WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపిలోకి మాజీ ఎమ్మెల్యే 'ఎర్రం వెంకటేశ్వరరెడ్డి'

గుంటూరు జిల్లా సత్తెనపల్లి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు టిడిపి అభివృద్ధి నినాదంతో..దూసుకుపోతుంటే..మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా అంతర్గత సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన ఆ పార్టీ సీనియర్‌ నేత 'అంబటిరాంబాబు' నియోజకవర్గంలో పట్టుసాధించలేకపోయారని సాక్షాత్తూ వై.ఎస్‌.జగనే చెబుతున్నారట. రాబోయే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్‌ ఇచ్చేది లేదని..'జగన్‌' తేల్చారని..ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో స్వల్పతేడాతో ఓడిపోయిన 'అంబటి' సీనియర్‌ టిడిపి నాయకుడు, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును తట్టుకోలేకపోతున్నారు. 'కోడెల' అనుభవం ముందు...ఆయన అభివృద్ధి కార్యక్రమాల ముందు..'అంబటి' ఎందుకూ పనికి రాకుండా పోతున్నారనే మాట స్వంతపార్టీ నాయకుల నుంచే వస్తోంది. మళ్లీ 'అంబటి'కే టిక్కెట్‌ ఇస్తే...ఇక్కడ టిడిపి ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా సులువుగా గెలుస్తుందనే మాట నియోజకవర్గ ప్రజల నుంచి వినిపిస్తోంది.

    తాజాగా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తన స్వంత నియోజకవర్గమైన 'నర్సరావుపేట'కు వెళతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టిడిపి తరుపు నుంచి ఎవరినీ ఇక్కడ పోటీ చేయిస్తారనే చర్చ ఆ పార్టీ వర్గాలతో పాటు వైకాపాలోనూ జరుగుతోంది. 'కోడెల' నర్సరావుపేట వెళితే...ఆయన కుమార్తె 'విజయలక్ష్మి' ఇక్కడ నుంచి పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. తండ్రి వలే ఆమె ప్రజల్లోకి దూసుకుపోతుందనే అభిప్రాయం పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వస్తోంది. అయితే...ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకే ఇంటిలో రెండు టిక్కెట్లు ఇస్తారా..? అని టిడిపి వర్గాలు ప్రశ్నించుకుంటున్నాయి. అయితే 'కోడెల' కోరితే...రెండు సీట్లు ఇస్తారని ఆయన వర్గీయులు అంటున్నారు. ఇది ఇలా ఉంటే..మరో ఆసక్తికరమైన పరిణామం..నియోజకవర్గంలో జరుగుతోంది. 

   కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే 'ఎర్రం వెంకటేశ్వరరెడ్డి' టిడిపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఆయన గతంలో ఈ నియోజకవర్గం నుంచి 2004,2009లో గెలుపొందారు. ఎమ్మెల్యేగా 'వెంకటేశ్వర్‌రెడ్డి' నియోజకవర్గంలో బాగానే పట్టుసాధించారు. అయితే...రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ మట్టికొట్టుకుపోయిన నేపథ్యంలో..ఆయన చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలో...ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండాలని నిర్ణయించుకున్నారట. మొన్నటి వరకు ఆయన వైకాపాలో చేరతారని..ఆ పార్టీ సానుభూతిపరులు, కొందరు కార్యకర్తలు ఆశించినా..ఆయన ఆ పార్టీలోకి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. టిడిపి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తే...ఆ పార్టీ తరుపున పోటీ చేయాలని ఉత్సాహపడుతున్నారట. మరి 'కోడెల' దీనికి అంగీకరిస్తే...'వెంకటేశ్వరరెడ్డి' టిడిపిలో చేరడం ఖాయమే. 

  ఇంజనీర్‌గా మంచిపేరు ప్రతిష్టలు సంపాదించిన 'వెంకటేశ్వర్‌రెడ్డి' దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2004లో ముఖ్యమంత్రిగా రాజశేఖర్‌రెడ్డి పనిచేస్తోన్న సమయంలో ఆయన ప్రభుత్వం చేపట్టిన 'జలయజ్ఞం' కార్యక్రమంలో అవినీతి జరిగిందని..టిడిపికి చెందిన జలవనరుల శాఖలో ఇంజనీర్‌గా పనిచేసిన స్వర్గీయ ఎమ్మెల్యే మారుతీ విరుచుకుపడుతుంటే...కాంగ్రెస్‌ వైపు నుంచి సమాధానం చెప్పేవారే కరువయ్యారు. అటువంటి పరిస్థితుల్లో ఇంజనీర్‌ అయిన 'వెంకటేశ్వర్‌రెడ్డి' కాంగ్రెస్‌పై జరుగుతున్న దాడిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు. అప్పటి నుంచి వై.ఎస్‌కు సన్నిహితుడిగా 'వెంకటేశ్వర్‌రెడ్డి' పేరు తెచ్చుకున్నారు. అయితే..వై.ఎస్‌.మరణం తరువాత..ఆయన రాజకీయంగా క్రియాశీలరహితంగా మారిపోయారు. వై.ఎస్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన 'జగన్‌' పార్టీలో చేరతారని ప్రచారం జరిగినా...చివరకు టిడిపి వైపు చూస్తుండడం ఆసక్తి కల్గించే అంశమే. ఏది ఏమైనా 'నియోజకవర్గం'లో పట్టున్న 'వెంకటేశ్వర్‌రెడ్డి' టిడిపిలో చేరితే..పార్టీ మరింత బలం పుంజుకుంటుందనే మాట వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో..చూద్దాం.


(1509)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ