WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లోకేష్‌'పై అసంతృప్తితో తప్పుకున్న 'గల్లా'...!

'చంద్రగిరి' నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుండి మాజీ మంత్రి గల్లా అరుణ తప్పుకోవడానికి పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌ కారణమని ఆమెకు సన్నిహితంగా మెలిగేవారు చెబుతున్నారు. నియోజకవర్గంలో 1989,1999,2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన 'గల్లా' 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌ హయాంలో తిరుగులేని నేతగా అధికారం చెలాయించిన 'గల్లా'కు స్థానిక టిడిపి నాయకులు సమస్యగా మారారు. ప్రతి విషయానికి మంత్రి లోకేష్‌ కలుగ చేసుకోవడంపై ఆమె పలుసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై సిఎం పట్టించుకోకపోవడంతో ఆమె విసుగు చెందారు. అంతే కాకుండా నియోజవర్గం నుంచి తనకు పోటీ చేసే అవకాశం దక్కదని లోకేష్‌ అనుచరులు ప్రచారం చేయటం, అంతే కాకుండా కుటుంబ సభ్యులు విశ్రాంతి తీసుకోవాలని ఒత్తిడి తేవడంతో, నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా గెలిచే అవకాశాలు లేకపోవడంతో...ఆమె ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పుకున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. మండల స్థాయి నాయకులు, ఎక్కువమంది మంత్రి లోకేష్‌తో పనులు చక్కపెట్టుకుంటున్నారు. మరి కొంత మంది ఎంపి శివప్రసాద్‌ ద్వారా పనులు చేయించుకుంటున్నారు. 

   'జన్మభూమి' కమిటీలు, అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన విషయాల్లో 'గల్లా' మాట చెల్లుబాటు కావడం లేదు. ఆమె కుటుంబసభ్యుల ద్వారా వస్తోన్న కథనాలు వేరే విధంగా ఉన్నాయి. సంవత్సరంపాటు ఆమె అమెరికాలో విశ్రాంతి తీసుకోవాలని 'గల్లా' భావిస్తున్నారట. కుమారుడు గుంటూరు ఎంపీగా మళ్లీ పోటీ చేస్తోన్న నేపథ్యంలో తాను...చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయటం మంచిది కాదని 'గల్లా' భావిస్తున్నారు. కుటుంబంలో ఒకరు మాత్రమే రాజకీయాల్లో ఉండాలి...ఇద్దరు ఎందుకని 'గల్లా' ఆ నిర్ణయానికి వచ్చారని తెలిసింది. 2019లో టిడిపి అభ్యర్థి ఎవరైనా తాను తప్పకుండా మద్దతు ఇస్తానని, తన కుటుంబ అభిమానులు, సన్నిహితులు పార్టీ గెలుపుకు సహకరిస్తారని ఆమె చెప్పారు. కానీ...'చంద్రగిరి' నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా నడుస్తున్నాయని...ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేసినా విజయం సాధించడం కష్టమని ఆమె 'చంద్రబాబు'కు చెప్పినట్లు తెలిసింది. 

  టిడిపి నాయకులు వ్యాపార లావాదేవీల్లో మునిగిపోయారని...అటువంటి వారినే మంత్రి లోకేష్‌ వెనకేసుకొన్నారని ఆమె చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికైనా ఇక్కడ టిడిపి గెలవాలంటే కొంత మంది మండల నాయకుల ప్రమేయాన్ని, లోకేష్‌ పెత్తనాన్ని పక్కనపెడితేనే సాధ్యపడుతుందని 'గల్లా' 'చంద్రబాబు'కు వివరించారని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ 'చంద్రగిరి' నియోజకవర్గం నుంచి 'గల్లా' తప్పుకోవడానికి ప్రధాన కారణం..మంత్రి లోకేషేనని ఇక్కడ పార్టీ వర్గాల అభిప్రాయం. కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినా..ఓడినా..'లోకేష్‌' పెత్తనం ఈ నియోజకవర్గంలో ఉంటుందని...ఎవరికి వారు స్వచ్చంధంగా పక్కకు తప్పుకునే అవకాశాలు ఉన్నాయి.

(255)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ