లేటెస్ట్

'కల్లం'ను తప్పిస్తారన్న వార్తల్లో నిజమెంత...!?

వారం రోజుల నుంచి ఒక వార్త వెబ్‌మీడియాలో తిరుగుతూ ఉంది. అదేమిటంటే...రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు 'అజయ్‌కల్లంరెడ్డి'ని 'జగన్‌' సలహాదారు పోస్టు నుంచి తప్పించబోతున్నారని, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి 'అజయ్‌' సరైన సలహాలు ఇవ్వడంలో విఫలమయ్యారని, ఆయన వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందనే భావనతో అధికార పార్టీ నాయకులు, అధినేత ఉన్నారని, దీంతో ఆయనను తప్పిస్తారని ఆవార్తల సారాంశం. ముఖ్యమంత్రి 'జగన్మోహన్‌రెడ్డి' అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన ప్రధాన నియామకాల్లో 'అజయ్‌కల్లంరెడ్డి'దీ ఒకటి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, వివిధ శాఖలకు అధిపతిగా పనిచేసిన 'అజయ్‌కల్లంరెడ్డి' సేవలను ఉపయోగించుకోవాలని ఆయనను ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. ఐఎఎస్‌ అధికారిగా ఆయన గత ప్రభుత్వాల్లో కీలకంగా పనిచేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో ఆయన పలు కీలకశాఖలకు బాధ్యునిగా వ్యవహరించారు. వివాదరహితుడు, నిజాయితీపరుడనే పేరున్న 'అజయ్‌' టిడిపి,కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు ఇష్టుడుగా ఉండేవారు. అటువంటి 'అజయ్‌'ను 'జగన్‌' ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రభుత్వ యంత్రాగాన్ని నడపడానికి, తనకు సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడతారని భావించి, భారీగా జీతం ఇచ్చి నియమించుకున్నారు. అదీకాక..వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..టిడిపి ప్రభుత్వంపై 'కల్లం' భారీ స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో ఆయన చేసిన పోరాటం వైకాపా పెద్దలకు మంచి మైలేజ్‌ తెచ్చిపెట్టింది. రాజధానికి అన్ని వేల ఎకరాలు అవసరం లేదని...మూడు వేల ఎకరాల్లో రాజధాని ఉంటే చాలని ఆయన రాసిన 'మేలుకొలుపు' పుస్తకం ద్వారా వాడవాడాలా టామ్‌టామ్‌ వేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకు సహకరించడం, అధికారపరంగా అనుభవం ఉండడంతో 'జగన్‌' 'కల్లం'కు ఎక్కువ ప్రధాన్యత ఇచ్చి పరిపాలనను మొత్తం ఆయనకు వదిలేశారు. 

మొదట్లో 'కల్లం' సలహాలు 'జగన్‌'ను బాగానే ఆకట్టుకున్నాయి. గత టిడిపి ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని, దీనిపై విచారణలు జరిపించాలని 'కల్లం' సలహా ఇచ్చారు. పవన విద్యుత్‌రంగంలోని పీపీఏలపై విచారణలకు, పోలవరం ప్రాజెక్టు పనుల్లో రీటెండరింగ్‌, వాలంటీర్లు, గ్రామ సచివాలయాలపై నిర్ణయాలు తదితరాలు 'అజయ్‌కల్లంరెడ్డి' నుంచి వచ్చినవే. తొలుత ఆయన విధానాలపై వైకాపాలో మెజార్టీ నాయకులు...మద్దతు ఇచ్చారు. అయితే 'పీపీఏ'లపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేయడం, తరువాత పోలవరం రీటెండరింగ్‌ విషయంలో హైకోర్టు తీర్పు, అమరావతి విషయంలో జరుగుతున్న రగడ, ఇసుక విధానం,అన్న క్యాంటీన్లు తదితర విషయాలపై ప్రభుత్వం సరిగా వ్యవహరించలేకపోవ డంతో...వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తికి కారణం అయింది. ఇదే సమయంలో 'జగన్‌' అమెరికా పర్యటనలో ఉండడంతో..ఒక్కసారిగా ప్రజల్లో రేగిన అసంతృప్తి పార్టీ పెద్దలను ఇబ్బందులకు గురిచేసింది. 

మరోవైపు పీపీఏల విషయంలో తాము చెప్పినా...మొండిగా పీపీఏలపై వాదనలు చేయడంపై ప్రధాని మోడీ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో..'కల్లం' విషయంలో 'జగన్‌' తొలిసారి అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ముఖ్యంగా పీపీఏల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెబుతోన్న 'కల్లం' దాన్ని నిరూపించడంలో విఫలమయ్యారు. ఎంత సేపూ అవినీతి జరిగింది..రద్దు చేస్తామని చెపితే ఎలా...? నిర్ధిష్టమైన రుజువులు చూపకుండా అంతర్జాతీయ కంపెనీలపై ఆరోపణలు చేయడంతో ప్రధాని ముఖ్యమంత్రిపై అసహనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీనంతటికి 'కల్లం' సలహాలే కారణమని వైకాపా వర్గాలు అంటున్నాయి. ఇక రాజధాని విషయంలో కూడా 'కల్లం' గతంలో చెప్పిన దానికి ఇప్పుడు చెబుతున్న దానికి పొంతనలేదని అంటున్నారు. రాజధానిపై అంత రగడ జరుగుతున్నా..సరిగా వ్యవహరించలేకపోవడం 'జగన్‌' అసహనానికి మరో కారణం అంటున్నారు. పోలవరం రీటెండరింగ్‌, వరదల విషయం, ఇసుక వ్యవహారం, పెండింగ్‌ బిల్లులు చెల్లింపు వ్యవహారాల్లో 'కల్లం' తాను అనుకున్నట్లు చేసుకునిపోతుండడంతో ప్రభుత్వం ఇబ్బందులు పాలవుతుందని, ఆయన ముక్కుసూటిగా, బండగా వ్యవహరిస్తుండడంతో ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని, తద్వారా 'జగన్‌' ప్రజల్లో చులకన అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పుడే తొలగిస్తారా...!?

అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే..అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నియమించిన 'అజయ్‌కల్లంరెడ్డి'ని ఇప్పుడిప్పుడే తొలగిస్తారనే వ్యాఖ్యలు అధికార పార్టీలో వినిపించినా..అది అంత తొందరగా జరిగే వ్యవహారం కాదంటున్నారు. పార్టీకి అవసరమైన రాజకీయ, అధికార సలహాలు ఇచ్చే వారిలో ముందు వరసలో ఉండే ఆయనను తొలగిస్తే..ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే అభిప్రాయం ఉంది. అంతే కాకుండా 'జగన్‌' తన వైఫల్యాలకు 'కల్లం'ను బాధ్యులు చేస్తున్నారనే విమర్శలు వస్తాయి. ఇంకా మూడు మాసాలు కాకుండానే తొలగింపులు చేయడం 'జగన్‌'కు ఇబ్బందికరమైన విషయమే అవుతుంది. మొత్తం మీద..చూస్తే..ఇప్పటికిప్పుడు ఆయనను తొలగించే అవకాశాలు మాత్రం లేదు. అయితే గతంలో వలే ఆయనకు 'జగన్‌' ప్రాధాన్యత ఇవ్వరని, ఆయనను క్రమేపి తగ్గిస్తారని సచివాలయ అధికార వర్గాలు అంటున్నాయి. సిఎంఒలోని ఇతర అధికారులకు ప్రాధాన్యత ఇస్తారని, 'అజయ్‌'ను ప్రస్తుతానికి కదలించరని, భవిష్యత్‌లో మాత్రం వేటు తప్పదని అంటున్నారు. 'కల్లం'ను నియమించినప్పుడు మూడు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారని జీఓ ఇచ్చారని, కానీ..ఆయన తన పదవీ కాలం మాత్రం పూర్తి చేయలేరని మాత్రం వారు స్పష్టంగా చెబుతున్నారు. 

(633)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ