లేటెస్ట్

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు 'రేవంత్‌రెడ్డి'...!?

తెలంగాణ కాంగ్రెస్‌కు ఆ పార్టీ అధ్యక్షురాలు జవసత్వాలు కల్పించడానికి నిశ్చయించినట్లు తెలుస్తోంది. పార్టీలో చురుకుగా పనిచేసే వ్యక్తులను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై అలుపెరగని పోరాటం చేస్తోన్న 'రేవంత్‌రెడ్డి'ని టిపిసిసి ప్రెసిడెంగ్‌గా నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  రేవంత్‌ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు మంగళవారం (సెప్టెంబర్‌ 3) మధ్యాహ్నం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. రేవంత్‌ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారనే వార్తల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిసినట్టు రేవంత్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని పార్టీ వ్యవహారాలపై ఆమెతో చర్చించినట్టు వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారనే అంశంపై ఆయన స్పందించాల్సి ఉంది. సోషల్‌ విూడియాలో రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే పలువురు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగాలని తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీపీసీసీ అగ్ర నేతల తీరు వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌ ఘోర వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మరో అడుగు ముందుకేసి రాష్ట్ర పార్టీ అధిష్టానంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను పక్కనబెట్టి, అనుచరులకు, బంధవర్గాలకు టికెట్లు కేటాయించారని ఆరోపించారు. పార్టీ నాయకత్వాన్ని మార్చకపోతే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. టీపీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పనితీరుపై చాలా కాలంగా విమర్శలు వస్తు?న్నాయి. మరోవైపు.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎప్పటి నుంచో టీపీసీసీ పదవిపై కన్నేశారు. టీపీసీసీ బాధ్యతలు తమకు అప్పగిస్తే పార్టీని మరింత బలోపేతం చేస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి గతంలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అటు పలువురు సీనియర్‌ నేతలు కూడా ఈ పదవిపై కన్నేశారు. అయితే.. అగ్ర నేతలందరినీ వెనక్కినెట్టి టీపీసీసీ రేసులో రేవంత్‌ రెడ్డి అందరి కంటే ముందు వరసలో నిలవడం గమనార్హం.

(782)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ