా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయనపై విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా....ఇప్పుడు ప్రతిపక్షంతో ఆయన వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అవుతుంది. గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లని గతంలో విమర్శలు ఉండేవి. కానీ...నర్సింహ్మన్‌ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారనే విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తోంది. ఏది ఏమైనా నర్సింహ్మన్‌ తీరు వివాదాస్పదం అవుతుంది. మరి ఆయన ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాల్సి ఉంది.  


(549)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ