ఆర్ధిక కష్టాలున్నా నిధుల విడుదల లో జాప్యం లేదు 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆర్ధిక కష్టాలున్నా నిధుల విడుదల లో జాప్యం లేదు

రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ విభజన తర్వాత వచ్చిన కష్టాలు, నష్టాల నుంచి బయటపడి రాష్ట్రం కోలుకుంటోందీ అంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధ నాయకత్వం, దిశానిర్దేశం, అధికార యంత్రాంగం చొరవ కారణమని, ఆయన విజన్ కు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. అందువల్లనే సత్ఫలితాలను సాధిస్తున్నామన్నారు. విభజనతో మనకు వుండే కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే అధిగమిస్తూ బయటకు వస్తున్నామని, ముఖ్యమంత్రి నేతృత్వంలో పనిచేయడంతో అనుకున్నట్టుగా ఫలితాలు సాధించామని యనమల వివరించారు.   ఈ ఏడాది చాలా కీలకమని, కష్టపడి పనిచేస్తే మరింత వృద్ధిని సాధిస్తామన్నారు. ఆర్ధికంగా అవరోధాలున్నా, విభజన కష్టాలు వీడకున్నా నిధుల విడుదలలో ఎక్కడా జాప్యం లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రం తలసరి ఆదాయంలో వెనుకబడి ఉందన్నారు. 2014-15లో మన రాష్ట్ర  వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌లో ఉందని, ముఖ్యమంత్రి కృషితో ఆ తర్వాత వరుసగా మూడేళ్ల నుంచి రెండంకెల వృద్ధిరేటును సాధించామని గుర్తు చేశారు. దేశంలో మరే రాష్ట్రం ఇలా వరుసగా రెండంకెల వృద్ధి రేటును సాధించలేదన్నారు.

  ఉద్యోగాల సృష్టి వల్లనే తలసరి ఆదాయం పెరుగుతుందని, గ్రామీణ ప్రాంతాలలో తయారీరంగ పరిశ్రమలు మరిన్ని వస్తే తలసరి ఆదాయంలో వృద్ధి సాధ్యం అవుతుందని ఆర్ధిక మంత్రి చెప్పారు. సేవారంగం, తయారీరంగాలు  ఇంకా అభివృద్ధి జరగాల్సి  ఉందన్నారు.  తలసరి ఆదాయం పెరగాలంటే ఉద్యోగ, ఉపాధి కల్పన పెద్దఎత్తున జరగాలని, తయారీ రంగం, సేవల రంగం వృద్ధి గణనీయంగా వుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ రెండు రంగాల అభివృద్ధి వల్ల తలసరి ఆదాయం పెరుగుతుందని, రాష్ట్రం సుస్థిర వృద్ధి సాధిస్తుందని  యనమల అన్నారు. సాంకేతికత, నవీన ఆవిష్కరణలు ప్రవేశపెడితే మరింత సమర్ధంగా పనిచేయగలుగుతామని చెప్పారు.

  కేంద్రం వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన రూ.350 కోట్లను వెనక్కి తీసుకుందని, అనేక పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటం లేదని అన్నారు.  ఆర్ధిక సమస్యలు ఉన్నాయని, అయినా ఇబ్బందులు లేకుండా బాధ్యతను ముఖ్యమంత్రి తీసుకున్నారని యనమల ప్రశంసించారు. ఉన్నతాధికారులు, విభాగాధిపతులు, ఉద్యోగుల సహకారంతో ప్రభుత్వం  ప్రభుత్వం పటిష్టంగా, సమర్ధంగా పనిచేస్తోందని మంత్రి యనమల తెలిపారు.

  సీసీఎల్  అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ రియల్‌టైమ్ గవర్నన్స్ ద్వారా పారదర్శక పాలన సాధించామన్నారు. జాప్యం లేకుండా ప్రజా సమప్యలను పరిష్కరించడంలో రియల్‌టైమ్ గవర్నెన్స్ ఎంతో దోహదపడుతోందని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ మాట్లాడుతూ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సకాలంలో అందించి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు నిధులు విడుదల అయ్యేలా అధికారులంతా కృషి చేస్తున్నారని వివరించారు.  కుటుంబ వికాసం, సమాజ వికాసం ద్వారా ప్రజలకు సంక్షేమం అందిస్తూ, కనీస అవసరాలు తీరుస్తున్నామని చెప్పారు. ఒక్కో కుటుంబానికి రోజుకు 55 లీటర్ల మంచినీరు అందేలా నీటి భద్రత కల్పిస్తున్నట్లు వివరించారు. గ్యాస్, ఆహారం, నీరు, విద్యుత్, పశువులకు పశుగ్రాసం తదితర అంశాలలో భద్రత కల్పిస్తున్న ప్రభుత్వం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని దినేశ్ కుమార్ అన్నారు. కుదుర్చుకున్న ప్రతి ఎంవోయూకు ఆచరణ రూపం కల్పిస్తున్నట్లు తెలిపారు.

(92)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ