WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సదా మీసేవలో' కృష్ణా జిల్లా కలెక్టర్‌...!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశించిన రీతిలో పాలనలో వినూత్నంగా ముందుకెళుతూ అందరి ప్రశంసలు పొందుతున్న కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఇప్పుడు మరో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ప్రజలు తమ ముందుకు తీసుకువచ్చే సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించి..అర్జీ పెట్టుకున్న వారికి తాము పరిష్కరించిన విషయాలను ఒక లెటర్‌ ద్వారా తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమానికి 'సదా మీసేవలో' అనే పేరు పెట్టారు. దీని ద్వారా ఒకే సమస్యపై పదే పదే వచ్చేవారు సంఖ్య తగ్గుతుందని..ఆ సమయంలో వేరే వ్యక్తుల సమస్యను తీర్చడానికి జిల్లా యంత్రాంగానికి వీలవుతుందని కలెక్టర్‌ భావిస్తున్నారు. ఫలానా తేదీన..మీరు ఫలానా సమస్యను మా దృష్టికి తెచ్చారు..ఆ సమస్యను మేము ఫలానా తేదీ నాడు పరిష్కరించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని తెలుపుతూ ఆర్జీదారునికి స్వయంగా మండల తహశీల్దారు లెటర్‌ రాస్తారు. 

  వినియోగదారుడే మన కార్యాలయానికి ముఖ్య అతిథి' అన్న మహాత్మాగాంధీ సూక్తులను ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. పౌరసరఫరాల సమస్యలను, విజ్ఞాపనలను సంయుక్త కలెక్టర్‌, డీఆర్‌ఒ, డీఎస్‌ఒకు అప్పగించనున్నారు. వీరు మండల స్థాయి అధికారులతో మాట్లాడి వారిని పరిష్కరిస్తారు. ఫించన్ల సమస్యలను డీఆర్‌డీఎ పథక సంచాలకునికి, నేరుగా ఫిర్యాదులను డ్వామా పీడీ, పంచాయితీల సమస్యలను డీపీఓకు, తాగునీటి సమస్యను ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈకు, విద్యుత్తు సమస్యలను ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ పరిష్కరిస్తారు. ప్రతి మంగళవారం వీరు ఈ సమస్యలను పరిష్కరించి ఆర్జీదారులకు పరిష్కారపత్రాన్ని పోస్టు ద్వారా పంపించనున్నారు. ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించి..అదే రోజు ఆర్జీదారులకు లెటర్‌ పంపనున్నారు. కాగా ఇప్పటికే..అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో నడిపిస్తున్న కలెక్టర్‌ లక్ష్మీకాంతం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 'సదా మీ సేవ'లో విజయవంతం అవుతుందని, ఆయన ఇప్పటి వరకు చేపట్టిన అనేక కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని..ఇది కూడా అదే దారిలో సంపూర్ణంగా విజయం సాధిస్తుందని జిల్లా అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు.

(421)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ