WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'టిడిపి'కి షాక్‌ ఇచ్చిన 'పవన్‌కళ్యాణ్‌'...!

'పవన్‌కళ్యాణ్‌'కు రాజకీయాలు బాగానే అర్థం అయినట్లు ఉన్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో హఠాత్తుగా...అధికార తెలుగుదేశం పార్టీపై దండెత్తి...తాను ఆ పార్టీకి మద్దతుదారుని కాదని, తన దోవ తనకు ఉందని నిరూపించుకున్నారు. ఇన్నాళ్లూ టిడిపి పట్ల మెతకవైఖరి అవలంభిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన ఈ రోజుతో దాన్ని చెరిపేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తోన్న అవినీతి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలి, అసమర్థత, రాజధానిలో జరుగుతున్న అవినీతి, ఇసుక అక్రమాలు, సిఎం తనయుడు 'లోకేష్‌' అవినీతిపై బహిరంగంగా విరుచుకుపడ్డారు. 'పవన్‌' నుంచి వచ్చి ఈ మాటలతో టిడిపి నేతలు ఉలిక్కిపడుతున్నారు. ఇదేమిటి...? ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న 'పవన్‌' ఒక్కసారిగా ఈ విధంగా ఎందుకు విమర్శలు చేస్తున్నారో వారికి అర్థం కాలేదు. 

  మొదట 'పవన్‌' గుంటూరులో సభ పెడుతున్నప్పుడు...ఆయన సభ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆయనేదో సభ పెడతారు..కాసేపు ఏదో చెప్పుకుంటారు..'మోడీ'పై బహిరంగా విమర్శలు కురిపించి వెళ్లిపోతారని ఆ పార్టీ నాయకులు భావించారు. కానీ...వారు ఊహించని విధంగా...'పవన్‌' టిడిపి అవినీతిపై విమర్శలు ఎక్కు పెట్టారు. ఎమ్మెల్యేలు, ఎంపీల అవినీతి గురించి మాట్లాడితే...టిడిపి నాయకులు పెద్దగా ఆశ్చర్యపోయేవారు కాదు..కానీ...'పవన్‌' ఏకంగా సిఎం తనయుడు 'లోకేష్‌' అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు చేయటం పార్టీ వర్గాలకు మింగుడుపడడం లేదు. 'లోకేష్‌' అవినీతికి పాల్పడినట్లు..ఏమి ఆధారాలు ఉన్నాయని...ఆయన ఆరోపణలు చేశారో తమకు తెలియదు కానీ...ఆయన 'లోకేష్‌'ను టార్గెట్‌ చేసుకున్నారంటే..దీని వెనుక భారీ వ్యూహమే ఉందన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. నిన్నటిదాకా టిడిపి, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎటువంటి విమర్శలు చేయకుండా..మౌనం పాటించిన 'జనసేన' అధినేత...తాను..ఆ పార్టీకి మద్దతుదారుడిని కాదని..రాబోయే ఎన్నికల్లో తన పోటీ సీరియస్‌గా ఉండబోతోందని..ఈ ప్రసంగాల ద్వారా నిరూపించారు. అదే సమయంలో....'జగన్‌'తో తాను కలిసేది లేదని స్పష్టం చేశారు. అంటే రాబోయే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉంటుందని 'పవన్‌' ఈ సభ ద్వారా స్పష్టం చేశారు. అయితే...'పవన్‌' ఇచ్చిన షాక్‌తో టిడిపి వర్గాలు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యాయి...! ఇక రేపటి నుంచి ఆయనను కూడా ప్రత్యర్థిగా భావించి..ఆయనపై ఎదురుదాడి చేస్తాయా..? లేక..మరికొన్నాళ్లు వేచి చూస్తాయా....? చూడాలి మరి.


(1555)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ