WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కరణం,రామసుబ్బారెడ్డిలకు 'బాబు' ఆఖరి వార్నింగ్‌...!

ఎన్నికలు తరుముకొస్తున్న వేళ...తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్న విభేదాలు, సమస్యలు, సమన్వయం, ఇతర విషయాలపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ ఆదివారం నాడు విజయవాడకు దగ్గరలోని ఉండవల్లిలో ఒక వర్క్‌షాప్‌ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎటువంటి శబిషలకు తావివ్వకుండా..నియోజకవర్గాల్లో...ఇబ్బందులు సృష్టిస్తున్న నాయకులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఖరి హెచ్చరికలు జారీ చేశారట. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా ప్రకాశం,కడప జిల్లాలో వైకాపా నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు 'గొట్టిపాటి రవికుమార్‌', మంత్రి ఆదినారాయణరెడ్డిలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న ఎమ్మెల్సీలు 'కరణం బలరాం', రామసుబ్బారెడ్డిలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. వైకాపా నుంచి 'గొట్టిపాటి, ఆదిలు పార్టీలో చేరడంతో..పార్టీ ఆయా నియోజకవర్గాల్లో పటిష్టమైందని సగటు కార్యకర్తలు సంతోషిస్తున్న సమయంలో ఎమ్మెల్సీలు 'కరణం,రామసుబ్బారెడ్డి'లు వారికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలు, చేష్టలు పార్టీ పరువును తీస్తున్నాయి.

  గత ఎన్నికల్లో 'గొట్టిపాటిరవికుమార్‌'పై పోటీ చేసి ఓడిపోయిన 'కరణం' కుమారుడు, బలరాంలు..ఇప్పుడు 'గొట్టిపాటి'ని ప్రతిసారీ ఇబ్బందులకు గురిచేస్తున్నవిషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. 'గొట్టిపాటి పార్టీ కార్యక్రమాలకు వచ్చినప్పుడు..ఆయనపై దాడికి ప్రయత్నించడం, కుర్చీ ఎత్తి కొట్టబోవడం..తదితర విషయాలు సంచలనం సృష్టించాయి. దీంతో...ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్‌లు ఇప్పటికే...'కరణం బలరాం'పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్‌ అయిన 'కరణం బలరాం' పలుసార్లు 'గొట్టిపాటి'పై ఓడిపోయి..నియోజకవర్గంలో పట్టుకోల్పోయినా..సీనియర్‌ అన్న భావనతో ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చినా..ఆయన పదే పదే గొడవలు సృష్టించి పార్టీ పరువును తీస్తున్న వైనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. అయితే...ఈ రోజు వర్క్‌షాప్‌లో 'కరణం' వ్యవహారంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మీకు ఇవ్వాల్సింది..ఇచ్చాం..మీరు పదే పదే ఓడిపోయి ప్రజల్లో పట్టుకోల్పోతే...పార్టీ నష్టపోవాలా..? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పార్టీ పటిష్టంగా ఉన్న చోట మీరు ఇబ్బందులు సృష్టిస్తే..చూస్తూ..ఊరుకోను..ఇదే మీకు లాస్ట్‌ వార్నింగ్‌ అంటూ ఆయన ఫైర్‌ అయినట్లు పార్టీనాయకులు చెబుతున్నారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ 'రామసుబ్బారెడ్డి'పై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట.  

  'జమ్మలమడుగు' నియోజకవర్గం నుంచి మూడుసార్లు వరసగా భారీ తేడాతో ఓడిపోయిన 'రామసుబ్బారెడ్డి'కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి..ఆయనకు పార్టీపట్ల ఉన్న విధేయతను, సీనియార్టీని గౌరవించానని,  అయినా సంతృప్తి చెందడం లేదని, ఇంకా మీకేమీ ఇవ్వాలి...అని పరోక్షంగా 'చంద్రబాబు' తీవ్ర స్వరంతో అడిగారట. ఈ ఇద్దరినే కాకుండా..'చీరాల' నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పోతుల సునీత కలుగ చేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా పార్టీ బలంగా ఉంది. ఇండిపెండెంట్‌గా గెలిచిన ఎమ్మెల్యే పార్టీలో చేరారు. దీంతో ఇన్‌ఛార్జిగా ఉన్న 'సునీత'కు ఎమ్మెల్సీ ఇచ్చి ఆమె గౌరవాన్ని కాపాడాం. దీంతో సంతృప్తి చెందకుండా..పార్టీ పరువును తీస్తున్నారని..ఇది సరికాదని..పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చిందని...ఇంకా ఏమైనా కావాల్సి ఉంటే..తనను కలవాలని..అంతే కానీ..పార్టీని ఇబ్బందులు పెడతామంటే..ఎలా..? అని ఆయన ప్రశ్నించారట. 

  పార్టీ ఎమ్మెల్యేగా 'ఆమంచి కృష్ణమోహన్‌' ఉన్నారని, ఆయనకు ప్రజల్లో బలం ఉందని, రాబోయే ఎన్నికల్లో ఆయనే మళ్లీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని 'చంద్రబాబు' స్పష్టం చేశారని, ఇప్పటికైనా..'సునీత' తన వ్యవహారశైలిని మార్చుకోవాలని హితవు పలికినట్లు తెలుస్తోంది. వీరే కాకుండా మరో ఎమ్మెల్సీని కూడా ఆయన హెచ్చరించారట. మొత్తం మీద పార్టీలో బహునాయకత్వం ఉన్నచోట...గొడవలు పడుతూ నాయకత్వం కోసం ప్రయత్నిస్తున్న చోట..ఆయన ఈ వర్క్‌షాప్‌ సందర్భంగా స్పష్టత ఇచ్చారని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే..వారిని వదులుకోవడానికి తానుసిద్ధంగా ఉన్నానని తేల్చి చెబుతున్నారని..ఇక అసంతృప్తులు..ఉంటే పార్టీలో క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని..లేకుంటే వారిదారి వారు చూసుకోవాల్సిందేనని..సమావేశంలో పాల్గొన్న నాయకులు చెబుతున్నారు. మరి 'చంద్రబాబు' ఆగ్రహం వీరిపై ఎంత వరకు పనిచేస్తుందో వేచి చూడాలి.


(2499)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ