లేటెస్ట్

'పత్తిపాటి' జోలికి పోని 'జగన్‌'...!

గుంటూరు జిల్లాలో ఎన్నికల అనంతరం రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజకీయ చైతన్యం కలిగిన ఈ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికలు వైకాపాకు మరిచిపోలేని విజయాన్ని కట్టబెట్టాయి. జిల్లాలో మొత్తం 17సీట్లు ఉంటే 15 సీట్లు గెలుచుకుని ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. టిడిపికి చెందిన మహామహులు..ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. వరుసగా ఐదుసార్లు గెలిచి డబల్‌హ్యాట్రిక్‌సాధిస్తారని భావించిన 'ధూళ్లిపాళ్ల నరేంద్రకుమార్‌' వంటి నాయకులు కూడా ఓటమిని రుచిచూశారు. ఆయన కాకుండా మాజీ మంత్రులు 'పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనంద్‌బాబు', మాజీ స్పీకర్‌ 'కోడెల శివప్రసాద్‌, సీనియర్‌ మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జివి ఆంజనేయులు, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, కొమ్మాలపాటి శ్రీధర్‌ తదితర నేతలు పరాజయం చెందారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే అయినా..జిల్లా వైకాపా గెలిచిన తరువాత కక్షసాధింపు రాజకీయాలు మొదలయ్యాయి. టిడిపికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ నేతలు వారిని అణగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన టిడిపికి చెందిన నేతలను ఇప్పుడు వైకాపా నాయకులు ఆడుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆయన కుటుంబ సభ్యులపై, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులపై అధికార పార్టీ వేధింపులకు పాల్పడుతోంది. అదే సమయంలో వివిధ నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకులను కూడా వేధింపులకు గురిచేస్తోంది. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కక్షలకు పాల్పడుతున్న వైకాపా ఇటీవలే మాజీ మంత్రి అయిన 'పత్తిపాటి పుల్లారావు' విషయంలో మాత్రం చూసీచూడనట్లు పోతుందనే మాట అధికార పార్టీ నాయకుల నుంచే వ్యక్తం అవుతోంది. 

టిడిపి అధికారంలో ఉన్నప్పుడు జిల్లాల్లో 'కోడెల, యరపతినేని, పత్తిపాటి'ల హవా నడిచింది. వీరిలో 'కోడెల' కుటుంబం నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిందనే విమర్శలు ఉన్నాయి. కోడెల కుమారుడు, కుమార్తె అవినీతిపై ఇప్పుడు వైకాపా నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఆయనపై పలు కేసులు నమోదు చేయించారు. 'కోడెల'పై ఆయన కుమారుడు, కుమార్తెలపై దాదాపు 30కి పైగా కేసులు పెట్టారు. మరోవైపు గురజాలకు చెందిన మాజీ శాసనసభ్యుడు 'యరపతినేని శ్రీనివాసరావు'పై కూడా కేసులు పెట్టించారు. అక్రమ మైనింగ్‌ విషయంలో ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అక్రమమైనింగ్‌ పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి. రాజకీయంగా తమకు ఎప్పటికైనా..అడ్డు వస్తాడనే భావనతో..'యరపతినేని' అంతు చూడాలని వైకాపా నాయకులు యత్నిస్తున్నారనే మాట వినిపిస్తోంది. కాగా..గత టిడిపి ప్రభుత్వంలో జిల్లాలో పెత్తనం చేసిన మాజీ మంత్రి 'పత్తిపాటి పుల్లారావు'పై మాత్రం వైకాపా ప్రతీకార చర్యలకు పాల్పడడం లేదు. 'పత్తిపాటి' కుటుంబ సభ్యులు గతంలో పలు విషయాల్లో వివాదాస్పదం అయ్యారు. అయితే 'పత్తిపాటి' కుటుంబసభ్యులు..వైకాపా నేతలను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయలేదు. తమ సంగతి తాము చూసుకున్నారని అప్పట్లో వైకాపా నేతలను వేధించలేదని, వారికి కూడా పనులు చేయించిపెట్టారని, దీంతో..ఇప్పుడు 'పత్తిపాటి' జోలికి వైకాపా నేతలు రావడం లేదంటున్నారు. అదీ కాక వ్యాపారవేత్త అయిన 'పత్తిపాటి' అన్ని పార్టీల నాయకులతో సరదాగా ఉంటారని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు వైకాపా నేతలతో కలిసి చేసిన వ్యాపారాల వల్లే ఆయనకు ఇప్పుడు పెద్దగా సెగ తగలడం లేదంటున్నారు. టిడిపిలో ఉంటూ...కాంగ్రెస్‌, వైకాపా నేతలతో కలసి వ్యాపారాలు చేసిన 'పత్తిపాటి'కి ఇప్పుడు..వైకాపా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నా..ఆయన జోలికి మాత్రం రావడం లేదు. ఈవిషయంపై అటు అధికార పార్టీలోనూ, ఇటు ప్రతిపక్ష టిడిపిలోనూ చర్చించుకుంటున్నారు. 'పత్తిపాటి' తెలివైన నాయకుడని, ఆయన ఎవరిపై వ్యక్తిగతంగా దూషణలు చేయలేదని, విధానపరమైన విమర్శలు మాత్రమే చేశాడని, ఇదే ఆయనకు కలిసివస్తుందని కొందరు టిడిపి నాయకులు అంటున్నారు. మొత్తం మీద..'పత్తిపాటి' తెలివైనవారే...!

(468)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ