‘రావి’ వర్గంలో ‘జోష్’...!
2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా సంకేతాలు
- ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజలకు అభ్యర్ధన
- చంద్రబాబు ఆదేశాలతో దూకుడు పెంచిన రావి
- "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” అపూర్వ స్పందన
- బ్రహ్మరథం పడుతున్న నియోజకవర్గ ప్రజలు
గుడివాడ, ఫిబ్రవరి 17: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును కలిసిన తర్వాత కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వర్గంలో జోష్ కన్పిస్తోంది. గుడివాడపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇక్కడ నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను స్వయంగా వివరించేందుకు రావి కలవడం జరిగింది. గుడివాడ పట్టణంలోని నాగవరప్పాడు కాల్వగట్టుపై నిరుపేద కుటుంబాలకు అండగా నిలబడ్డామని, అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగిందని చంద్రబాబుకు రావి వివరించారు. చంద్రబాబు తెప్పించుకున్న నివేదిక ప్రకారం రావి గ్రాఫ్ పెరగడంపై సంతృప్తి చెందినట్టుగా సమాచారం. గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న రావి పనితీరుకు చంద్రబాబు మంచి మార్కులే వేశారంటున్నారు. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలో రావి దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబును కలిసిన అనంతరం బయటకు వచ్చిన రావి మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో గుడివాడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు సంకేతాలు ఇచ్చేశారు. గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానిని ఖచ్చితంగా ఓడిస్తానని స్పష్టం చేశారు. ఆ తర్వాత నుండి గుడివాడ నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ శ్రేణులతో కలిసి రోజుకు ఐదారు గంటల పాటు ప్రజలతో రావి మమేకమవుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబును కలిసిన తర్వాత రావి నాయకత్వంలో టీడీపీ శ్రేణులు దూకుడు పెంచినట్టుగా కన్పిస్తోంది. 2024 ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తూ వస్తున్నారు. ఒకవైపు గుడివాడ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తుండగా, మరోవైపు ప్రజలు కూడా అడుగడుగునా రావికి బ్రహ్మరథం పడుతూ వస్తున్నారు. ఇంకోవైపు తనకు ఒక్క అవకాశమిస్తే గుడివాడ నియోజకవర్గంలో రౌడీయిజం, గూండాయిజాన్ని అంతమొందిస్తానని ప్రజలకు రావి హామీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు అక్రమాలు, అవినీతి, అరాచకాలకు పాల్పడిన వారి ఆట కట్టిస్తానని కూడా చెబుతున్నారు. 2000వ సంవత్సరం నుండి 2004 వరకు గుడివాడ ఎమ్మెల్యేగా పనిచేసిన రావి తన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించడం జరుగుతోంది. గుడివాడ నియోజకవర్గంలో రావి కుటుంబానికి ఉన్న ఆదరణను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు రావి పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. చంద్రబాబును కలిసిన అనంతరం గుడివాడ పట్టణంలోని పలు వార్డులు, నందివాడ మండలంలోని పలు గ్రామాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రావికి ప్రజలు పెద్దఎత్తున బ్రహ్మరథం పడుతూ వచ్చారు. మహిళలు హారతులతో ఘనస్వాగతం పలుకుతూ రావిపై పూలవర్షం కురిపించారు. ప్రజల నుండి వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకుని వచ్చే 15రోజుల్లో గుడివాడ నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఆదేశించినట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలతో రావి మరింతగా ప్రజలకు దగ్గరయ్యే పనిలో నిమగ్నమైనట్టుగా ప్రచారం జరుగుతోంది.