WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోడీ', ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ...!

సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వివిధ పార్టీలు...ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అదే సమయంలో పొత్తులు...ఎత్తులు...రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై వ్యూహరచన చేసుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడడంతో..అధికారంలో ఉన్న బిజెపిని ఓడించడానికి ఏమి చేయాలనే దానిపై వివిధ రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రాంతీయ పార్టీలను మింగేయాలన్న 'మోడీ' ఆలోచనకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా పార్టీలు...వివిధ రాష్ట్రాల్లో కూటమిగా ఏర్పడి...పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు సాగిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా...దాదాపు 20కిపైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి...తమను కొట్టేవాళ్లు లేరని మొన్నటి వరకు విర్రవీగింది. అయితే ఇటీవల కాలంలో వరుసగా ఎదురవుతున్న పరాజయాలు..ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి. అయినా...తమ బలం తగ్గలేదని...తమకు పోటీ ఇచ్చేవారే లేరని ఆపార్టీ అధ్యక్షుడు 'అమిత్‌షా' చెబుతున్నారు. ఆయన చెబుతున్న దానిలో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే...ఏ జాతీయ పార్టీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి దగ్గరకు వచ్చే పరిస్థితిలో లేదు. 

   దాదాపు మూడు నాలుగు రాష్ట్రాల్లో తప్ప మిగిలిన రాష్ట్రాలన్నింటిలో శూన్య హస్తంతో కాంగ్రెస్‌ పార్టీ కష్టాల్లో కూరుకుపోయింది. ఆ పార్టీ ఆరు లేక ఏడు రాష్ట్రాల్లో మాత్రమే బిజెపితో ముఖాముఖి పోరాడుతోంది. మిగిలిన రాష్ట్రాల్లో బిజెపి ప్రాంతీయ పార్టీలతో పోరు సల్పుతోంది. పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఒరిస్సా, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో బిజెపి పోరు సల్పుతోంది. అదే సమయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌,బిజెపిలు కొన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరిచే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో అటు కాంగ్రెస్‌ కానీ...ఇటు బిజెపికి కానీ పట్టులేదు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. దేశ మొత్తం మీద బిజెపి, కాంగ్రెస్‌లు ముఖాముఖి పోటీలో తలపడేది..మహా అయితే ఐదారు రాష్ట్రాలే...! ఈ పరిస్థితుల్లో 'మోడీ'తో ఢీ కొట్టేది ప్రాంతీయ పార్టీలే. 80 పార్లమెంట్‌ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ,బిఎస్పీలను బిజెపి ఎదుర్కొనాల్సి ఉంటుంది. మేజర్‌ రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో బిజెపి...ప్రాంతీయ పార్టీలతో పోరాడాల్సి ఉంది. దీంతో..వచ్చే ఎన్నికల్లో పోటీ అంతా 'బిజెపి', ప్రాంతీయ పార్టీల మధ్యే నెలకొనబోతోంది.


(270)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ