WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మెజార్టీ కులాల మద్దతు బిజెపికే....!

దేశ వ్యాప్తంగా ఆసక్తి కల్గిస్తోన్న కర్ణాటక ఎన్నికలు...ఈ రోజు ముగిసాయి. సాయంత్రం ఆరు తరువాత ప్రకటించిన ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని...కొన్ని ఛానెల్స్‌ పేర్కొనగా..మరి కొన్ని మాత్రం బిజెపిదే అధికారం అని స్పష్టం చేశాయి. ఇంకొన్ని మాత్రం హంగ్‌ అసెంబ్లీ తప్పదని తేల్చాయి. అయితే...ఎగ్జిట్‌పోల్స్‌ సందర్భంగా ఇండియాటుడే..నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో...ఓటర్లు కులాల వారీగా పార్టీలను సమర్థించారని తేలింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న మెజార్టీ కులాల్లో ఎక్కువ కుల సంఘాలు బిజెపిని సమర్థించాయని తేలింది. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలు కాంగ్రెస్‌ పార్టీని సమర్థించారు. జనాభా పరంగా ఎక్కువ ఉన్న ఈ వర్గాలు కాంగ్రెస్‌ను సమర్థించడం ఆపార్టీ గెలుస్తుందని ఆ సర్వే పేర్కొంది. అయితే కుల సంఘాల్లో ఎక్కువ సంఘాలు బిజెపిని సమర్థించడం ఆసక్తికర పరిణామం. మరో వైపు జెడిఎస్‌ మాత్రం ఒక్కలిగ కులం మద్దతు గణనీయంగా పొందింది. మాజీ ప్రధాని దేవగౌడ ఈ కులానికి చెందిన వారే.

కాంగ్రెస్‌కు 6 కులాల మద్దతు: అధికార కాంగ్రెస్‌కు సాంప్రదాయంగా మద్దతు ఇస్తోన్న ఎస్సీ,ఎస్టీ,ముస్లిం వర్గాలు మళ్లీ ఆ పార్టీనే సమర్థించాయి. మొత్తం జనాభాలో 48శాతం ఉన్న ఈ వర్గాలు కాంగ్రెస్‌ను సమర్థించడంతో..ఆపార్టీ గెలుపు దిశగా దూసుకెళుతుందని స్పష్టం అవుతుంది. ఈ సర్వే ప్రకారం ఎస్టీలో 43శాతం, ఎస్సీలో 48శాతం, ముస్లింల్లో 80శాతం, కురబాల్లో 61శాతం క్రిస్టియన్స్‌లో 68శాతం,గొల్లల్లో 38శాతం మంది కాంగ్రెస్‌కు ఓటు వేశారు. మరో వైపు 33శాతం ఎస్టీలు, 26శాతం ఎస్సీలు, ఐదుశాతం ముస్లింలు, 22శాతం కురుబాలు, 18శాతం క్రిస్టియన్‌ ఓటర్లు బిజెపికి ఓటు వేశారు.

బిజెపికి 11 కులాల మద్దతు: కాగా...ప్రతిపక్ష బిజెపికి మొత్తం 11 కులాల మద్దతు ఎన్నికల్లో లభించినట్లు సర్వే తెలిపింది. దీనిలో లింగాయత్‌, బ్రాహ్మిన్స్‌, ఒబిసి, ఇతర అగ్రకులాలు ఓటు వేశారు. లింగాయత్‌ల్లో 62శాతం, బ్రాహ్మిన్స్‌లో 66శాతం, ఒబిసీల్లో 49శాతం బిజెపికి ఓటు వేశారు. అదేసమయంలో అగ్రకులాల్లో 57శాతం మద్దతు బిజెపికి లభించింది. మరాఠీ క్షత్రియల్లో 57శాతం, ఈడిగల్లో 54శాతం, నెకరాస్‌లో 53శాతం, రెడ్డి కులస్తుల్లో 51శాతం, బెస్తల్లో 42శాతం,ఉప్పర్లో 40శాతం, తమిళుల్లో 38శాతం బిజెపికి ఓటు వేశారు. ఎన్నికల్లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప కులానికి చెందిన లింగాయత్‌లకు ప్రత్యేక మతహోదా కల్పిస్తామన్న ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య ఎన్నికల హామీ పెద్దగా ప్రభావం చూపలేదు. లింగాయత్‌ల్లో మెజార్టీ ఓటర్లు బిజెపికే ఓటు వేశారు. కాగా బళ్లారి ప్రాంతంలో పట్టుఉన్న గాలి జనార్ధన్‌రెడ్డి బ్రదర్స్‌ ప్రభావం 'రెడ్డి' ఓటర్లపై పనిచేసిందని సర్వే స్పష్టం చేసింది.

ఒక్కిళ మద్దతు జెడిఎస్‌కే: కర్ణాటకలో మరో బలమైన కుల ఒక్కిళ. వీరు మాజీ ప్రధాని దేవగౌడకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. వీరిలో 54శాతం జెడిఎస్‌కు ఓటు వేశారు, 23శాతం బిజెపికి, 18శాతం కాంగ్రెస్‌కు ఓటు వేశారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములను ప్రభావితం చేసే కులాన్ని అన్ని పార్టీలు ముందుగానే గుర్తించి ఆయా కులాలకు తగిన రీతిలో సీట్లు కేటాయించారు. అయితే కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య ముస్లిం మైనార్టీలు, ఎస్సీ,ఎస్టీలపై దృష్టి పెట్టి ఆ ఓట్లు పెద్దగా చీలకుండా చూసుకున్నారు. దీంతో జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వీరి ఓట్లు ఏకపక్షంగా కాంగ్రెస్‌ వైపు మళ్లాయనే అభిప్రాయం ఉంది. దీంతో కాంగ్రెస్‌ కనాకష్టంగానైనా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో మెజార్టీ కులాల మద్దతు పొందినా..బిజెపి మాత్రం విజయతీరాలకు చేరలేదని స్పష్టమవుతోంది. మరి అసలైన ఫలితాలు చూడాలంటే 15వ తేదీ వరకు ఆగాల్సిందే.

(252)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ