WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చుక్క భూముల క్రమబద్ధీకరణకు చురుగ్గా పనిచేయాలి

ఆక్రమణ భూముల క్రమబద్ధీకరణలో పురోగతి ఏదీ?

వివాదం లేని భూములు నెలలోగా గుర్తించి 22-ఎ జాబితా నుంచి తొలగించండి

కలెక్టర్ల సమావేశంలో ఉపముఖ్యమంత్రి  కె.యి కృష్ణమూర్తి

చుక్క భూముల (డాట్ ల్యాండ్స్ ) వ్యవహారాన్ని చక్కదిద్దాలని, క్రమబద్ధీకరణను నెలరోజులలోపు పూర్తి చేయాలని  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కె.యి కృష్ణమూర్తి  ఆదేశించారు. చుక్క భూములు  ఎక్కువగా వున్న రాయలసీమ జిల్లాలు, కోస్తాంధ్రలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాటి క్రమబద్ధీకరణ  అపరిష్కృతంగానే ఉందని ఆయన తెలిపారు. మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్ లో ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో కె.యి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈదిశగా  ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా అధికార యంత్రాంగం అలసత్వం చూపుతుందన్న భావనలో ప్రజలు ఉన్నారని, ఈ అంశంలో  రైతాంగంలో ఉన్న అసంతృప్తిని తొలగించేలా పరిస్థితిని చక్కదిద్దాలని  ఉపముఖ్యమంత్రి కోరారు.  

 ఆక్రమిత భూములను క్రమబద్ధీకరణ చేయండి

ఈ విషయంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రధ్ద వహించాలని, ప్రభుత్వంతో వివాదంలో లేని భూములను గుర్తించి వాటిని 22-A నిషేధిత భూముల జాబితా నుంచి ఒక నెల రోజుల్లోగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ  సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్ధాయిలో సమర్ధంగా  అమలుచేసే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని ఆయన కోరారు.ముఖ్యమంత్రి  చంద్రబాబు స్ఫూర్తితో గత నాలుగేళ్లలో రెవెన్యూ శాఖలో చరిత్రాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని రెవెన్యూ మంత్రి కె.యి కృష్ణమూర్తి చెప్పారు. రాష్ట్రంలో అన్ని రకాల భూములను ఒకే ఛత్రంకిందికి తెచ్చేందుకు ప్రభుత్వం భూ సేవ ప్రాజెక్టును ప్రవేశపెట్టిందన్నారు.  అక్టోబర్ 2 వ తేదీనాటికి రాష్ట్రమంతా భూసేవ కార్యక్రమాన్ని అమలులోకి తెస్తామని ఆయన అన్నారు. మనిషికి ఆధార్‌ లా భూమికి భూధార్ అని,  ఆధార్ తరహాలో 11 అంకెల విశిష్ట సంఖ్యతో  భూధార్  సంఖ్య  కేటాయిస్తామని చెప్పారు.  భూమికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తామన్నారు.

  భూసేవ ద్వారా రాష్ట్రంలోని 2.84 కోట్ల వ్యవసాయ భూములకు, 50 లక్షల పట్టణ   ఆస్తులకు,  8.5 లక్షల  గ్రామీణ ఆస్తులకు భూ-ధార్ కేటాయించనున్నట్లు డిప్యూటి సీఎం చెప్పారు. అర్బన్ ప్రాంతాలలో జనాభా ఎక్కువ కావడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో విశాఖపట్నంలో 3, విజయవాడ 3, కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున మొదటి విడతలో 9 అర్బన్ మండలాలు ఏర్పాటు చేశామని అన్నారు. శిధిలావస్థలో వున్న తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.ముందు చూపు, దూరదృష్టి, మనోధైర్యం ఉన్నవాడు నాయకుడిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవ్వన్నీ పుష్కలంగా ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని, ఆయన తీసుకొస్తున్న సంస్కరణలను ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లాలని, అవగాహన కల్పించాలని కె.యి కృష్ణమూర్తి కోరారు.  కేంద్రప్రభుత్వ రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.  పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాలను అమలు చేయటంలో అనాసక్తి చూపటం, రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడం కచ్చితంగా  ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయని అన్నారు. కేంద్ర వైఖరిని గమనించిన  ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు.  పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని సాధిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో న్యాయమైన  హక్కుల సాధనకై పోరాటం చేస్తున్నారని, రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో అందరూ  చంద్రబాబుకు అండదండలు అందించాలని  కె.యి కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు.

పారిశ్రామికాభివృద్ధికి నాలా చట్టం సవరించాం

నవ్యాంధ్రలో సత్వర పారిశ్రామికాభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నాలా చట్టం సవరించి ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని రెవెన్యూమంత్రి కె.యి గుర్తు చేశారు. గత నెల 26 వ తేదీనాటికి  3,305 దరఖాస్తులు  భూ-వినియోగ మార్పిడి కోసం వచ్చాయని,  పదుల సంఖ్యల్లో మాత్రమే పరిష్కరించారని, ఇది సరికాదని ఆయన అన్నారు. ఇదే పద్ధతిలో యంత్రాంగం పనిచేస్తే నవ్యాంధ్రలో పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.త్వరితగతిన సర్వే అభ్యర్ధనలను పరిష్కరించేందుకు సెర్ప్ (SERP) లో పనిచేస్తున్న  వెలుగు కమ్యునిటీ సర్వేయర్లను ఉపయోగించుకోవడానికి ఆమోదం తెలిపిన అంశాన్ని  కె.యి గుర్తు చేశారు. ఇందువల్ల సర్వే అభ్యర్ధనలు వేగంగా  పరిష్కారమౌతాయన్నారు. భూముల సర్వేకు  భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ వినియోగించుకొంటామని చెప్పారు. ప్రయోజనకరమైన సంస్కరణలు తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని,  అలాగే వాటి ఫలాలు అందరికీ  అందేలా చూడటమే మన బాధ్యత  అని కలెక్టర్లనుద్దేశించి రెవెన్యూ, ఉపముఖ్యమంత్రి కె.యి చెప్పారు.

(105)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ