WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా 'మంచులక్ష్మి' పోటీ...!

'మంచు మోహన్‌బాబు' ఫ్యామిలీ ఈ సారి జరగబోయే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఇద్దరిని బరిలో నిలపాలని గట్టిగా భావిస్తోందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 'మోహన్‌బాబు' వైకాపా తరుపున పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తుండగా...ఆయన కుమార్తె 'మంచు లక్ష్మి' తెలంగాణలో టిఆర్‌ఎస్‌ తరపున బరిలోకి దిగబోతున్నారట. గత కొంత కాలంగా...రాష్ట్ర రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తోన్న 'మోహన్‌బాబు'..తాజాగా పలువురు ఎమ్మెల్యేలు అవినీతిపరులను ధ్వజమెత్తుతున్నారు. అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, వారిని రాజకీయాల్లో లేకుండా చేయాలని ఆయన చెబుతున్నారు. అదే సమయంలో తాను మరో రెండు నెలల్లో కొన్ని సంచలన విషయాలు బయటపెడతానని అంటున్నారు. తాను రాజకీయాల గురించే సంచలన విషయాలు చెబుతానని, పరోక్షంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు.వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి బంధువు అయిన ఆయన గత ఎన్నికల సమయంలోనే వైకాపా తరుపున పోటీ చేస్తారని భావించినా..ఆఖరి నిమిషంలో ఎందుకో ఆగి పోయారు. అప్పట్లో తన మేనల్లుడికి సహాయం చేయడం తన బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. తరువాత ఏమి కారణాలు ఆయనను అడ్డుకున్నాయో..కానీ..మౌనంగా ఉండిపోయారు. తనకు 'జగన్‌', 'చంద్రబాబు'లిద్దరూ సన్నిహితులేనని ఆయన ఇటీవల దాకా..చెప్పేవారు. తాజాగా..ఆ వ్యాఖ్యలు చేయకుండా..పరోక్షంగా 'చంద్రబాబు'పై ధ్వజమెత్తుతున్నారు. 

  ఇది ఇలా ఉంటే...తెలంగాణలో తన కుమార్తె 'మంచులక్ష్మి'ని ఎన్నికల బరిలో దించాలని ఆయన భావిస్తున్నారట. రాజకీయాలపై తనకు ఆసక్తి ఉందని 'మంచు లక్ష్మి' చెబుతుండడం..తెలంగాణలో అధికారంలో ఉన్న 'కెసిఆర్‌' కుటుంబంతో ఆమె తరచూ సమావేశాలు జరుపుతుండడంతో..ఆమె టిఆర్‌ఎస్‌లో చేరుతుందని ఎక్కువమంది భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఆమె 'కెసిఆర్‌' కుమారుడు 'కెటిఆర్‌'తో మాట్లాడారని..త్వరలో ఆమె రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఆంధ్రా మూలాలు ఉన్న 'మంచులక్ష్మి' హైదరాబాద్‌లోని 'కూకట్‌పల్లి' నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో అక్కడ వీలు కాకపోతే 'శేరిలింగంపల్లి' నుంచైనా ఆమెను పోటీ చేయిస్తారట. ఆంధ్రా ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకదాని నుంచి ఆమె పోటీ చేస్తుందని టిఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రాకు చెందిన మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను కూకట్‌పల్లి నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 'టిఆర్‌ఎస్‌' 'మంచు లక్ష్మి'ని ఎంచుకుందని సమాచారం. ఏది ఏమైనా.. త్వరలో 'మంచు' కుటుంబం పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చి క్రియాశీలకంగా వ్యవహరిస్తారని వారి సన్నిహితులుచెబుతున్నారు. చూద్దాం..మరి ఏమి జరుగుతుందో..!?


(472)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ