లేటెస్ట్

మూడు నెలల్లోనే ఇంత వ్యతిరేకతా...!?

'కాలు తొక్కిన నాడే...తెలుస్తుంది...కాపురం చేసే కళ'...అని...తెలుగు సామెత. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాలనపై ఇప్పుడు ఇటువంటి సామెతలే ప్రజల నుంచి వస్తున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆరు నెలల్లో ప్రజలచే మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని ఆయన ఎంతో  ఆత్మవిశ్వాసంతో చెప్పుకున్నారు. ఆరు నెలల్లో అప్పుడే మూడు మాసాలు గడిచిపోయాయి. ఐదేళ్ల కాలానికి ఎన్నుకోబడ్డ ప్రభుత్వంపై మూడు నెలల్లోనే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు కానీ...ఆయన చెప్పుకున్నట్లు ఆరు నెలల్లో సగం కాలం గడిచిపోయిందని చెప్పడమే రచయిత ఉద్దేశ్యం.  ఈ మూడు మాసాల్లో తొలి మాసంలో మాత్రం ఆయన అన్నట్లే యువ ముఖ్యమంత్రి మంచి నిర్ణయాలు తీసుకుంటు న్నారని, ఆయన కక్షలకు, కార్పణ్యాలకు పోకుండా..రాష్ట్ర ప్రజల అభివృద్ధి,సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారని ఆయన వ్యతిరేకులు కూడా భావించారు. అసెంబ్లీ సమావేశాల్లో వెంట వెంటనే పేద ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ప్రవేశపెట్టి...ఇది పేదల ప్రభుత్వం అనే భావన కలిగించారు. మంత్రివర్గ ఏర్పాటులో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి...గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా చూసుకున్నారు. ఆరుగురు డిప్యూటీ సిఎంలను నియమించడం హాస్యాస్పదమే అయినా...'జగన్‌' మద్దతుదారులకు మాత్రం అది ఆనందాన్ని నింపింది. దీని విషయంలో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా తమ వర్గానికి చెందిన నేత డిప్యూటీ సిఎంగా ఉన్నారని చెప్పుకోవడానికి అది ఉపకరించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అధికారం చేపట్టిన మొదటి నెలలో తాను చేయాలనుకున్న 'నవరత్నాలు' పథకాల గురించి ఆగ మేఘాలపై నిర్ణయాలు తీసుకుని..ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. తన కావాల్సిన అధికారులను పేషీలో నియమించుకుని, ఇతర శాఖాధిపతులుగా పెద్దగా వివాదాస్పదం కాని అధికారులను నియమించుకుని ఫర్వాలేదనిపించుకున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై  ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన పాత 'జగన్‌' కాదని, ఆయన సుధీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండానికి కావాల్సిన పునాది వేసుకుంటున్నారని అంచనా వేశారు. కానీ..అదంతా మొదటి నెలలోనే...? రెండో నెల నుంచి 'జగన్‌' తనదైన విశ్వరూపాన్ని చూపారు. 

మొదట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద గత ప్రభుత్వం నిర్మించిన 'ప్రజావేదిక'ను కూల్చివేశారు. ఇది అక్రమకట్టడమని, అధికారంలో ఉన్నవారే ఇలాంటి తప్పులు చేస్తే...ఎలా అంటూ..దాని కూల్చివేతను ఆయన సమర్థించుకున్నారు. ప్రతిపక్షాలు, ఇతరత్రా వ్యక్తులు ఎన్ని వ్యాఖ్యలు చేసినా...ఆయనను సమర్థించేవారు, ఆయన పార్టీ నాయకులు మాత్రం అది సరైన చర్యేనని భావించారు. దాని సంగతి పక్కన పెడితే తరువాత సాంప్రదాయేతర విద్యుత్‌ కంపెనీలతో గత ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందాలను సమీక్షిస్తామని, దీనిలో అవినీతిని వెలికితీస్తామని, ఆ ఒప్పందాలను రద్దు చేస్తున్నామని ప్రకటించిన దగ్గర నుంచి 'జగన్‌' ఒక్కొక్కటే వివాదాస్పద నిర్ణయాలను ప్రకటిస్తూ వచ్చారు. పీపీఏల ఒప్పందాలను సమీక్షించవద్దని కేంద్రం కోరినా, ఆయా కంపెనీలుకోరినా ఆయన లెక్క చేయలేదు. దీనిపై సాక్షాత్తూ కేంద్ర మంత్రి లేఖ రాసినా..'జగన్‌' లెక్కచేయలేదు. ఆ తరువాత వరుసగా అన్ని వివాదాస్పద నిర్ణయాలే ప్రభుత్వం నుంచి వచ్చాయి. పోలవరం రివర్స్‌టెండర్లు, ఇసుక విధానం, ఎఎన్‌ఎంలు, రేషన్‌కార్డులతొలగింపు, రేషన్‌డీలర్ల తొలగింపు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తొలగింపు, ఈ-కేవైసీ, రాజధాని అమరావతి తరలింపు, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంటు, గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లింపు అంశం, ఉద్యోగుల జీతాలు ఆలస్యం కావడం, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపు, వరదలు వంటి విషయాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. పైన చెప్పుకున్న వాటి కన్నా ముఖ్యమైంది..'అన్నక్యాంటీన్ల తొలగింపు'. 

కడుపేదవాడికి బుక్కెడు అన్నం దొరికే అన్నక్యాంటీన్లను చెప్పాపెట్టకుండా మూసివేయడంతో...పేదలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో మంచి జరిగినా జరగకపోయినా..వేళకు ఇంత అన్నం తినేవారమని, ఇప్పుడూ అదీ లేకుండా చేశారని వారు ధ్వజమెత్తుతున్నారు. తామంతా 'జగన్‌'కు ఓటు వేశామని..కానీ..ఇప్పుడు అదే 'జగన్‌' తమ నోటికాడ కూడు తీసేశాడని 'ఇసుక కార్మికులు' ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు 'అన్నక్యాంటీన్ల'ను తొలగించారని ప్రజలు ఆగ్రహంతో ఉంటే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు 'అన్నక్యాంటీన్ల' వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని వారిని కించపరుస్తూ మాట్లాడడం వారి కోపం రెట్టింపు అవడానికి కారణమైంది. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న అన్యమత ప్రచారం..రాజకీయంగా 'జగన్‌'కు చికాకులు తెచ్చిపెడుతోంది. నిన్నటి దాకా తమకు మద్దతు ఇచ్చి కాపాడిన బిజెపి పెద్దలు అన్యమత ప్రచారాన్ని అస్త్రంగా చేసుకుని రాజకీయంగా ఎదగడానికి ఎక్కడికక్కడ ఉద్యమాలు నిర్మించాలనే కుతూహలంతో ఉన్నారు.వారికా అవకాశాన్ని 'జగన్‌' పార్టీ నేతలే చేతులారా ఇచ్చినట్లైంది. 

'అన్నక్యాంటీన్లు', అన్యమతప్రచారం, రాజధాని తరలింపు, రియల్‌ఎస్టేట్‌, భవన నిర్మాణ రంగం కుంటుపడడంతో సగటు కార్మికులు పొట్ట గడవక వలసలు పోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏ రంగం చూసినా...పాతళం వైపు చూస్తున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని..తమకేదో చేస్తాడని భావించిన సగటు ప్రజలు...ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, పనితీరు చూసి...పెదవి విరుస్తున్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన 'జగన్‌'...తనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చడంలో విఫలమయ్యారనే వ్యాఖ్యలు ఆయనను సమర్థించే వర్గాల నుంచే వ్యక్తం అవుతున్నాయి. పరిపాలనానుభవం లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం,సరైన సలహాలు ఇచ్చే వ్యక్తులు లేకపోవడం వల్లే తమ నేతకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని, తొలిరోజుల పాలననే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదని, అనుభవంతో మంచి పరిపాలన ఇస్తారని, అప్పటి వరకు వేచి చూడాలని, ముందుగానే విఫలనేతగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని 'జగన్‌'ను అభిమానించే నాయకులు, అభిమానులు చెబుతున్నారు. వారు 'జగన్‌'ను ఎంత సమర్థించినా..ఆకలితో అలమటించే వ్యక్తులు...వారి మాటలను ఆలకిస్తారా..? మొదటల్లో అనుకున్నట్లు మొదటి మూడు నెలల్లోనే 'జగన్‌'పాలనను అంచనా వేయాల్సిన అవసరం లేదు. అయితే మొండిగా తన మాటే చెల్లాలన్నట్లు వ్యవహరించడం ఆయనకు మేలు చేయదు. ఇప్పటికైనా తప్పులు దిద్దుకుని, సరైన సలహాదారులను పెట్టుకుని పాలన నడిపిస్తే...ఆయన ఆశించినట్లు మంచి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు.  

(851)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ