లేటెస్ట్

మార్కులు ఉంటేనే.....అక్రిడిటేష‌న్లు...!?

చ‌ద‌వేస్తే...ఉన్న‌మ‌తి పోయిన‌ట్లు ఉంది I&PR అధికారుల వ్య‌వ‌హార‌శైలి. గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో అడ్డ‌గోలు నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డంతో శాఖ బ్ర‌ష్టుప‌ట్టిపోయింది. అప్ప‌ట్లో జ‌గ‌న్ తాబేదారు విజ‌య్‌కుమార్‌రెడ్డి ఇష్టారాజ్యంగా శాఖ న‌డ‌వ‌డంతో...జ‌ర్న‌లిస్టుల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింది. చివ‌ర‌కు జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చే అక్రిడిటేష‌న్ల‌లో భారీగా అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. ప‌నిచేసే జ‌ర్న‌లిస్టుల‌కు అక్రిడిటేషన్లు ఇవ్వ‌కుండా వైకాపా...సోష‌ల్‌మీడియా టీమ్‌ల‌కు, సోష‌ల్ మీడియాలో బూతుపోస్టులు పెట్టే సైకోలకు అక్రిడిటేష‌న్లు ఇచ్చుకున్నారు. ఇప్పుడు శాఖ మ‌ళ్లీ అదే తీరులో న‌డుస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత జ‌ర్న‌లిస్టుల క‌ష్టాలు తీరతాయ‌ని భావిస్తే..వీళ్లు వాళ్ల‌ను మించిపోయే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారే భావ‌న జ‌ర్న‌లిస్టు వ‌ర్గాల్లో ఏర్ప‌డుతోంది.


అడ్డ‌గోలు రూల్స్‌

ముఖ్యంగా జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చే అక్రిడిటేష‌న్ల విష‌యంలో అడ్డ‌మైన రూల్స్ పెడుతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అక్రిడిటేష‌న్ల మంజూరు కోసం ప్ర‌భుత్వం నియ‌మించే క‌మిటీల విష‌యంలో పాత ప్ర‌భుత్వ విధానాన్నే వీరు అనుసరించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్రిడిటేష‌న్ల మంజూరు కావాలంటే..ఆయా ప‌త్రిక‌ల‌కు మార్కులు వేస్తార‌ట‌. ఆ మార్కులు ఆధారంగా ఏయే ప‌త్రిక‌కు ఎన్ని అక్రిడిటేష‌న్లు ఇవ్వాలో నిర్ణ‌యిస్తార‌ట‌. పెద్ద ప‌త్రిక‌లు, మీడియం ప‌త్రిక‌ల‌తో పాటు..చిన్న ప‌త్రిక‌ల‌న్నింటినీ త‌నిఖీచేసిన త‌రువాతే అక్రిడిటేష‌న్లు మంజూరు చేయ‌బోతున్నారు. ఆయా ప‌త్రిక‌ల‌కు ఉన్న వ‌న‌రుల‌ను బ‌ట్టి వీటిని మంజూరు చేస్తారు. ఆయా ప‌త్రిక‌ల స‌ర్క్యులేష‌న్‌తో పాటు, ప‌త్రికా సంపాద‌కుడు వ్య‌క్తిత్వం, స్థాయి, అనుభ‌వం, ప‌త్రిక సీనియార్టీ, ప్రింటింగ్ సామ‌ర్థ్యం, ప‌త్రికా కార్యాల‌యం, సిబ్బంది, పేజీలు, ప‌త్రికా కంటెంట్‌, న్యూస్ సోర్స్‌, అద‌న‌పు ఎడిష‌న్లు ఇలా ప‌లు విష‌యాల‌ను ప‌రిశీలించి 100మార్కుల‌కు వ‌చ్చిన మార్కుల‌ను బ‌ట్టి వాటిని గ్రేడ్‌లుగా విభ‌జిస్తారు. గ్రేడ్‌లను బ‌ట్టి అక్రిడిటేష‌న్లు  మంజూరు చేస్తార‌ని చెబుతున్నారు. ఇది ప‌త్రిక‌ల‌కే కాదు ఎల‌క్ట్రానిక్‌మీడియా కూడా ఇదే విధానాన్ని అనుస‌రిస్తారు. కొంత మంది ప‌త్రికా సంపాద‌కుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయ్యాయి. అవి రాజ‌కీయ క‌క్ష‌తో పెట్టిన కేసుల‌తై..ఆయా ప‌త్రిక‌ల‌కు అక్రిడిటేష‌న్లు నిరాక‌రిస్తారా..?  ఎవ‌రు ఒక సంపాద‌కుడి వ్య‌క్తిత్వాన్ని, స్థాయిని నిర్ణ‌యించేది..?  దీనిపై ఏమైనా..క‌మిటీ వేస్తారా..?  రాష్ట్రంలో చాలా ప‌త్రిక‌లు పార్టీలు వారీగా విడిపోయి ఉన్నాయి...? ఆయా రాజ‌కీయ‌పార్టీల‌కు క‌ర‌ప‌త్రంలా మారిపోయాయి...? ఇటువంటి ప‌రిస్థితుల్లో ఆయా సంపాద‌కుల వ్య‌క్తిత్వాన్ని నిర్ణ‌యించేది ఎవ‌రు..? 


మార్కులు ఎలా...?

ప్ర‌భుత్వం చెబుతోన్న‌దాని ప్ర‌కారం ఆయా ప‌త్రిక‌ల‌కు, ఎల‌క్ట్రానిక్ మీడియా, న్యూస్ ఏజెన్సీలకు, వీడియో ఏజెన్సీల‌కు మార్కులు ఎవ‌రు ఇస్తారు..? ఏదైనా క‌మిటీ వేసి వారితో విచార‌ణ జ‌రిపిస్తారా..?  లేక ఆయా ప‌త్రికా యాజ‌మాన్యాలు చెప్పిందానిని బ‌ట్టి వీరు మార్కులు వేసుకుంటారా..?  లేక ఇంకేదైనా విధానాన్ని పాటిస్తారా..? ఇవ‌న్నీ ఎప్పుడు చేయాలి..? ఎప్పుడు అక్రిటిడేష‌న్లు మంజూరు చేయాలి. స‌మాచార‌శాఖ మంత్రి మాత్రం నూత‌న సంవ‌త్స‌రంలోనే అక్రిడిటేష‌న్లు ఇస్తామ‌ని చెబుతున్నారు. కానీ..ఇప్పుడు మార్కుల సిస్ట‌మ్ తెస్తే..త‌నిఖీలు చేసి, వాటి రిపోర్ట్స్ వ‌చ్చేస‌రికి పుణ్య‌కాలం ముగిసిపోతుంది. అప్పుడెప్పుడో ఉమ్మ‌డి రాష్ట్రంలో తెచ్చిన మార్కుల విధానాన్ని ఎవ‌రు మ‌ళ్లీ తేవాల‌ని భావిస్తున్నారు..?  త‌నిఖీలు అంటే స‌హ‌జంగానే జ‌ర్న‌లిస్టు వ‌ర్గాల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌స్తుంది. ఇది కావాల‌నే కొంద‌రు అధికారులు చేస్తోన్న కుట్రా..?  లేక య‌ధాలాపంగా గ‌త విధానాన్ని తేవాల‌ని భావిస్తున్నారా..? అసలు ఈ విధానం గురించి స‌మాచార‌శాఖ డైరెక్ట‌ర్ హిమాన్ష్‌శుక్లాకు తెలుసా..?  ఈ విధానం వల్ల ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌నే విష‌యం ఆయ‌న‌కు అర్థం అవుతుందా..?  మంత్రి పార్థ‌సార‌ధికి దీనిపై అవ‌గాహ‌న ఉందా..?  జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కొంద‌రు అధికారులు చేసిన అతివ‌ల్లే జ‌ర్న‌లిస్టు వ‌ర్గాల‌న్నీ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మారి..ఆయ‌న దిగిపోయే వ‌ర‌కూ..వెంటాడాయి. ఇప్పుడూ అదే ప‌రిస్థితి తెచ్చుకుంటారా..?


క‌మిటీల్లో ఇంత మందా...?

నూత‌న అక్రిడిటేష‌న్ క‌మిటీల ఏర్పాటు కోసం ఇటీవ‌ల మంత్రి, స‌మాచార‌శాఖ డైరెక్ట‌ర్ హిమాన్ష్‌శుక్లా ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఈ మార్కుల విధానం గురించి ఎందుకు ప్ర‌స్తావించ‌లేదు. అదే విధంగా క‌మిటీల్లో స‌భ్యుల పెంపుద‌ల‌పై కూడా చ‌ర్చించ‌లేదు. ఒక్క‌సారిగా స‌భ్యుల‌ను పెంచ‌డం ఏమిటి..?  వాస్త‌వానికి పెద్ద ప‌త్రిక‌ల‌కు సంబంధించి న‌లుగురిని క‌మిటీల్లో ప‌త్రినిధులుగా తీసుకుంటున్నారు. అలా చేయ‌డం మంచిదే. దాదాపు కొన్ని వేల మంది జ‌ర్న‌లిస్టులు ఆయా ప‌త్రిక‌ల్లో ప‌నిచేస్తుంటారు క‌నుక‌..అంత మందిని తీసుకోవ‌డం స‌బ‌బే. కానీ మీడియం, స్మాల్ విభాగంలో ఇద్ద‌రిని నియ‌మించబోతున్నారు. దాదాపు 100 ప‌త్రిక‌లు మాత్ర‌మే ఈ విభాగంలో ఉంటాయి. మ‌రి అప్పుడు ఇద్ద‌రిని ఈ కేట‌గిరిలో ఎందుకు నియ‌మించ‌బోతున్నారు. గ‌తంలో ఉన్న విధానాన్ని కొన‌సాగించాల్సింది. మంత్రి ఒత్తిడితోనే..మ‌రో స‌భ్యుడిని నియ‌మించ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దాదాపు వంద‌ఛానెల్స్ ఉన్న ఎల‌క్ట్రానిక్ మీడియా కోసం కేవ‌లం ఒక్క‌రిని మాత్ర‌మే క‌మిటీలో స‌భ్యులుగా నియ‌మించ‌బోతున్నారు. వంద ఛానెల్స్‌కు ఒక‌రు ఉంటే..వంద చిన్న‌ప‌త్రిక‌ల‌కు ఇద్ద‌రా..? అదే విధంగా రైల్వే ప్ర‌తినిధిని అక్రిడిటేష‌న్ క‌మిటీలో నియ‌మిస్తున్నారు. రైల్వేశాఖ పాత్రికేయుల‌కు పాస్‌లు నిరాక‌రించి దాదాపు నాలుగేళ్లు కావ‌స్తుంది. ఇక మీద‌ట జ‌ర్న‌లిస్టుల‌కు రైల్వేపాస్‌లు ఇవ్వ‌మ‌ని రైల్వే మంత్రి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. మ‌రి అలాంట‌ప్పుడు రైల్వే త‌రుపున క‌మిటీలో ప్రాతినిధ్యం ఎందుకు..?  అడ్డ‌గోలు, అసంబ‌ద్ధ నిర్ణ‌యాలు తీసుకుని..ఎందుకు అన‌వ‌స‌ర ర‌భ‌స సృష్టిస్తున్నారో..అర్థం కావ‌డం లేదు.  మొత్తం మీద‌..జ‌ర్న‌లిస్టుల అక్రిడిటేష‌న్ల వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వం కందిరీగ తుట్టెను క‌దిలించ‌బోతున్న‌ట్లుంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ