లేటెస్ట్

‘టిడిపి’ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి...!?

అధికార వైకాపాపై, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా..అధికారం తమదేనని కొంత మంది టిడిపి నేతలు పగటి కలలు కంటున్నారు. గత నాలుగేళ్ల ‘జగన్‌’ పాలనలో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, అణిచివేతకు గురవుతున్నారని, వ్యవస్థలు నాశనం అయ్యాయని, ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదనే భావనతో ప్రజలు ఉన్నారని, ‘జగన్‌’పై నెలకొన్న వ్యతిరేకత తమకు అధికారాన్ని తెచ్చిపెడుతుందనే భావన వారిలో ఉంది. ఇది కొంత వరకూ నిజమే. ప్రజలు తీవ్ర ఇక్కట్లు, హింసకు, అణిచివేతకు గురవుతున్నారన్న మాట యధార్ధమే. అయితే దీనితోనే అధికారంలోకి వస్తారనుకుంటే..అది భ్రమనే. గత కొన్నేళ్లుగా ‘ఆంధ్రా’ సమాజం కుల,మత,ప్రాంతీయ తత్వాలతో కునారిల్లుతోంది. ఓటర్లు చైతన్యవంతంగా ఆలోచించడానికే నిరాకరిస్తున్నారు. తమ మతం వాడు, తమ కులం వాడు అధికారంలో ఉంటే చాలన్నట్లు..భావిస్తున్నారు. తాము..ఎంత నష్టపోతున్నా, తమ పిల్లలు నష్టపోతున్నా..వీరు కులాలకు, మతాలకు, వర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న భావనలను తుంచివేయడానికి, వారిని చైతన్యం చేయడంలో ‘టిడిపి’ ఘోరంగా విఫలమైంది. ప్రధాన ప్రతిపక్షంగా..ఆ పార్టీ ప్రజాఉద్యమాలను నిర్మించడంలోకానీ, ప్రజలను చైతన్యవంతులను చేయడంలో కాని నిరాసక్తిని కనబరుస్తోంది. నాలుగేళ్ల క్రితం ఓటమికి గురైనా..ప్రజలు తమను ఎందుకు నిరాకరించారో...అనే దానిపై మన్ససాక్షిగా విశ్లేషణ చేసుకోవడానికి టిడిపి నేతలు నిరాకరిస్తున్నారు. తప్పంతా ప్రజలదేనని, ‘జగన్‌’ చెప్పిన మాయమాటలను వారు విన్నారని, అందుకే తాము ఓడిపోయామనే వితండవాదం వారు చేస్తున్నారు. 

అధికారంలో ఉన్నప్పుడు..తమంతటి వీరాధివీరులు లేరని మంత్రులు, ఎమ్మెల్యేలు..ఎంపీలు వీరంగాలు వేశారు. అయితే  అధికారాంతాన..వీరు కనీసం వీధి నాయకుల పాటి పోరాటం చేయడంలో విఫలమయ్యారు. ఐదేళ్లు మంత్రులుగా చేసిన వారు...అంతులేని సంపద పోగేసుకుని కూడా ఎవరికి వారు..ఇళ్లలో..కూర్చుని..చంద్రబాబును హేళన చేయడానికి, దూషించడానికి, జగన్‌తో పోల్చి తమ నేత అలా చేయలేదని, ఇలా చేయలేదని విమర్శలు చేయడానికే పరిమితమయ్యారు. తమ అధినేతను దూషించినా, ఆయన కుటుంబంపై నీచ విమర్శలు చేసినా, తమ పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేసినా, అధినేతపై దాడులు చేస్తున్నా..ఈ నేతలకు చీమ కుట్టినట్లైనా లేదు. అధికారం ఉన్నప్పుడు విర్రవీగిన వీరు..ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తామనే భరోసా కనిపించడంతో..ఇప్పడిప్పుడే కలుగులోంచి బయటకు వస్తున్నారు. ఇన్నాళ్లు హైదరాబాద్‌, బెంగుళూరు, అమెరికా, ఇతర దేశాల్లో ఉన్న వీరు..ఇప్పుడు తమకే టిక్కెట్లు ఇవ్వాలని వేరే వారికి ఇస్తే ఓడిస్తామని బీరాలు పలుకుతున్నారు. అధినేత ఆయన కుమారుడు ‘లోకేష్‌’ అధికారపార్టీ అరాచకాలకు వెన్నుచూపకుండా పోరాడుతుంటే..ఎక్కడో దాగి ఈ వీరులంతా ఇప్పుడు బయటకు వచ్చి..తామే ‘టిడిపి’ని ఉద్దరిస్తామని, తమ వల్లే పార్టీ పుంజుకుంటోందని ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలమానికి కూడా ఇటువంటి వారంతా క్యూ కడుతున్నారు. ఇప్పటికైనా వీరంతా కలుగుల్లోంచి బయటకు వచ్చినందుకు సంతోషమే. అయితే...ఇప్పటికైనా వీరు క్షేత్రస్థాయిలో పోరాడకుండా..అధికారపార్టీపై ఉన్న వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని, టిక్కెట్లు తెచ్చుకుంటే చాలనే విధంగా వ్యవహరిస్తుండడమే సమస్యకు కారణం. ఒకవైపు..ఎన్ని అరాచకాలు చేసైనా..ఏదో విధంగా మరోసారి అధికారంలోకి రావాలని అధికారపార్టీ ప్రయత్నిస్తుంటే..దాన్ని ఎలా ఎదుర్కోవాలో అనేది పక్కనబెట్టి..టిక్కెట్లు కోసం, నియోజకవర్గంలో పెత్తనం కోసం టిడిపి నేతలు కొట్లాడడం..ఆ పార్టీ బలహీనతలను మరోసారి బయటపెడుతోంది. చావోరేవో తేల్చుకోవాల్సిన యుద్ధంలో..ఇటువంటి కలుగులోని నేతలను అధినేత పక్కనపెట్టడమే ఉత్తమం. జరిగిందేదో..జరిగిపోయింది..ఇకనైనా టిడిపి నేతలు ఆత్మపరిశీలన చేసుకుని..అసలైన పోరుకు సిద్ధం అవుతారని ఆశిద్దాం. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ