లేటెస్ట్

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..టిడిపికి 78సీట్లు...!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కాక మొదలైంది. అన్ని పార్టీలు వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. అధికార వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తాము ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని, గత ప్రభుత్వానికి, తమకూ తేడా చూడమని రోజూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30ఏళ్లు అధికారం తమదేనని వైకాపా అగ్రనాయకత్వం నేతలకూ, కార్యకర్తలకూ చెప్పుకుంటోంది. అయితే పరిస్థితి వారు అనుకున్నంత ఏమీ బాగా లేదు. వారి పరిస్థితిని కొన్ని సర్వే సంస్థలు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార వైకాపా ఓటమి చెందుతుందని, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా శ్రీఆత్మసాక్షి అనే సర్వే సంస్థ చేసిన సర్వే వారి పరిస్థితి ఏమిటో తెలియచేస్తోంది. శ్రీఆత్మసాక్షి సంస్థకు వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో సర్వే చేసిన అనుభవం ఉంది. వారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన సర్వే నూటికి నూరు శాతం నిజం అయింది. గుజరాత్‌, హిమాచలప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికలప్పుడు ఈ సంస్థ హిమాచలప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలుస్తుందని సర్వే ఇవ్వగా..అది వాస్తవం అయింది. అన్ని సర్వే సంస్థలు హిమాచలప్రదేశ్‌లో బిజెపి గెలుస్తుందని, భావించగా ఈ సంస్థ మాత్రం అక్కడ కాంగ్రెస్‌దే విజయమని చెప్పింది. వారు చెప్పినట్లే ఫలితాలు వచ్చాయి. తాజాగా ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో సర్వే నిర్వహించింది.

ఇప్పటికిప్పుడు అంటే ఫిబ్రవరి 2023లో కనుక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 78 సీట్లు వస్తాయని, అధికార వైకాపాకు 63 సీట్లు, సినీనటుడు ‘పవన్‌కళ్యాణ్‌’ పార్టీకి 7 సీట్లు వస్తాయని తేల్చింది. మరో 27 స్థానాల్లో హోరాహోరి పోటీ ఉంటుందని చెప్పింది. ఈ 27 సీట్లే అధికారం ఎవరదని నిర్ణయిస్తుందని, మెజార్టీ మార్క్‌ 88కి చేరాలంటే టిడిపికి ఈ 27సీట్లలో 10 సీట్లు కావాల్సి ఉంటుంది. అదే అధికార వైకాపాకు అయితే 27సీట్లలో 25 చోట్ల విజయం సాధించాలి. అయితే ఇది అంత సులభం కాదు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే..టిడిపి ఒంటరిగా పోటీ చేసినా ఆ పార్టీ సునాయాసంగా అధికారంలోకి వస్తుందని సర్వే చాటి చెబుతోంది. కాగా టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే ఆ కూటమికి 110 సీట్లు వస్తాయని, మరో 10 నుంచి 12 సీట్ల మధ్య హోరా హోరి పోరు ఉంటుందని తేల్చింది. ఒక వేళ కమ్యూనిస్టు పార్టీలు ఈ కూటమితో జతకడితే వారికి 116సీట్లు వస్తాయని, అధికార వైకాపా 60సీట్లకు పరిమితమవుతుందని సర్వే చెపుతోంది. టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే ఆ కూటమికి 57శాతం ఓట్లు వస్తాయి. గత ఎన్నికల్లో వైకాపాకు 51శాతం ఓట్లు వస్తేనే 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కనుక టిడిపి, జనసేనకు కలిపి 57శాతం ఓట్లు వస్తే..ఆ కూటమికి 160 నుంచి 170 సీట్లు వస్తాయని అంచనాలు ఉన్నాయి. మొత్తం మీద ఎన్నికలకు మరో 14మాసాలు సమయం ఉన్నప్పుడే అధికారపార్టీపై ఇంత వ్యతిరేకత ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యతిరేకత మరింత పెరిగేదే కానీ, తగ్గేదికాదు..దీంతో..వైకాపా పార్టీ ఘోరపరాజయం పాలవుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ