లేటెస్ట్

'ఆదాల'పైనేనా...'కోటంరెడ్డి' విసుర్లు....!

నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఈ జిల్లాలో కొన్నాళ్లు టిడిపి మరి కొన్నాళ్లు కాంగ్రెస్‌ హవా సాగించాయి. ఎన్టీఆర్‌ హయాంలో ఆయన వెంట ఉన్న నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి తరువాత ఆయనపై యుద్ధం ప్రకటించి సంచలనం సృష్టించారు. తరువాత కాలంలో 'లక్ష్మీపార్వతి' గ్రూపు తరుపున నెల్లూరులో జోరుగా రాజకీయాలు నడిచాయి. అది చివరకు ఎన్టీఆర్‌ను పదవీచ్యుతిని చేసిందనుకోండి. అది వేరే సంగతి...కాంగ్రెస్‌ హయాంలో 'ఆనం' సోదరులు, ఇటీవల కాలంలో 'కోటంరెడ్డి, కాకాని గోవర్థన్‌రెడ్డి'లు జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నారు. మధ్యలో కొద్ది కాలం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హవా సాగింది. అయితే...జిల్లాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా..'రెడ్డి' సామాజికవర్గ నేతలే పెత్తనం చెలాయిస్తుంటారు. వీరిలో చాలా మంది దగ్గర బంధువులే. అయినా వీరికి ఒకరంటే మరకొరికి గిట్టదు. టిడిపి అధికారంలో ఉన్నా...అదే పరిస్థితి, ప్రస్తుతం వైకాపాలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో తిరుగులేని విజయం సాధించిన వైకాపా పార్టీ ప్రస్తుతం గ్రూపు రాజకీయాలతో సతమతమవుతోంది. జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వైకాపానే గెలవడంతో ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా నుంచి 'జగన్‌' క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా వారి జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. మొదట్లో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అసెంబ్లీలో 'చంద్రబాబు'పై ధ్వజమెత్తి సంచలనం సృష్టించారు. తరువాత..తన శాఖపై పట్టుసాధించేందుకు ఆయన కిందా మీదా అవుతున్నారు. మరో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తన పనిని తాను చేసుకుంటూ పోతున్నారు. అయితే ఎమ్మెల్యేలు 'కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కాకాని గోవర్థన్‌రెడ్డి'లు జిల్లాలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా 'కోటంరెడ్డి' దూకుడు వ్యవహారాలు అధిష్టానానికి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. మొదటల్లో ఓ పత్రిక యజమాని ఇంటికి వెళ్లి చంపుతానని బెదిరించడం ఆ ఆడియోలు బయటకు రావడంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఎంపిడిఓ ఇంటికి వెళ్లి బెదిరించడంతో ఆయన అరెస్టు అయ్యారు. ఈ అరెస్టు సంచలనం సృష్టించింది. అధికార పార్టీ తన స్వంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే అరెస్టు చేయించడం, వెంటనే విడుదల చేయించడంపై కూడా రాజకీయపరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ అరెస్టులు, విడుదలలు ఎలా ఉన్నా...తనను స్వంత పార్టీ వారే వేధిస్తున్నారని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారని 'కోటంరెడ్డి' ప్రకటించడం వైకాపాలో చర్చకు కారణమైంది. 'కోటంరెడ్డి'ని వేధిస్తుందెవరు..? ఆయనను ఎదగనీయకుండా అడ్డుకుంటుందెవరు..? అనేదానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తనను అణిచివేస్తున్నారని 'కోటంరెడ్డి' పరోక్షంగా ఎంపి ఆదాల, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డిలను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారని జిల్లాకు చెందిన పార్టీ నాయకులు చెబుతున్నారు. మొదటి నుంచి 'ఆదాల'కు 'కోటంరెడ్డి'కి పడదు. ఎన్నికల ముందు వరకు టిడిపిలో ఉన్న 'ఆదాల ప్రభాకర్‌రెడ్డి' చివరి నిమిషంలో వైకాపాలో చేరి ఎంపీ టిక్కెట్‌ తెచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలందరికీ ఎన్నికల ఖర్చు ఇచ్చిన 'ఆదాల' 'కోటంరెడ్డి'కి మాత్రం ఖర్చులకు సొమ్ములు ఇవ్వలేదట. అసలే 'ఆదాల' పేరు ఎత్తితేనే మండిపోయే 'కోటంరెడ్డి'కి 'ఆదాల' చేసిన పని మరింత చిర్రెత్తిచిందట. దీంతో అవకాశం వచ్చిన ప్రతిసారి..'ఆదాల'ను 'కోటంరెడ్డి' టార్గెట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నార. ఈసంగతి తెలుసుకొన్న 'ఆదాల' 'కాకాని గోవర్థన్‌రెడ్డి'ని దువ్వుతున్నారని, వీరిద్దరూ కలసి 'కోటంరెడ్డి'కి చెక్‌ పెడుతున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద...'ఆదాల, కాకాని'లను ఉద్దేశించే 'కోటంరెడ్డి' వ్యాఖ్యలు చేస్తున్నారని, జిల్లాలో నెలకొన్న గ్రూపులు పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయని అధినేత వీరిని పిలిపించి ఎప్పుడు మాట్లాడతారోనని సగటు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. 

(585)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ