లేటెస్ట్

తీవ్ర ఒత్తిడిలో 'సుజనాచౌదరి'...!

మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు 'సుజనాచౌదరి' తీవ్ర ఒత్తిడిలో ఉన్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల వరకు టిడిపిలో ఉండి బిజెపిలో చేరిన ఆయనకు స్వంత పార్టీ నాయకుల నుంచే ఒత్తిడి వస్తోంది. టిడిపిలో ఉంటే తనపై ఉన్న కేసులు, బ్యాంకుల అప్పుల గోల తదితరాలతో బిజెపి వేధిస్తుందనే భయంతోనే ఆయన పార్టీ మారారు. అయితే పార్టీ మారిన తరువాత..ఆయనపై బిజెపి అధిష్టానం పెట్టిన బాధ్యతల దెబ్బకు ఆయనకు దిమ్మ తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపిని ఎలాగైనా అధికారంలోకి తేవాలని, దీని కోసం ఏమి చేయాలో అది చేయమని ఆయనకు వారు బాధ్యతలు అప్పచెప్పారు. కనీసం ఒక్కశాతం కూడా ఓటు బ్యాంక్‌ లేని బిజెపిని ఎలా అధికారంలోకి తేవాలో, పార్టీని ఎలా పటిష్టం చేయాలో తెలియక ఆయన ఇబ్బందులు పడుతుంటే..స్వంత పార్టీలోని పాత నేతలు ఆయనపై చురకలు వేస్తున్నారు. ఆయన ఎక్కడ తమ కంటే ఎదిగిపోతారో..అన్న భయంతో..ఆయన కొత్తగా పార్టీలోకి వచ్చారని పదే పదే గుర్తు చేస్తూ. ఆయనపై ఉన్న కేసు గురించి ప్రస్తావిస్తూ ఒత్తిడి తెస్తున్నారు. అంతే కాకుండా అధికార వైకాపాకు అనుకూలంగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక వైపు 'సుజనా' వైకాపాపై పోరాడుతుంటే పార్టీలోని సీనియర్లు మాత్రం వైకాపాకు మద్దతు ఇస్తూ వ్యవహారాలను నడుపుతున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఆంధ్రా సిఎం జగన్మోహన్‌రెడ్డి హోంమంత్రితో సమావేశమైనప్పుడు ఆయనది సాధారణ సమావేశమేనని, 'జగన్‌' అమిత్‌షాకు జన్మదినశుభాకాంక్షలు చెప్పి వచ్చారని 'సుజనాచౌదరి' చెబితే..అలా జరగలేదని, హోంమంత్రితో 'జగన్‌' 45నిమిషాలు సమావేశమయ్యారని పాత నాయకులు లీకులు ఇచ్చి 'సుజనా'ను పలుచన చేశారు. ఎప్పటి నుంచో ఉంటున్న తమను కాదని 'సుజనా'ను ప్రోత్సహిస్తుంటే ఈ నేతలకు కడుపు మండిపోతోంది. అందుకే ఆయనకు సహకరించకుండా...ఆయనను విఫలనేతగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇది ఇలా ఉంటే టిడిపి నుంచి 'సుజనా' బయటకు వచ్చినప్పుడు చాలా మంది టిడిపి నాయకులు బిజెపిలోకి వస్తారని బిజెపి పెద్దలు ఆశించారు. అయితే..వారు అనుకున్నట్లు పేరున్న నాయకులెవరూ బిజెపిలో చేరలేదు. ఒకరూ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరినా..ఆ చేరికలకు ప్రాధాన్యత రాలేదు. టిడిపికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరతారని ఆ మధ్య వార్తలు వచ్చినా... ఎవరూ ఇప్పటి వరకు ఆ పార్టీలో చేరలేదు. తాజాగా..ఖాయంగా బిజెపిలో చేరతారని భావించిన 'గన్నవరం' ఎమ్మెల్యే 'వల్లభనేని వంశీ' ఆ పార్టీని కాదని వైకాపాలో చేరాలని నిర్ణయంచుకోవడం బిజెపి నేతలకు రుచించడం లేదు. 'సుజనా' వస్తే..టిడిపి నుంచి భారీగా వలసలు ఉంటాయని, టిడిపి ఖాళీ అవుతుందని, దాని స్థానంలో తాము ఎదుగుతామని ఆశలు పెట్టుకున్న బిజెపి పెద్దలకు టిడిపి నుంచి కదిలికలు లేకపోవడంతో 'సుజనా' వైపు అసహనంగా చూస్తున్నారు. దీంతో 'సుజనా' రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు పెట్టుకుని పర్యటిస్తున్నారు. పలువురు టిడిపి ఎమ్మెల్యేలతో ఆయన టచ్‌లో ఉంటున్నా..వారు ఇప్పటికిప్పుడు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా లేరు. ఒకరూ ఇద్దరూ ముందుకు వచ్చినా..భారీ స్థాయిలో టిడిపి ఎమ్మెల్యేలు, మాజీలు వస్తేనే బిజెపి పెద్దల వద్ద 'సుజనా' పలుకుబడి పెరుగుతుంది. కానీ..అటువంటి పరిస్థితులు ఇప్పట్లో కనిపించడం లేదు. మొత్తం మీద..ఒక వైపు స్వంత పార్టీ నేతల వ్యంగ్యాస్త్రాలు, మరో వైపు బిజెపి పెద్దల ఒత్తిడి, ఇంకోవైపు పెద్దగా లేని వలసలతో 'సుజనా' తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోతున్నారు. ఒకప్పుడు 'కన్నా' బిజెపిలో చేరితే..'కాపు' సామాజికవర్గం మొత్తం ఆయన వెంట వస్తుందని, కాపులు బిజెపితో కలిసి నడుస్తారని ఆశించిన బిజెపి పెద్దలకు అటువంటిది జరగకపోవడంతో..'కన్నా'ను విఫలనేతగా ముద్ర వేసి పక్కన పెట్టారు. అప్పుడు 'కన్నా' ఎదుర్కొన్న పరిస్థితినే నేడు 'సుజనా' ఎదుర్కొంటున్నారు. 'కన్నా'లాగా విఫలనేతగా మిగిలిపోగూడదనుకుంటే సత్వరం 'సుజనా' ఫలితాలను రాబట్టాల్సి ఉంటుంది. చూద్దాం..ఏమి జరుగుతుందో..? 

(890)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ