WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైకాపాలోకి టిడిపి ఎమ్మెల్యే 'స్వామి'...!

ఊరందరిది ఒక దారి అయితే....ఉలిపికట్టెదో దారన్నట్లు...'కొండపి' టిడిపి ఎమ్మెల్యే శ్రీబాలవీరాంజనేయస్వామి కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. వైకాపాకు భవిష్యత్‌ లేదని...ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది టిడిపిలో చేరుతుంటే...టిడిపిలో ఉన్న 'స్వామి' వైకాపాలో చేరాలని భావిస్తున్నారట. గత ఎన్నికల్లో వైకాపా సీనియర్‌ నాయకుడు 'జూపూడి ప్రభాకర్‌రావు'పై 5440 ఓట్ల తేడాతో గెలుపొందిన 'బాలవీరాంజనేయస్వామి' తరువాత నియోజకవర్గంపై పట్టుకోల్పోయారు. 2014 ఎన్నికల్లో గెలుపొందిన తరువాత ఆయన నియోజకవర్గంలోని కార్యకర్తలకు, నాయకులకు దూరమయ్యారు. ఎవరైతే...తన గెలుపు కోసం సహకరించారో... వారినే...ఆయన గత నాలుగేళ్లుగా దూరం పెడుతున్నారు. స్వంత సొమ్ములు ఖర్చు చేసుకుని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన ఓ వర్గాన్ని 'స్వామి' పట్టించుకోవడం లేదట. అదే సమయంలో తనకు ప్రత్యర్థులుగా పనిచేసిన వైకాపాకు చెందిన కొంత మంది కార్యకర్తలను, నాయకులను ఆయన దగ్గరకు తీశారట. అంతే కాదు..కొంత మంది టిడిపి కార్యకర్తలు పార్టీ వదిలి వెళ్లేలా...ఆయన వ్యవహరించారని, పొమ్మనకుండా పొగపెట్టారనే కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీంతో...నియోజక వర్గంపై పట్టుకోల్పోయిన...ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇచ్చేది లేదని అధిష్టానం పరోక్షంగా చెబుతోందట. దీంతో...టిడిపిలో ఉంటే పార్టీ టిక్కెట్‌ ఇవ్వరని భావించిన ఆయన...వైకాపాలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

'జగన్‌'తో భేటీ...!

టిడిపితో తెగతెంపులు చేసుకోవాలని భావిస్తున్న 'స్వామి' ఇంతకు ముందే వైకాపా అధినేత 'జగన్‌'ను రహస్యంగా కలిశారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. త్వరలో టిడిపిని వదలి వైకాపాలో చేరేందుకు ఆయన సిద్దం అయిపోయారట. ఆయనతో పాటు...ఆయన తమ్ముడు కూడా పార్టీ మారతారని తెలుస్తోంది. వీరు కాకుండా...టిడిపిలో అసంతృప్తిగా ఉన్న సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ ఒకరు పార్టీ మారతారని ప్రకాశం జిల్లా నాయకులు చెబుతున్నారు. కాగా..ఎమ్మెల్సీ వైకాపాలోకి కాకుండా...జనసేనలోకి వెళతారనే సమాచారం వస్తోంది.

  టిడిపి ఆవిర్భావించిన తరువాత 'కొండపి' నియోజకవర్గంలో కాంగ్రెస్‌,టిడిపిలు సమానంగా ఆదరించారు. ఇక్కడ చెరో మూడుసార్లు ఆ పార్టీలు విజయం సాధించాయి. గత ఎన్నికల్లో వైకాపా,టిడిపిల మధ్య హోరాహోరిగా పోటీ జరిగింది. టిడిపి తరుపున 'స్వామి', వైకాపా తరుపున'జూపూడి' పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో...'జూపూడి' ప్రత్యర్థి చేసినంత ఖర్చు చేయకపోవడం...ఆయన గెలిస్తే మంత్రి అవుతారనే...భావనతో...వారి పార్టీకే చెందిన సీనియర్‌ నాయకులు ఆయనకు వెన్నుపోటు పొడిచారు. దీంతో..ఎన్నికల తరువాత 'జూపూడి' టిడిపిలో చేరిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న ఆయన ఇటీవలే మళ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఇప్పుడు 'స్వామి' వైకాపాలోకి వెళితే...'జూపూడి' మళ్లీ ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా రంగంలోకి దిగడం ఖాయమని 'జూపూడి' అనుచరులు చెబుతున్నారు. మొత్తం మీద...'స్వామి' పార్టీ మారితే...ఇక్కడ రాజకీయాలు రంజుగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం...!


(1061)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ