WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాబు' దూకుడు..మంత్రుల స్లో....!

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తుంటే..కొందరు మంత్రులు మాత్రం ఆ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేదని గత కొంత కాలంగా సిఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాము మిత్రధర్మం పాటిస్తున్నామని...కానీ..బిజెపి పెద్దలు అది గుర్తించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగేళ్ల కాలంలో అన్ని రకాలైన ఒత్తిడి తెచ్చినా...వారు స్పందించడం లేదని..ఇక వారితో..అమీతుమీకి సిద్ధమని ఆయన ఇటీవల కాలంలో తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో ఎన్‌డిఎ నుంచి వైదొలుగుతామని ప్రకటిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రులతో రాజీనామా చేయిస్తానని...తరువాత ఎంపీలతో కూడా రాజీనామా చేయిస్తానని ఆయన పరోక్షంగా చెబుతున్నారు. అవసరమైతే ఇప్పటికిప్పుడు ఎన్‌డిఎ నుంచి వైదొలగాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వారికి కావల్సినంత సమయం ఇచ్చాం..ఎన్నోసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగాం..అయినా వారిలో స్పందన లేదు..ఇక వారితో చర్చలు కూడా అనవసరం..తాడో..పేడో తేల్చుకుందామని ఆయన సమన్వయ కమిటీ సమావేశాల్లో చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఈ విధంగా స్పందిస్తుంటే కొందరు మంత్రులు మాత్రం ఆచితూచి అడుగేద్దామని ఆయనను వారిస్తున్నారట. 

  ఇప్పటికిప్పుడే తెగతెంపులు చేసుకుంటే..ప్రస్తుతం రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా పోతాయని, బడ్జెట్‌ సమావేశాలు అయ్యే వరకు వేచి చూద్దామని సలహా ఇస్తున్నారట. ఈలోపు రాష్ట్ర బడ్జెట్‌ కూడా పూర్తి అవుతుందని..తరువాత నిర్ణయం తీసుకోవచ్చని సలహా ఇస్తున్నారట. దీనిపై సిఎం కొంత సానుకూలంగా ఉన్నా...వారు చేసిన ద్రోహంపై మండిపడుతున్నారట. కాగా...ఆలస్యం చేస్తే రాజకీయంగా నష్టపోతామని మరి కొందరు మంత్రులు చెబుతున్నారట. వారితో ఇంకా కలసి ఉంటే వారు చేసిన ద్రోహానికి ప్రజలు మనలను శిక్షిస్తారని వారు అంటున్నారట. వారితో తెగతెంపులు చేసుకుని..రాజకీయంగా లాభపడదామని వారు సూచిస్తున్నారట. అయితే..కొందరు మంత్రులు మాత్రం ఈ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదట. వాళ్ల వ్యాపారాలు, పదవులు, సంపాదనపైనే దృష్టి పెట్టారనే మాట వినిపిస్తోంది. కేంద్రం చేసిన ద్రోహంపై నామ మాత్రమైన ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. మా కెందుకులే..వాళ్లు చూసుకుంటారనే భావనతో..పలువురు మంత్రులు నోరు కూడా విప్పడం లేదు.

గంటా,ఆది దూకుడు...!

కేంద్రం చేసిన ద్రోహంపై మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డిలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బిజెపి నాయకులు చేస్తోన్న విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ..వారి చేసిన ద్రోహంపై నిలదీస్తున్నారు. అదే సమయంలో బిజెపి ఇచ్చిన నిధుల గురించి వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నారు. బిజెపితో కలసి సాగడం అయ్యే పనికాదని వారు స్పష్టం చేస్తున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి అయితే 5వ తేదీ లోపు మంత్రులు రాజీనామా చేస్తారని ప్రకటించి సంచలనం సృష్టించారు. 'జగన్‌' కన్నా టిడిపినే ముందుగా రాజీనామాలు చేస్తుందని ఆయన ప్రకటించి.. తరువాత..అది తన వ్యక్తిగత అభిప్రాయమని ప్రకటించారు. మొత్తం మీద ఈ ఇద్దరు మంత్రులకు తోడు మరో ఇద్దరు ముగ్గురు మంత్రులు మాత్రమే బిజెపిపై దూకుడుగా వెళుతుండగా..మిగతా వారు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పార్టీలో నెలకొని ఉంది.


(900)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ