WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జెడి లక్ష్మీనారాయణ'ని 'మోడీ' ప్రయోగిస్తున్నారా...!?

భారత దేశ రాజకీయాల్లో చాలా మంది పోలీసు అధికారులు రాజకీయాల్లోకి వచ్చారు. కొందరు రాణించారు..మరికొందరు రాజకీయాల్లో రాణించలేక వదిలేశారు. పోలీసు యంత్రాంగంలో సూపర్‌కాప్‌లో పేరు తెచ్చుకున్న..చాలా మంది పోలీసు అధికారులు..రాజకీయాల్లో రాణించలేక పోయారు. వృత్తిలో రాణించిన రీతిలో రాజకీయాల్లో వారు రాణించలేకపోవడానికి వృత్తికి... రాజకీయాలకి మధ్య ఉన్న తేడాను గుర్తించకపోవడం వల్లే. కేవలం పోలీసు వృత్తిలో ఉన్న వారే కాదు..వివిధ వృత్తుల్లో నిష్టాతులు, లబ్ద ప్రతిష్టతలు పొందిన వారు కూడా రాజకీయాల్లో ఇడమలేక పోయారు..రాణించలేకపోయారు. 

   ఎవరో ఎందుకు క్రికెట్‌లో ఎంతో పేరు తెచ్చుకున్న 'సచిన్‌టెండూల్కర్‌' కానీ..సినిమాల్లో సూపర్‌స్టార్‌ అయిన అమితాబచ్చన్‌ కానీ...సూపర్‌కాప్‌గా పేరు తెచ్చుకున్న 'కిరణ్‌బేడీ' కానీ...రాజకీయాల్లో తమదైన ముద్ర వేయలేకపోయారు..రాణించలేకపోయారు. జాతీయ స్థాయిలోనే కాదు..రాష్ట్ర స్థాయిలోనూ...వివిధ రంగాల్లో  ఎంతో పేరు తెచ్చుకున్న వారు రాజకీయాల్లో ఇమడలేక దూరమయ్యారు. అయితే వివిధ రంగాల్లో ఎంతో పేరు,ప్రఖ్యాతులు సాధించి..రాజకీయాల్లోకి వచ్చి విఫలమైన వారి సంగతులు తెలిసినా మరెంతో మంది రాజకీయాల్లోకి వస్తూనే ఉన్నారు. తాజాగా..సిబీఐ అధికారి 'లక్ష్మీనారాయణ' రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన తన పదవికి రాజీనామా చేసి...ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా ఆయనను ఒక పథకం ప్రకారం బిజెపి పెద్దలు రంగంలోకి దించారని, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని..ఆయనను రంగంలోకి దింపారని అంటున్నారు.

గాలి,జగన్‌ల అరెస్టులతో సంచలనం...!

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 'లక్ష్మీనారాయణ' మహారాష్ట్ర సర్వీసుకు ఎంపికయి..అక్కడ నుంచి సీబీఐలో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రంలో ఆయన వివిధ అవినీతి కేసులను పరిశోధించి పలువురు ప్రముఖులను అరెస్టు చేసి సంచలనం సృష్టించారు. కర్ణాటక మైనింగ్‌ కింగ్‌ 'గాలి జనార్థన్‌రెడ్డి'ని అరెస్ట్‌ చేసి...ఆయనను హైదరాబాద్‌ తరలించి...'జెడి లక్ష్మీనారాయణ' ఎవరికీ లొంగని అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తరువాత..అవినీతి కేసులో 'వై.ఎస్‌.జగన్‌'ను అరెస్టు చేసి...మరో సంచలనం సృష్టించారు ఆయన. అప్పట్లో 'లక్ష్మీనారాయణ' పేరు చెబితేనే...వైకాపా శ్రేణులు వణికిపోయేవి. ఆయన తీరుతో హడలెత్తిన 'జగన్‌,గాలి బ్యాచ్‌ 'లక్ష్మీనారాయణ'పై వ్యక్తిగత ఆరోపణలు చేసి..ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని భావించాయి. అయితే...అప్పటి పరిస్థితుల్లో ఆయనను ఎదుర్కొలేక చేతులు ఎత్తేశాయి.  

'లక్ష్మి'ని మోసిన పత్రికలు....!

సీబీఐ అధికారిగా తన విధిని నిర్వహించిన 'లక్ష్మీనారాయణ'ను రెండు పత్రికలు హీరోని చేశాయి. ఆయనకు లేని సామర్ధ్యాలను కట్టబెడుతూ..నాడు ఆ పత్రికలు చేసిన అతి వల్లే...ఆయనకు సూపర్‌కాప్‌ ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. 'జగన్‌'తో ద్వేషంతో...'లక్ష్మీ'ని అవి ఆకాశానికి ఎత్తేశాయి. 'జగన్‌', గాలి కేసుల్లో ఏ అధికారి ఉన్నా..చేసే పనే 'లక్ష్మీనారాయణ' చేశారు..తప్ప..పెద్దగా ఆయన చేసిందేమీ లేదని...కొందరు పోలీసు అధికారులు అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇప్పటికీ అదే మాటను వారు చెబుతున్నారు. తన అధికారులు అప్పచెప్పిన పనిని ఆయన చేశారు...పోలీసు వృత్తిలో భాగంగా తన విధిని నిర్వహించినందుకే..ఆయనను అంతగా ఎత్తుకోవాల్సిన అవసరం లేదనే అధికారులు ఉన్నారు.

ఎవరికంటే...ఘనడు...?

కాగా..పోలీసు అధికారిగా ఆయన ఎవరికంటే ఘనుడు...? అనే ప్రశ్న..అదే వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో ఎంతో మంది పోలీసు అధికారులు వృత్తి కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని...వారికంటే 'లక్ష్మీనారాయణ' ఏం ఎక్కువ చేశారని కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఐపిఎస్‌ అధికారి 'ఉమేష్‌చంద్ర'...సమాజంలో లా అండ్‌ ఆర్డర్‌ నెలకొల్పేందుకు విశేషంగా కృషి చేసి చివరకు తన ప్రాణాలను పోగొట్టుకున్నారని...ఆయన కంటే 'లక్ష్మీ' సమర్థుడా..? అని వారు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా సదాశివరావు, గౌతమ్‌కుమార్‌, కోడె దుర్గాప్రసాద్‌, గౌతమ్‌సవాంగ్‌, సురేంద్రబాబు, ప్రస్తుత డీజీపీ మాలకొండయ్యలు నిజాయితీపరులు, సమర్థులని...వీరికి లేని హీరోయిజం..'లక్ష్మి'కి కట్టబెట్టారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అదే విధంగా ఇటీవలే డీజీపీగా రిటైర్‌ అయిన 'నండూరి సాంబశివరావు' సమర్థతను కూడా మరిచిపోలేమని..వీరందరి కంటే 'లక్ష్మీనారాయణ' ఎందులో ఘనుడని, ఎందుకు ఆయనకు హీరోయిజం అంటకడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

సామాజిక అవసరాల కోసమేనా...!?

బిజెపితో టిడిపి తెగతెంపులు చేసుకోవడంతో....రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే... 'లక్ష్మీనారాయణ'ను రాజకీయాల్లోకి బిజెపి తీసుకు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి...సినీనటుడు 'పవన్‌కళ్యాణ్‌'ను తమ దరి చేర్చుకోవాలని బిజెపి పెద్దలు ఇప్పటికే వ్యూహాన్ని రచించారు. ఇక అదే సమయంలో 'పవన్‌' సామాజికవర్గానికి చెందిన 'లక్ష్మీనారాయణ'ను కూడా ఆయనతో కలుపుకుంటే...బలమైన సామాజికవర్గమైన కాపుల ఓట్లను సాధించవచ్చనే... భావనతోనే...'లక్ష్మీ' రాజకీయ అరంగ్రేటానికి బిజెపి పెద్దలు పచ్చజెండా ఊపారని ప్రచారం జరుగుతోంది. 'పవన్‌,లక్ష్మీ'ల జోడి కట్టి...'జగన్‌'తో పొత్తు కానీ...ఒప్పందం కానీ కుదుర్చుకుని పోటీ చేస్తే...రాష్ట్రంలో తమ జెండా పాతవచ్చన్న బిజెపి పెద్దల వ్యూహం మేరకే...'లక్ష్మీనారాయణ'ను బరిలోకి దించుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి 'లక్ష్మీ' వారి ఆశలను ఎంత వరకు నెరవేర్చగలడో...చూద్దాం....!


(1440)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ