డేంజర్‌లో 23 మంది టిడిపి ఎమ్మెల్యేలు...!?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడిచిపోయింది. వారి హానీమూన్ పిరియడ్ కూడా ముగిసేసింది. ఇక ఎన్నికల హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేయాల్సి ఉంది. అయితే..బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందా..అంటే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతానికంటే మెరుగ్గా పనిచేస్తారని ఆశించగా ఆయన గతమే మేలనట్లు పరిపాలన చేస్తున్నారు. అధికారం చేతికి చిక్కి ఆరు నెలలు గడిచినా..ఆయనకు ఇంకా ప్రభుత్వంపై పట్టు రాలేదు. అధికార వర్గాలు కూటమి నేతల ఆదేశాలను అసలు పట్టించుకోవడం లేదు. వారు ఇంకా ‘జగనే’ సిఎం అన్నట్లు వ్యవరిస్తున్నారు. ‘జగన్’ అండ చూసుకుని చెలరేగిపోయి అవినీతికి, అక్రమాలకు, అరాచకాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు లేకపోవడంతో..వారు ఆడిరదే ఆటరా..? పాడిరదే పాటరా..? అన్నట్లు కూటమి పాలనలోనూ...పెత్తనం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే...కూటమి ఎమ్మెల్యేల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు..ఆస్తులు సంపాదించడానికో..పెత్తనం చేయడానికో వెంపర్లాడుతున్నారు. దొరికినంత తినేద్దామనే భావనతో కొందరు ఎమ్మెల్యేలు..అదీ..ఇదీ అని చూడకుండా అన్నింటిలో వేలు పెట్టేస్తున్నారు. దీంతో వీరిపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇసుక అక్రమరవాణా, మద్యం, గ్రానైట్, ఇతర వ్యవహారాల్లో అవినీతికి పాల్పడుతున్నారు. వీరి వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక బృందాలతో ఆరా తీస్తున్నారు. ఆయనకు వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు 23 మంది టిడిపి ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతున్నారనే రిపోర్టు వచ్చింది. ఈ ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఒక ప్రవేట్ సంస్థ నివేదిక ఇచ్చింది. దీనిలో 23 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, వారిని సరిదిద్దాలని సదరు నివేదిక చెబుతోంది. దీంతో ఆరోపణలు, విమర్శలు వచ్చిన ఎమ్మెల్యేలను ‘చంద్రబాబు’ పిలిపించుకుని తీరు మార్చుకోవాలని హెచ్చరించబోతున్నారు. తాను అవసరమైతే కొంత మంది ఎమ్మెల్యేలను వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, ఎమ్మెల్యేలు తీరుమార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని కూడా ముఖ్యమంత్రి చెబుతున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రవేట్ సంస్థ ఇచ్చిన నివేదిక గురించి తెలిసిన ఎమ్యెల్యేలు తీనిపై ఆరా తీసున్నారు. తమ పేరు ఈ 23 మందిలో ఉందో లేదో తెలుసుకోవడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద..టిడిపి అధినేత చంద్రబాబు వీరిపై కఠిన చర్యలు తీసుకుంటారని, కొందరిపై చర్యలు ఉంటేనే మిగతావారు దారిలోకి వస్తారని, టిడిపిసీనియర్ నేతలు చెబుతున్నారు.