లేటెస్ట్

టిడిపి కంచుకోట 'గన్నవరం'...!

గన్నవరం టిడిపి ఎమ్మెల్యే 'వల్లభనేని వంశీ' టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా 'గన్నవరం' నియోజకవర్గం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. టిడిపికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన 'వంశీ' ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని కలవడంతో..ఆయన ఆ పార్టీలో చేరిపోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీన్ని ఆయన ఖండించడం లేదు. అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని మాత్రం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన రాజకీయాలకు దూరం కావడం లేదని, నవంబర్‌3వ తేదీన ఆయన వైకాపాలో చేరతారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆయన వైకాపాలో చేరితే 'జగన్‌' చెబుతున్న ప్రమాణాల ప్రకారం ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయన రాజీనామా చేస్తే...ఇక్కడ ఉప ఎన్నికలు తప్పవు. దీంతో..ఈ నియోజకవర్గంలో అప్పుడే రాజకీయ హడావుడి మొదలైంది. 'వంశీ' రాజీనామా చేస్తే..ఇక్కడ నుంచి టిడిపి తరుపున ఎవరు పోటీ చేస్తారు..? వైకాపా తరుపున అభ్యర్థి ఎవరు అవుతారనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 'వంశీ'కే వైకాపా టిక్కెట్‌ ఇస్తారా..? లేక వేరే వారికి ఇస్తారా..? చూడాల్సి ఉంది. కాగా ప్రతిపక్ష టిడిపి ఎవరిని బరిలోకి దింపుతుందనే దానిపై కూడా టిడిపి వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఆది నుంచి టిడిపివైపే...!

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి గన్నవరం నియోజకవర్గంలో టిడిపిదే పైచేయి. 1983లో టిడిపి పార్టీ ఆవిర్భవించిన తరువాత ఆ పార్టీ ఒక్కసారి తప్ప ప్రతిసారీ గెలుస్తూ వస్తోంది. 1983,1985,1994,1999,2004,2009,2014,2019ల్లో టిడిపి గెలిచింది. 1989లో మాత్రం కాంగ్రెస్‌ స్వల్ప తేడాతో టిడిపిపై గెలుపొందింది. అనాదిగా టిడిపికి గట్టిపట్టు ఉన్న ఈ నియోజకవర్గం నుంచి టిడిపికి చెందిన పలువురు నాయకులు పోటీ చేసి గెలుపొందారు. 1983లో టిడిపి అభ్యర్థి 'ముసునూరి రత్నబోస్‌' కాంగ్రెస్‌ అభ్యర్థి 'కొమ్మినేనిశేషగిరిరావు'పై గెలుపొందారు. 1985లో టిడిపి అభ్యర్థి 'ములుపూరు బాలకృష్ణారావు కాంగ్రెస్‌ అభ్యర్థి 'కొలసు పెద్ద బెదయ్య'పై విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్‌కు చెందిన 'ముసునూరు రత్నబోస్‌' టిడిపి అభ్యర్థి 'ములుపూరు బాల కృష్ణారావు'పై గెలుపొందారు. 1994లో టిడిపికి చెందిన 'గద్దె రామ్మోహన్‌రావు' ఇండిపెండెంట్‌గా పోటీ చేసి దాసరి వెంకట బాలవర్థన్‌రావుపై విజయం సాధించగా, 1999లో 'దాసరి బాలవర్థన్‌రావు' కాంగ్రెస్‌ అభ్యర్థి ముద్రబోయిన వెంకటేశ్వరరావుపై గెలుపొందారు. 2004లో 'ముద్రబోయిన వెంకటేశ్వరరావు' టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగి ఇండిపెండెంట్‌ అభ్యర్థి బాలవర్థన్‌రావుపై విజయం సాధించారు. 2009లో 'బాలవర్థన్‌రావు' టిడిపి తరుపున పోటీ చేసి 'ముద్రబోయిన'పై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో 'వల్లభనేని వంశీ మోహన్‌' వైకాపాకు చెందిన 'దుట్టా రామచంద్రరావు'పై విజయం సాధించారు. 2019లో కూడా 'వల్లభనేని' మరోసారి వైకాపాకు చెందిన 'యార్లగడ్డ వెంకట్రావు'పై స్వల్ప తేడాతో గెలుపొందారు. 

మూడుసార్లు గెలుపొందిన 'పుచ్చలపల్లి'...!

ఒకప్పుడు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు హోరాహోరిగా పోరాడిన ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టు సీనియర్‌ నేత 'పుచ్చలపల్లి సుందరయ్య' మూడుసార్లు గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు గెలుపొందిన నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత 'వల్లభనేని వంశీ', దాసరి బాలవర్థన్‌రావు'లు టిడిపి తరుపున రెండుసార్లు విజయం సాధించగా, 'ముసునూరు రత్నబోస్‌' ఒకసారి టిడిపి, మరోసారి కాంగ్రెస్‌ తరుపున గెలిచారు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌, ములుపూరు బాలకృష్ణారావు, ఆనందబాయి, సీతారావమ్మలు ఒక్కోసారి విజయం సాధించారు. ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం బలంగా కలిగిన ఈనియోజకవర్గం టిడిపి ఆవిర్భావం తరువాత ఆ పార్టీకి పెట్టని కోటగా మారింది. అయితే గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా గాలి వీచినా..ఇక్కడ టిడిపి అభ్యర్థి స్వల్ప తేడాతోనైనా విజయం సాధించి నియోజకవర్గంలో టిడిపికి ఎంత పట్టు ఉందో చాటారు. అయితే అది పార్టీ పట్టు కాదని, అభ్యర్థి 'వంశీ' వల్ల గెలిచారని ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే వైకాపా తరుపున 'వంశీ' బరిలోకి దిగితే ఆయన సునాయాసంగా విజయం సాధిస్తారని వారు చెబుతుండగా, అంత సీన్‌ లేదని, టిడిపి తరుపున ఎవరు బరిలో ఉన్నా..మరోసారి ఆ పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుందని ఆపార్టీకి చెందిన అభిమానులు చెప్పుకుంటున్నారు. చూద్దాం..'వంశీ'రాజీనామా ఆమోదం పొందిన తరువాత పరిస్థితులు ఎలా మారతాయో...!?

(314)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ