WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కలెక్టర్‌ వ్యక్తి కాదు..వ్యవస్థలో భాగమే:కలెక్టర్‌ లక్ష్మీకాంతం

కలెక్టర్‌ అంటే ఒక వ్యక్తి కాదని..వ్యవస్థలో భాగమని...కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం అన్నారు. శుక్రవారం నాడు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ లక్ష్మీకాంతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తాను కలెక్టర్‌గా వచ్చిన దగ్గర నుంచి ప్రజలే ముందు అనే నినాదంతో జిల్లాలో అనేక మార్పులు తీసుకు వచ్చానని..ప్రభుత్వ సేవలపై జిల్లాలో 77 శాతం ప్రజల్లో సంతృప్తి వచ్చిందని 85 శాతం రావడమే తన లక్ష్యమని చెప్పారు.జిల్లాలో ఉద్యోగులకు 100 శాతం బయోమెట్రిక్‌ చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానం సంపాదించవన్నారు.పట్టిసీమ ద్వారా వ్యవసాయ రంగంలో పురోగతి సాధించామని,వర్షాలకు తడిచిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించామని చెప్పారు.మైనింగ్‌లో జిల్లాకు అత్యధిక ఆదాయం వస్తుందని మైనింగ్‌ లో ప్రైవేటు వ్యక్తులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగర ప్రజల ట్రాఫిక్‌ ఇక్కట్లను తీర్చడం కోసం ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్‌ నాటికి దుర్గగుడి ప్లైఓవర్‌ పూర్తి చేస్తామని, అక్టోబర్‌ నాటికి బెంజ్‌ సర్కిల్‌ ప్లైఓవర్‌ నిర్మాణం పూర్తి చేస్తామని, ప్లైఓవర్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఐదువేల ఎకరాల్లో బందరు పోర్టు పనులను నెల రోజుల్లో ప్రారంభించనున్నామని తెలిపారు. జర్నలిస్టులు కూడా వ్యవస్థలో భాగమేనని...వారికి అక్రిడేషన్‌ కార్డులను మంజూరు చేశామని తెలిపారు. మిగతా జిల్లాల కంటే ఎక్కువగా ఇక్కడ జర్నలిస్టులకు అక్రిడేషన్‌ కార్డులు ఇచ్చామని కలెక్టర్‌ తెలిపారు. డిఎంహెచ్‌ఓలో జర్నలిస్టుల హెల్డ్‌కార్డుల నిర్వహణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని, జర్నలిస్టులతో తమ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయని...అన్నారు. జర్నలిస్టుల హెల్త్‌కార్డుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదని కార్పొరేట్‌ హాస్పటళ్లకు ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ యాభై శాతం ఇవ్వడానికి తాను వ్యక్తిగతంగా చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ చెప్పారు.

రెవిన్యూ ఫస్ట్‌...!

జిల్లాలో అన్ని శాఖల కన్నా రెవిన్యూ శాఖ ముందుందని..రెవిన్యూవసూళ్లు బాగా పెరిగాయని తెలిపారు. గ్రామ దర్శిని ద్వారా అన్ని విషయాలు నేరుగా తెలుసుకుంటున్నామని, మీ సేవ ద్వారా అన్ని సేవలను త్వరితగతిన అందిస్తున్నామని, తద్వారా జిల్లాలో సంతృప్తి స్థాయి పెంచుతున్నామన్నారు. వ్యక్తిగత సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని కలెక్టర్‌ చెప్పారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ను సుందరీకరిస్తున్నామని దీని ద్వారా అర్బన్‌ గ్రీనరీ అవార్డు జిల్లాకు వస్తుందని కలెక్టర్‌ తెలిపారు. ప్రజలకు దగ్గరగా ఉండడం వల్లే కృష్ణా జిల్లాకు జనవరిలో ఐఎస్‌ఒ గుర్తింపు వచ్చిందని లక్ష్మీకాంతం తెలిపారు.ఆధార్‌ ఎనేబుల్డ్‌ బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ద్వారా జరుగుతున్న అన్ని కార్యక్రమాలు, ఎంతమంది పని చేస్తున్నారు తెలుస్తుందని,సంతృప్తి స్ధాయి పెంచడంలో భాగంగా, ప్రజాప్రయోజన కార్యక్రమాలు పూర్తి గా నిర్వహిస్తూ, అన్నీ ఈ జిల్లా డ్యాష్‌ బోర్డులో చూపిస్తున్నామని తెలిపారు.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో ముందంజ...!

కృష్ణా జిల్లాను వ్యవసాయ అనుబంధ రంగాలలో సైతం ముందంజలో ఉంచేందుకు కృషిచేస్తున్నామని ఆయన చెప్పారు.చింతలపూడి ప్రాజెక్టు అనుబంధంగా కృష్ణాజిల్లాలో పది లక్షల హెక్టార్లలో వ్యవసాయం అభివృద్ధి చెందిందన్నారు.పీతల, చేపల  పెంపకం ద్వారా 12లక్షల మెట్రిక్‌ టన్నులు ఎగుమతులను సాధించామని,హార్టికల్చర్‌ లో కూడా కృష్ణా జిల్లా రాష్ట్రంలో ప్రధమ స్ధానంలో ఉందని చెప్పారు.పంట కుంటలు ఏర్పాటు విషయంలో, ఎన్‌ టి ఆర్‌ జలసిరి ద్వారా భూగర్భ జలాలు పెంచడంలో ప్రధమ స్థానంలో ఉన్నామన్నారు.నరేగా ద్వారా అన్ని గ్రామాలలో సిసి రోడ్లు వచ్చేలా కృషి చేస్తున్నామని, అంగన్‌వాడీ కేంద్రాల బిల్డింగ్‌లు నిర్మించడం ఈ సంవత్సరంలో పూర్తి అవుతుందని తెలిపారు. ప్లాస్టిక్‌ ని ష్రెడ్డింగ్‌ చేస్తున్నామని,  దీనిద్వారా రోడ్లు వేయడంలో ఉపయోగించడం చేస్తామని, పేడను ఒక దగ్గర గ్రామంలోనే ఉంచి వర్మి కంపోస్టు తయారు చేస్తున్నామన్నారు.

ఓడీఎఫ్‌లో నెంబర్‌వన్‌...!

జిల్లాను బహిరంగ మల మూత్ర విసర్జన రహితంగా తీర్చి దిద్దామని చెప్పారు. ఓడీఎఫ్‌ ప్లస్‌కు త్వరలో వెళుతున్నామన్నారు. గ్రామ సంతలు ద్వారా రైతులకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని, అన్ని పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు.జిల్లా చరిత్రలో మొదటి సారిగా 8లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.జక్కంపూడి దగ్గర ఎకనమిక్‌ సిటీ పూర్తవుతోందని,విజయవాడ నగరం గ్రీన్‌ అండ్‌ వాటర్‌ సిటీగా మారుస్తున్నామని టూరిజం కోసం ఏర్పాట్లు చేశామని, విజయవాడ బరం పార్కువద్ద సెల్ఫీస్టాండులు, పదికిలోమీటర్ల వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నామని, బందరు బీచ్‌లో ఫెస్టివల్‌ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. రెండు వందల డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గర్బిణీ స్త్రీలకు సజ్జలడ్డూ ఇస్తున్నామని దీని ద్వారా గర్బిణీల్లో రక్తహీనత తలెత్తకుండా చూస్తున్నామని అన్నారు. బాల్యవివాహాలు నిరోధించడానికి టోల్‌ఫ్రీ నంబర్లు ఇచ్చామని చెప్పారు. తలసరి ఆదాయం పెంచడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, స్వయం ఉఫాది కార్యక్రమాలు చేపడుతున్మామని, చేయూత పథకం కింద విభిన్న ప్రతిభావంతులకు అంగవైకల్యం లేకుండా కృత్రిమ అవయవాలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కలెక్టర్‌ యాప్‌ ద్వారా నిత్యం అందరికీ కలెక్టర్‌ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని ఈ ఆడిట్‌ కూడా నిర్వహిస్తున్నామని అన్ని మండల,పంచాయితీలల్లో ఈ ఆడిట్‌ చేస్తున్నామని తద్వారా ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో సుమారు 45వేల మంది అధికారులు తన వెనుక ఉండి పనిచేస్తున్నారని, వారి ప్రోత్సహంతోనే జిల్లాను అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా చేయడంలో విజయం సాధించామని చెప్పారు. విజన్‌ విత్‌ యాక్షన్‌ సరిగా లేకపోతే అది డే డ్రీమ్‌ అవుతుందని..తాము విజన్‌తో పనిచేస్తూ..కలలను నెరవేర్చుకుంటున్నామని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు.


(193)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ