లేటెస్ట్

చిన్నపత్రికల సమస్యలపై 'సజ్జల' స్పందన అమోఘం...!

చిన్న,మధ్యతరహా పత్రికల అసోషియేషన్‌ రజతోత్సవ వేడుకలు గురువారం నాడు విజయవాడలోని హోటల్‌ మురళీ ఫ్యార్చూన్‌లో అంత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగాయి. రాష్ట్రంలో ఉన్న చిన్న పత్రికల సంఘాలకు భిన్నంగా తనదైన శైలిలో చిన్న,మధ్యతరహా పత్రికల అసోషియేషన్‌ ఎప్పటి వలే తన విశిష్టతను చాటుకుంటూ సంఘం రజతోత్సవాలను విజయం వంతం చేసింది. సంఘ రజత్సోవాలకు రాష్ట్రంలోని 13 జిల్లాలోని చిన్న పత్రికల సంపాదకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు 'సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్‌ పాలసీ) కె.రామచంద్రమూర్తి, రాష్ట్ర పౌరసంబంధాలశాఖ కమీషనర్‌ మరియు ఎక్స్‌అఫీషియో సెక్రటరీ 'తమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి'లు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న 'సజ్జల' ప్రసంగం ఆసక్తిగా, స్ఫూర్తిదాయకంగా సాగింది. చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంపాదకులు, పబ్లిషర్స్‌ కష్టాల గురించి ఆయన విపులంగా మాట్లాడుతూ వాటిని ఎలా అధిగమించవచ్చో వివరించారు. మన రాష్ట్రంలో చిన్న పత్రికలు చాలా తక్కువగా ఉన్నాయని, స్థానిక సమస్యల పరిష్కారంలో చిన్న పత్రికలు చొరవ తీసుకోవాలని, తద్వారా వాటి సర్కులేషన్‌, ఆదాయ మార్గాలు పెరుగుతాయని, జర్నలిస్టు కులం నుంచి వచ్చిన తనకు ప్రస్తుతం పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రస్తుతం డిజిటల్‌, షోషల్‌ మీడియాల వల్ల ప్రజలకు విరివిగా సమాచారం లభిస్తున్నదన్నారు. చిన్నపత్రికలు స్థానిక సమస్యలు వెలికి తీస్తే ప్రభుత్వం స్పందిస్తుందని, తద్వారా సమాజానికి మేలు చేయడంతో పాటు...తమ ఉనికి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు. అమెరికాలో చిన్న పత్రికలు స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, దాంతో వాటికి బాగా ఆదరణ పెరుగుతోందని, ఇక్కడ ఉన్న పత్రికలు కూడా అదే విధంగా చేయాలన్నారు. ప్రభుత్వానికి చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తెలుసునని, వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సహకరిస్తారన్నారు. 'చిన్న, మధ్యతరహా పత్రికల అసోషియేషన్‌ రజతోత్సవాలను జరుపుకుంటుందని, ఈ సంఘం మరో 50ఏళ్ల పాటు మనగలగాలని, సంఘం గౌరవాధ్యక్షులు 'రంగసాయిగారి'తో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందన్నారు. సంఘం నిబద్దతో, అంకితభావంతో పనిచేస్తుందని, జర్నలిస్టు సమాజం నుంచి వచ్చిన వ్యక్తిగా తాను సంఘానికి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

ముఖ్య అతిథిగా వచ్చిన 'సజ్జల' ప్రసంగంపై సభకు హాజరైన పత్రికా సంపాదకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగం స్ఫూర్తిదాయకంగా సాగిందని, పత్రికల మనుగడను కాపాడుకోవడానికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉందంటూనే, స్థానిక అంశాలపై చిన్న పత్రికలు స్పందించి వాటిని ప్రభుత్వ దృష్టికి తెచ్చి..వాటిని సర్కులేషన్‌ పెంచుకోవాలన్న సూచన అందరినీ ఆకర్షించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో వివిధ సమావేశాలతో బిజీగా ఉండి కూడా ఆయన చిన్నపత్రికలపై ఉన్న అభిమానంతో సమావేశానికి హాజరయ్యారని, సమావేశం పూర్తి అయ్యే వరకు ఆసాంతం ఉండి వారిని ప్రోత్సహించడంపై సర్వత్రా ఆయనకు ప్రశంసలు లభిస్తున్నాయి. మరో ముఖ్య అతిథిగా హాజరైన 'కె.రామచంద్రమూర్తి' తన అనుభవాలను పత్రికా సంపాదకులతో పంచుకున్నారు. సమాచార కమీషనర్‌ 'విజయ్‌కుమార్‌రెడ్డి' తనదైన శైలిలో ప్రసంగించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రకటనల రేట్లు పెంచడంలో ఆయన చొరవ తీసుకున్నారని, అదే విధంగా హెల్త్‌కార్డులు, ఇళ్లస్థలాలు విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని త్వరలోనే ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షులు 'రంగసాయి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చిన్న,మధ్యతరహాపత్రికల అధ్యక్షుడు 'తిలక్‌, సంఘ ప్రధాన కార్యదర్శి 'శ్రీనివాస్‌' తదితరులు పాల్గొన్నారు. 

(361)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ