WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జిఎడి 'రారాజు' 'రామరాజు'...!

సచివాలయంలో జిఎడిశాఖలో క్రింది స్థాయి అధికారి హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక అధికారి అంతా తానై అధికారం చెలాయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకశాఖలో ఆరేళ్లకు మించి పనిచేయకూడదని నియమనిబంధనలు ఉన్నప్పటికి..ఈ వ్యక్తి..మాత్రం గత ఇరవై సంవత్సరాల నుంచి అదే హోదాలో పనిచేస్తున్నారు. ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారు పేరు 'రామరాజు'. జాయింట్‌ కార్యదర్శి హోదాలో ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐఎఎస్‌ అధికారులకు సంబంధించిన పోస్టింగ్‌లు, బదిలీలు వారికి సంబంధించిన సీనియార్టీ తదితర విషయాలను 'రామరాజు' చూస్తుంటారు. తనంత సమర్థుడు, నిజాయితీపరుడునని, నియమని బంధనలు తెలిసిన వాడినన్న అహంకారంతో ఏ ఒక్కరినీ లక్ష్యపెట్టడం లేదట. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన అదే బాధ్యతలను మరో హోదాలో నిర్వహించిన ఆయన ఇప్పుడూ అదే పనిచేస్తున్నారు. ఆయన ఎంత వరకు నిజాయితీపరుడో..తమకు తెలియదని..నమస్కారం పెట్టినా ప్రతినమస్కారం చేయరని..ఉద్యోగులు విమర్శిస్తుంటారు. ఐఎఎస్‌ అధికారుల సీనియార్టీ జాబితాను తారుమారు చేయడంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డాడని అధికారులు ఇంతకు ముందు ఆరోపించారు. గత ఏడాది వరకు ఏకపక్షంగా వ్యవహరించిన 'రామరాజు'కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కళ్లెం వేశారు. అంతకు ముందు సిఎస్‌ వద్దకు నేరుగా 'రామరాజు' వెళ్లి శాఖకు సంబంధించిన విషయాలను చర్చించేవారు. సిఎస్‌తో ఉన్న సంబంధాలతో శాఖ ఉన్నతాధికారులను 'రామరాజు' చిన్నచూపు చూసేవారు. అయితే 'దినేష్‌' సిఎస్‌ అయిన తరువాత..'రామరాజు'వ్యవహారాలపై దృష్టిపెట్టారు. తనతో చర్చించేందుకు జిఎడి పొలిటికల్‌ కార్యదర్శి మాత్రమే తన వద్దకు రావాలని 'దినేష్‌' ఆదేశించడంతో ఖంగుతిన్న 'రామరాజు' ఇటీవలే కొంత దూకుడు తగ్గించారు. 

  ఐఎఎస్‌ అధికారుల పోస్టింగ్‌లు,బదిలీలకు సంబంధించిన వివరాలు ముఖ్యమంత్రి నుంచి రాగానే..ఉత్తర్వులు జారీ చేయకుండానే తనకు ఇష్టమైన అధికారులకు 'రామరాజు' చేరవేస్తారనే విమర్శ ఉంది. కొంత మంది క్రిందిస్థాయి అధికారులకు తానే పోస్టింగ్‌ ఇప్పిస్తున్నానని..సిఎం,సిఎస్‌ మీపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా..తాను సహాయం చేసి పోస్టింగ్‌లు ఇప్పించానని...ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. 'రామరాజు'పై వచ్చిన ఆరోపణలు, విమర్శలు దృష్ట్యా ఆయనను తప్పించాలని సిఎస్‌ భావించినా..ఆఖరి నిమిషంలో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. జిఎడి సంబంధించిన ఆదేశాలను, పోస్టింగ్‌ల విషయాలను ప్రతిపక్షనాయకులకు ముందుగానే 'రామరాజు' చేరవేస్తున్నారనే విమర్శ ఉంది. దీనిపై మీడియా వర్గాలు జిఎడి అధికారులను అడిగినా వారు పెద్దగా స్పందించలేదు. పలువురు క్రిందిస్థాయి అధికారులను 'రామరాజు' వ్యవహారశైలిపై వివరాలు అడగగా..ఒకరిద్దరు మాత్రమే..మౌనం వహించగా..మిగతా వారు అంతా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. సచివాలయ అధికారుల్లో, ఐఎఎస్‌ అధికారుల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. త్వరలో జిఎడి నుంచి 'రామరాజు'ను తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

(బి.ఆర్‌.కె.మూర్తి)

(406)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ